Couple Friendly Movie Review : కపుల్ ఫ్రెండ్లీ మూవీ కంప్లీట్ రివ్యూ

రివ్యూ : కపుల్ ఫ్రెండ్లీ
ఆర్టిస్ట్స్ : సంతోష్ శోభన్, మానస వారణాసి, యోగిబాబు, రాజీవ్ కనకాల, లివింగ్ స్టన్, గోపరాజు రమణ తదితరులు
ఎడిటర్ : గణేష్ శివ
సంగీతం : ఆదిత్య రవీంద్రన్
సినిమాటోగ్రఫీ : దినేష్ పురుషోత్తమన్
నిర్మాతలు : యూవీ కాన్సెప్ట్స్ - అజయ్ కుమార్ రాజు. పి
దర్శకత్వం : అశ్విన్ చంద్రశేఖర్
కొన్ని సినిమాలు ఫీల్ గుడ్ గా ఉండబోతున్నాయి అని ముందే తెలిసిపోతుంది. ఈ కథ విషయంలో ఓ క్లారిటీ కూడా ఉంటుంది. కాకపోతే అవి ఎలా ప్రజెంట్ చేశారు అనే డౌట్ ఉంటుంది. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన మూవీ విషయంలో కూడా ఇదే అనిపిస్తుంది. టీజర్, ట్రైలర్ చూసినవాళ్లంతా సినిమా మొత్తం ప్రధానంగా ఆ ఇద్దరిపైనే ఉంటుంది అనిపిస్తుంది. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది చూద్దాం.
కథ :
శివ(సంతోష్ శోభన్) ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. చదువు అయిన తర్వాత సరైన ఉద్యోగం ఉండదు. ఆ కారణంగా తను ప్రేమించిన అమ్మాయి వదిలేస్తుంది. ఇంట్లో తండ్రి తెగ తిడుతుంటాడు. దీంతో చెన్నై వెళ్లిపోతాడు. మాములుగా అతను ఆర్కిటెక్ట్ చదువుకుని ఉంటాడు. ఆ చదువుకు తగ్గ కొలువు కోసం ప్రయత్నిస్తూ.. బైక్ పూలింగ్ చేస్తూ ఉంటాడు. చిత్ర.. చిత్తూరు నుంచి చెన్నై వెళుతుంది. తను సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. హాస్టల్ లో ఉంటుంది. ఓ సారి ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. అది శివ బైక్ పై వస్తుంది. కట్ చేస్తే తన నిర్ణయం మార్చుకుంటుంది. మళ్లీ చెన్నైలోనే ఉండిపోవాలనుకుంటుంది. ఈ క్రమంలో హాస్టల్ లో ఖాళీ ఉండదు. అందుకోసం రోజంతా శివ బైక్ పై హాస్టల్ కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. చివరికి అతనే తన రూమ్ లో ఉండమని అడుగుతాడు. మొదట ఇబ్బంది పడ్డా.. తర్వాత ఒప్పుకుంటుంది. అక్కడి నుంచి వీరి అసలైన జర్నీ మొదలవుతుంది. మెల్లగా శారీరకంగా కలవడం.. ఆపై ప్రేమలో పడిపోవడం.. తర్వాత ఇబ్బందులు, అలకలు, పోట్లాటలు కామన్ అవుతాయి. అప్పుడు చిత్ర ఫ్యామిలీ ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత వీరి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. మరి ఆ మార్పులు ఏంటీ..? చివరికి వీరు పెళ్లి చేసుకుంటారా లేదా అనేది తెలియడానికి ముందు అద్భుతమైన ట్విస్ట్ మాత్రం హృదయాలకు హత్తుకునేలా ఉండిపోతుంది. మరి అదేంటనేది సినిమా మొత్తం చూస్తే కానీ తెలియదు.
