Devara movie Review : రివ్యూ : దేవర
రివ్యూ : దేవర
తారాగణం : ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, అజయ్, సృష్టి మరాఠే, శ్రీకాంత్ తదితరులు
ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్
సంగీతం : అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ : రత్నవేలు
నిర్మాతలు : సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ
దర్శకత్వం : కొరటాల శివ
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ ప్యాన్ ఇండియా స్థాయిలో పెరిగింది. ఆ ఇమేజ్ ను నెక్ట్స్ లెవల్ కు తీసుకువెళ్లాలంటే ఆ స్థాయి ఉన్న దర్శకుడితో సినిమా చేయాలి. బట్ అతను మాత్రం ఆచార్యతో ఆల్ టైమ్ డిజాస్టర్ ఇచ్చిన కొరటాల శివతో కమిట్ అయ్యాడు. మొదటే చాలామంది వద్దన్నారు. అతను ముందుకే వెళ్లాడు. ట్రైలర్స్ తో ఇంపాక్ట్ క్రియేట్ కాలేదు. కానీ అనూహ్యంగా రిలీజ్ కు ముందు భారీ బజ్ వచ్చింది. తెలుగులో ప్రాపర్ ప్రమోషన్స్ లేకపోయినా ఎన్టీఆర్ ఇమేజ్ కారణంగా అంచనాలు పెరిగాయి. వాల్డ్ వైడ్ గా నార్త్ అమెరికాలో రికార్డులు క్రియేట్ చేసింది. అదే టైమ్ లో విపరీతమైన నెగెటివిటీని కూడా ఎదుర్కొంది. మరి ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉంది అనేది చూద్దాం.
కథ :
ఆంధ్ర తమిళనాడు బార్డర్ లో ఉన్న నాలుగు గ్రామాలు.. బ్రిటీష్ కాలంలో ఇంగ్లీష్ వాళ్లు మన వారి సంపదను దోచుకుని వారి దేశాలకు తరలించుకునే క్రమంలో ఈ గ్రామాల్లోని వ్యక్తులు, ఏ మాత్రం దయా దాక్షిణ్యాలు లేకుండా బ్రిటీష్ వారిని మట్టు పెట్టి ఆ సంపదను స్థానిక రాజులకు అప్పగిస్తూ.. వారి వద్ద కొంత నగదు తీసుకుని జీవితాలను గడుపుతుంటారు. వీరికి ఆయుధాలే దేవుళ్లు. సంపద కంటే దేశభక్తిపైనే ఎక్కువ గురి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వారికి పని ఉండదు. కొన్ని తరాలు గడిచిన తర్వాత అదే తెగలోని వ్యక్తులు ఇక్కడి వారికి స్మగులింగ్ గూడ్స్ ను అప్పగిస్తూ.. వారి వద్ద నగదు తీసుకుంటూ.. జీవితం గడుపుతుంటారు. ఈ క్రమంలో అక్కడి పెద్దల్లో దేవర (ఎన్టీఆర్), భైరా(సైఫ్ అలీఖాన్) ప్రధానమైన వ్యక్తులు. వీరందరికీ దేవరకు టీనేజ్ కొడుకులు ఉంటారు. అలా ఓ సారి సముద్రంలోకి వెళ్లి వారు తెచ్చిన స్మగులింగ్ గూడ్స్ వల్ల తమ గ్రామాల్లోని ప్రజలే ప్రాణాలు కోల్పోతారు. కేవలం భుక్తి కోసమే చేసే ఆ పని ఓ ప్రమాదకరమైనది అని తెలుసుకున్న దేవర అందరిని ఆ పని ఆపేసి చేపల వేటతో బ్రతకాలని ఆదేశిస్తాడు. ఇది నచ్చని మిగతా వాళ్లంతా అతన్ని చంపాలని ప్రణాళిక వేస్తారు. ప్రయత్నిస్తారు కూడా. దేవర వారందరినీ సంహరించి మాయం అవుతాడు. ఇకపై ఎవరైనా సముద్రంలో అలాంటి చట్ట వ్యతిరేక పనికి వెళితే ఇలాగే చంపేస్తానని బెదిరింపుతో కూడిన ఒక వార్తను అక్కడ పెడతాడు. మరి దేవర ఎక్కడికి వెళ్లాడు. అతని తనయుడు వర (ఎన్టీఆర్) తండ్రిలాగే ధైర్యంతో కాకుండా పిరికివాడగా మిగిలిపోతాడు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో సంభవించిన మార్పులేంటీ ..? దేవర ఆజ్నను కాదని ఇంకెవరైనా సముద్రంలోకి వెళ్లారా.. వెళితే ఏమయ్యారు..? అనేది మిగతా కథ.
ఎలా ఉంది..?
