Dear Megha Movie Review: డియర్ మేఘ.. ఓ అందమైన జ్ఞాపకం.. మూవీ రివ్యూ

చిత్రం: డియర్ మేఘ
నటీనటులు: మేఘా ఆకాష్, అరుణ్ అదిత్, అర్జున్ సోమయాజులు, పవిత్ర లోకేష్
సంగీతం: హరి గౌర
ఛాయాగ్రహణం: ఐ.ఆండ్రూ
నిర్మాత: అర్జున్ దాస్యన్
దర్శకత్వం: ఎ.సుశాంత్ రెడ్డి
విడుదల తేదీ: 2021సెప్టెంబర్ 3
విడుదలకు ముందే పాటలు, ప్రచార చిత్రాలతో అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రం `డియర్ మేఘ'. కన్నడలో విజయవంతమైన `దియా'కు రీమేక్‌గా రూపొందింది. టైటిల్ పాత్రను మేఘా ఆకాష్ పోషించగా.. అరుణ్ అదిత్, అర్జున్ సోమయాజులు కథానాయకులుగా నటించారు. ఎ.సుశాంత్ రెడ్డి తెరకెక్కించారు. ''మనసుల్ని బరువెక్కించే హృద్యమైన ప్రేమకథ'' అంటూ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ఈ చిత్రం.. అందుకు తగ్గట్లుగానే ఆకట్టుకుందా? బాక్సాఫీస్ ముందు హిట్ అనిపించుకుందా? చూద్ధాం..
కథేంటంటే: మేఘ స్వరూప్ (మేఘా ఆకాష్) కాలేజీలో తన సీనియర్ అర్జున్ (అర్జున్ సోమయాజులు)ని గాఢంగా ప్రేమిస్తుంది. తన మనసులోని మాటను అతనికి ఎన్నోసార్లు చెప్పాలని ప్రయత్నిస్తుంది. కానీ, ధైర్యం చాలక ప్రతిసారి ఆగిపోతుంటుంది. ఈలోపు అర్జున్ కాలేజీ వదిలి సింగపూర్ వెళ్లిపోతాడు. మూడేళ్ల తర్వాత అర్జున్ ముంబయిలో మేఘ ముందు ప్రత్యక్షమవుతాడు. కాలేజీ రోజుల్లోనే తాను కూడా గాఢంగా ప్రేమించినట్లు చెప్పి.. మేఘకు షాకిస్తాడు. తర్వాత ఇద్దరూ ప్రేమలో మునిగిపోతారు.
ఈ క్రమంలో రోడ్డు ప్రమాదంలో అర్జున్ మేఘకు దూరమవుతాడు. అతన్ని మర్చిపోలేక ఓరోజు మేఘ ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుంది. అదే సమయంలో ఆమె జీవితంలోకి వస్తాడు ఆది(అరుణ్ అదిత్) అతని స్నేహంతో ఆమె జీవితం మళ్లీ కొత్తగా చిగురిస్తుంది. ఈ ఇద్దరి స్నేహం ప్రేమగా మారుతున్న సమయంలో అర్జున్ బతికే ఉన్నాడని తెలుస్తుంది. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపు తిరిగింది? అర్జున్ , ఆదిలలో మేఘ ఎవరి ప్రేమను పొందిందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
కథనం : ఇదొక ముక్కోణపు ప్రేమకథ. నిజానికి ఇలాంటి కథలు తెలుగు తెరకు కొత్తేమీ కాదు. కాకపోతే ఇందులో ప్రేమకథను కొత్తగా కథానాయిక కోణం నుంచి నడిపించే ప్రయత్నం బాగుంది. లవ్ ఫెయిల్యూర్ కి సింబల్ గా మగవారే కనిపించారు. సమాజం లో కూడా లవ్ ఫెయిల్ లోని బాధ మగవారి హక్కుగానే చూసింది. కానీ లవ్ ఫెయిల్ అయిన అమ్మాయి జీవితం తెర మీద కొత్త గా ఉంది.