ఎలా ఉంది :
కొన్ని కథలు పేపర్ పై బావుంటాయి. మరికొన్ని సినిమాగానే బావుంటాయి. ఈ రెండూ మిక్స్ అయిన సినిమాగా కపుల్ ఫ్రెండ్లీ కనిపిస్తుంది. జెన్ జీ బ్యాచ్ కి సెట్ అయ్యే కథలాగా ఫస్ట్ హాఫ్ లో ఉంటుంది. సెకండ్ హాఫ్ లో పాత తరంకు కనెక్ట్ అయ్యే కథనం ఉంటుంది. ఇలాంటి కథలు ఎక్స్ పెక్ట్ చేస్తాం. బట్ కథనం కట్టిపడేస్తుంది. హృదయాలకు హత్తుకునేలా సెకండ్ హాఫ్ ఆసాంతం కనిపిస్తుంది. ఈ మూవీలో ఉండే ట్విస్ట్ మాత్రం రివీల్ చేయలేం. బట్ కథనంగా మాత్రం అద్భుతంగా ఉంది. ఫస్ట్ హాఫ్ లో హాస్టల్ కోసం చేసిన ప్రయత్నాలన్నీ సాగదీసినట్టుగా ఉంటూనే ఆకట్టుకునేలా ఉంటాయి. ఆపై ఇద్దరి మధ్య ప్రణయం మొదలవుతుంది. దీంతో పాటు శివను ఆర్కిటెక్ట్ గా సెటిల్ చేసే విషయంలో చిత్ర బాగా పనిచేస్తుంది. తను మాత్రం సాఫ్ట్ వేర్ ఎంప్లాయి కావాలనే ప్రయత్నాలు సాగుతూనే ఉంటాయి. మరోవైపు ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు చూసే పనిలో ఉండిపోతారు. చివరికి ఇంట్లో వాళ్లు పెళ్లి కూడా సెటిల్ చేస్తారు. కానీ ఆమె కుటుంబంతో పోరాటం చేస్తుంది. తను ప్రేమించిన వాడిని పెళ్లే చేసుకోవాలని కోరుతుంటుంది. చివరికి అనుకోని ఇబ్బందులు మొదలవుతాయి. అక్కడి కథనం కళ్లు తిప్పుకునే ఛాన్స్ కూడా లేకుండా సాగుతుంది. ఆద్యంతం మనసులను మెలిపెట్టే సన్నివేశాలు సాగుతూనే ఉంటాయి. అయితే ఫస్ట్ హాఫ్ లో మొదటి నుంచి సెకండ్ హాఫ్ లో వచ్చే కేరళ ఎపిసోడ్ ను నాన్ లీనియర్ గా చెప్పడం చాలా బావుంది. అదేదో ఆ ఇద్దరూ పారిపోయినట్టుగా చూపిస్తారు. బట్ వాళ్లు వెళ్లిన కారణం తెలిసి గుండె బరువెక్కిపోతుంది. దీంతో పాటు శివ ఫ్యామిలీ సమస్య కూడా ఉంటుంది. మొత్తంగా ఓ అద్భుతమైన సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
నటన పరంగా చూస్తే సంతోష్ శోభన్ ఈ పాత్రలో జీవించాడు. చాలా గొప్ప నటన చూపించాడు. ఎక్కడా అతికి పోకుండా అత్యంత సహజంగా నటించాడు. మానస వారణాసి సైతం అద్భుతంగా నటించింది. తన పాత్రలోని వేరియేషన్స్ ను సెటిల్డ్ గా, చాలా మెచ్యూర్డ్ గా చూపిస్తుంది. రాజీవ్ కనకాల సీన్స్ చివర్లో అదిరిపోతాయి. గోపరాజు రమణ సైతం ఆకట్టుకున్నాడు. తమిళ్ నటుడు యోగిబాబు కామెడీ కాదు ఓ పాత్రగా మెప్పించాడు. లివింగ్ స్టన్ సైతం ఓకే అనిపించాడు. మామూలుగా ఎన్ని పాత్రలు ఉన్నా.. సంతోష్, మానస మాత్రం అత్యద్భుతమైన నటనతో సినిమాను ఓన్ చేసుకున్నారు.
సంగీతం పరంగా ఇంకాస్త బావుండు అనిపిస్తుంది. కానీ పాటలు పట్టి పట్టి చూస్తే అర్థం అవుతాయి. సాహిత్యం చాలా బావుంది. నేపథ్య సంగీతం సైతం బావుంది. సినిమాటోగ్రఫీ బ్యూటీఫుల్ గా సహజంగా ఉంది. ఎడిటింగ్ పరంగా చాలా బావుంది. ఈ తరహా కథల్లో అద్భుతమైన డైలాగ్స్ ఎక్స్ పెక్ట్ చేస్తాం.. బట్ ఈ జెనరేషన్ కు తగ్గట్టుగా సింపుల్ గా రాయడం చాలా బావుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ ఫస్ట్ మూవీతోనే బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు. గొప్ప దర్శకత్వం కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో చాలా బాగా రాసుకున్నాడు. సింపుల్ గా చెబితే.. మనుషులు ఎప్పుడూ శాశ్వతం కాదు.. కానీ వారితో గడిపిన కాలం మాత్రం నిత్య జ్ఞాపకంగా నిలిచిపోతుంది. ఆ జ్ఞాపకాల్ని దాచుకోవడమే జీవితం.. అంటుందీ మూవీ.
ఫైనల్ గా : కపుల్ ఫ్రెండ్లీ.. అద్భుతమైన ప్రేమకథ
రేటింగ్ : 3/5
బాబురావు కామళ్ల
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