కొన్ని కథలు కథగా అద్భుతంగా ఉంటాయి. తెరపై అంతే అద్భుతంగా ఉంటాయా అంటే కొన్నిసార్లు అంతకు మించి కనిపిస్తాయి. కొన్నిసార్లు కాస్త తక్కువగా కనిపిస్తాయి. దేవర కథ కూడా అంతే. మనిషి బ్రతకడానికి కావాల్సినంత ధైర్యం ఉంటే చాలు.. చంపేంత ధైర్యం అక్కర్లేదు అనేది కచ్చితంగా తెలుగు సినిమాల్లో కొత్త పాయింటే. ఆ పాయింట్ ను ఎఫెక్టివ్ గా చెప్పడంలో దర్శకుడు కొరటాల శివ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడా అంటే లేదు అనే చెప్పాలి. అలాగని అంతా భయపడ్డట్టుగా ఆచార్య కాదు ఇది. రాజమౌళి మూవీ తర్వాత డిజాస్టర్ వస్తుంది అనే సెంటిమెంట్ ను బ్రేక్ చేసే సినిమానే అవుతుంది.
కథ ఎత్తుకోవడంలోనే ఒక ఇంటెన్సిటీతో మొదలవుతుంది. ఇద్దరు కరడు గట్టిన వ్యక్తులన పట్టుకునేందుకు రా డిపార్ట్మెంట్ వెదుకులాటతో మొదలయ్యి.. భైరా ఉంటే ప్రాంతానికి చేరుకోవడం.. అక్కడ భయంతో వణికిపోతున్న భైరా నుంచి సింగప్ప( ప్రకాష్ రాజ్) వారిలో ఆ భయాన్ని పుట్టించిన వాడి కథ అంటూ దేవర కథ చెప్పడంతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వీరు సముద్రంలో షిప్పుల నుంచి దొంగ సరుకులను కోస్ట్ గార్డ్ వారికి దొరకకుండా చాక చక్యంగా కొట్టేయడం అనే పాయింట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తర్వాత అదే వృత్తిని వదిలేసుకోవాలనే నిర్ణయానికి రావడానికి వాడిన కుర్రాడి హత్య అంత ప్రభావవంతంగా లేకపోయినా.. మరొకరిని చంపకూడదు అన్న దేవర నియమానికి సరిపోతుంది. షిప్ లో కోస్ట్ గార్డ్ పోలీస్ మాటలతో రియలైజ్ అయిన దేవర అసలు ఈ వృత్తినే వదిలేయాలని అందరినీ శాసించడం అనే పాయింట్ ఎఫెక్టివ్ గా ఉంది. అంతకు ముందే ఆయుధ పూజకు సంబంధించిన పాట ఓ హై ఎనర్జీని ఇస్తే.. ఆ తర్వాత వచ్చే యాక్షన్ ఎపిసోడ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ సందర్భంగా అనిరుధ్ అదరగొట్టాడు. కొత్త తరహా ఇన్ స్ట్రుమెంటేషన్స్ తో ఓ ప్రయోగం చేశాడు అది అర్థమైతే ఈ నేపథ్య సంగీతం కనెక్ట్ అవుతుంది. ఇంటర్వెల్ కు ముందు కాస్త డల్ అయినట్టు అనిపించినా.. ఒక భారీ ఫైట్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడటం.. ఆ ఫైట్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉండటం.. ఫస్ట్ హాఫ్ లో వచ్చే మూడో హైలెట్.
ఇక సెకండ్ హాఫ్ మొత్తం కాస్త ఊహించిన విధంగానే సాగడం కొంత అసంతృప్తిగా ఉంటుంది. అలాగ దేవర తనయుడు వర పిరికి వాడుగా కనిపిస్తూనే తనకే తెలియని శక్తిని ప్రదర్శించే క్రమంలో వచ్చే ఆయుధ పూజ ఫైట్, ఆ తర్వాత దేవర తన తల్లి కోసం వచ్చి వెళ్లే క్రమంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. ఈ సీక్వెన్స్.. అపోకలిప్టో లోని హీరో తప్పించుకుని మళ్లీ అడవిలోకి వెళ్లేంత ఎఫెక్టివ్ గా కనిపిస్తుంది. పిక్చరైజేషన్ నెక్ట్స్ లెవల్ అని చెప్పాలి.
ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా మరో స్థాయికి వెళుతుంది. క్లైమాక్స్ ఊహించని విధంగా ఎండ్ కావడం ఆశ్చర్యపరుస్తుంది. సీక్వెల్ కు బాహుబలి తరహా ట్విస్ట్ ను ఎంచుకున్నా.. పాయింట్, ప్లాట్ వేరు కాబట్టి ఖచ్చితంగా దేవర 2పై అంచనాలు పెరుగుతాయి.