మాతృకతో పోల్చి చూసినప్పుడు దర్శకుడు ఆ కథని ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా యథాతథంగా చూపించినట్లు అర్థమవుతుంది. వాస్తవానికి ఇలాంటి సున్నితమైన ప్రేమకథల్ని ముట్టుకున్నప్పుడు.. ఆ కథలోని ఫీల్‌ను యథాతథంగా క్యారీ చేయగలగడం ఎంతో ముఖ్యం. ఆ విషయంలో దర్శకుడు తన పంథా లో వెళ్ళి పోయాడు. మేఘా రైలు పట్టాలపై ఆత్మహత్యకు సిద్ధమవుతున్న సన్నివేశంతో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. అక్కడి నుంచి నెమ్మదిగా ఆమె కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు దర్శకుడు. కాలేజీలో మేఘ చాటుమాటుగా అర్జున్ వెంటపడటం.. దూరంగా ఉంటూనే అతన్ని ఆరాధిస్తుండటం వంటి సన్నివేశాలతో సాదాసీదాగా సాగిపోతుంది. మేఘ-అర్జున్ ల లవ్ ట్రాక్ లో కనిపించే ఫీల్ తొలిప్రేమ లోని భావోద్వేగాలతో నింపేసాడు దర్శకుడు.
ఎప్పుడైతే ఆది మేఘ జీవితంలోకి వస్తాడో అప్పటి నుంచి కథనంలో వేగం పెరుగుతుంది. స్నేహితుల మధ్య ఆకర్షణ ప్రేమగా మారడం, ఆ ప్రేమను వ్యక్తపరుచుకోడానికి పడే తపన ప్రేమికులకు బాగా నచ్చుతుంది. ఆది తన తల్లికి రాసిన లెటర్ చదివే విధానం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలోనే ప్రేక్షకుడు కొంత సినిమాపై ప్రేమను ఫీలవుతాడు. ఈ కథను తమ భుజాలపై మోసుకెళ్లారు మేఘ, ఆదిత్. మేఘ చక్కటి భావోద్వేగాలను పండించి మేఘ స్వరూప్ పాత్రకు ప్రాణం పోసింది. ఆద్యంతం ప్రేమను ఫీలయ్యే అమ్మాయిగా తనలోని సంఘర్షణను తెరపై ఆవిష్కరించింది.
ఆది పాత్రలో అరుణ్ అదిత్ చలాకీ కుర్రాడిగా చక్కగా ఒదిగిపోయాడు. ప్రేమికుడిగా తన నటన చలాకీగా... తల్లితో వచ్చే సన్నివేశాల్లో అదిత్ నటన ఆకట్టుకుంటుంది. అర్జున్ సోమయాజులు తన నటన పట్ల మరింత దృష్టి పెట్టాల్సింది. లక్కి పాత్రలో నటించిన పవిత్ర లోకేష్ తల్లి పాత్రలో ఎప్పటిలాగే చేసుకుంటూపోయారు. దర్శకుడు సుశాంత్ రెడ్డి టేకింగ్ బాగుంది. మాతృకను ఎక్కడ చెడగొట్టకుండా చిన్నచిన్న మార్పులతో కథనాన్ని చక్కగా తీర్చిదిద్దారు. మేఘా, ఆదిల మధ్య వచ్చే సంభాషణలతోపాటు ప్రేమను వ్యక్తపరిచే సందర్భంలో ఒక టచ్ వేయి పదాలతో సమానమనే మాటలు నవతరం ప్రేమికుల మనసును తాకుతాయి.
హరిగౌర పాటలు, నేపథ్య సంగీతం డియర్ మేఘాకు బలాన్ని చేకూర్చాయి. ప్రతి సన్నివేశానికి ప్రాణం పెట్టినట్టు కనిపించింది. ఆండ్రూ కెమెరా చిత్రీకరించిన దృశ్యాలు కనువిందుగా ఉన్నాయి. సాంకేతికంగా, నిర్మాణ పరంగా ఉన్నత స్థాయి లో ఉంది.
చివరిగా: డియర్ మేఘా... ఎమోషనల్ లవ్ స్టోరి.
ఈ ప్రేమ కథ ఒక జ్ఞాపకం గా మిగిలి పోతుంది..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com