నటన పరంగా ఎన్టీఆర్ మరోసారి తనలోని అద్భుతమైన నటుడిని చూపించాడు. మైన్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ను కూడా చాలా ఎఫెక్టివ్ గా పలికించాడు. యాక్షన్ లోనూ డ్యాన్స్ లోనూ మరోసారి తనకు తిరుగులేదు అనిపించాడు. ఓ రకంగా తెరంతా చాలామంది ఆర్టిస్టులున్నా.. ఎన్టీఆర్ ముందు అంతా తేలిపోయారు. ఆ రేంజ్ లో ఉంది తన పర్ఫార్మెన్స్. మరోసారి గొప్ప నటన చూపించాడు. సైఫ్ విలన్ గా బావున్నాడు. తన డబ్బింగ్ అంతగా నప్పలేదు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, కలై రాసన్, షన్ టామ్ చాకో, నరేన్ పాత్రలు ఆయా సందర్భాల్లో ఆకట్టుకుంటాయి. ఎన్టీఆర్ భార్య పాత్రలో మరాఠీ నటి సృష్టి మరాఠే అందంగా, హుందాగా ఉంది. జాన్వీ కపూర్ పాత్ర పూర్తిగా నిరాశపరిచింది. తనలో మంచి నటిఉంది అని అర్థం అవుతుంది. బట్ ఓ వ్యాంప్ తరహా పాత్రలో తనను ప్రెజెంట్ చేశాడు కొరటాల శివ. ఈ విషయంలో తనకు ఇది బెస్ట్ తెలుగు ఎంట్రీ అని చెప్పలేం. మిగతా అంతా బాగా చేశారు.
టెక్నికల్ గా ఈ మూవీకి సినిమాటోగ్రఫీ హైలెట్. ఆ ప్రాంతానికి సంబంధించిన మూడ్ ను క్రియేట్ చేయడంలోనూ హైలెట్ చేయడంలోనూ రత్నవేలు తన సీనియారిటీని మరోసారి చూపించాడు. సముద్రంలో వచ్చే సీన్స్ తో పాటు క్లైమాక్స్ లో అండర్ వాటర్ ఫైట్ సీన్ ను అద్భుతంగా పిక్చరైజ్ చేశాడు. అలాగే ఇంటర్వెల్ కు ముందు ఫైట్, తర్వాత అడవిలో వచ్చే ఛేజింగ్ సీన్స్ అంత ఎఫెక్టివ్ గా కనిపించడానికి రత్నవేలు ప్రతిభే కారణం అని చెప్పొచ్చు. అనిరుధ్ అంచనాలను అందుకోలేదు. కొన్ని సన్నివేశాలను అతని ఆర్ఆర్ వల్లే నీరసంగా అనిపించాయంటే తప్పేం లేదు. బట్ కొన్ని సందర్భాల్లో మాత్రం అదరగొట్టాడు. మరి ఈ వైరుధ్యానికి కారణం ఏంటో మేకర్స్ కే తెలియాలి. ఎడిటింగ్ పరంగా మూడు గంటల సినిమాలో చాలా వరకూ తీసేయొచ్చు. ముఖ్యంగా తారక్ పొన్నప్ప సీన్స్ కథకు, ఏ మాత్రం అవసరం లేనివి. ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఇది దర్శకుడి టేక్ కాబట్టి ఎడిటర్ ను ఏం అనలేం. విజువల్ ఎఫెక్ట్స్ సైతం అంత గొప్పగా కనిపించలేదు. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ లో కొంత బెటర్ అనిపిస్తాయి. కాస్ట్యూమ్స్, డైలాగ్స్, ఆర్ట్ వర్క్, సెట్స్ అన్నీ చాలా బావున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నా.. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ విషయంలో ఇంకాస్త ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సింది అనిపిస్తుంది. దర్శకుడుగా కొరటాల శివ కథలు సెటిల్డ్ గా ఉంటాయి. ఒక విషయాన్ని బలంగా చెప్పే క్రమంలో అతని పాత్రలు కాస్త నెమ్మదిగా సాగుతాయి. ఇందులోనూ అది కనిపిస్తుంది. కాకపోతే చాలా అనవసరమైన సన్నివేశాలున్నాయి. అవి ట్రిమ్ చేసి ఉంటే ఇంకా బెటర్ ఫీల్ వచ్చేదే. బట్.. రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే ఆచార్య వల్ల తన రచనా పటిమ తగ్గలేదు అని కూడా తెలుస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
ఎన్టీఆర్
సినిమాటోగ్రఫీ
యాక్షన్ సీక్వెన్స్ లు
సినిమాటోగ్రఫీ
డైలాగ్స్
ఫస్ట్ హాఫ్
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్ :
విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్
ఎడిటింగ్
నేపథ్య సంగీతం
ఫైనల్ గా దేవర.. బ్లాక్ బస్టర్ అవకాశాలున్నా.. హిట్ తో సరిపెట్టుకున్నారేమో అనిపిస్తుంది.
రేటింగ్ : 3/5
- బాబురావు. కామళ్ల
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com