Double Ismart Review : డబుల్ ఇస్మార్ట్ మూవీ రివ్యూ

Double Ismart Review : డబుల్ ఇస్మార్ట్ మూవీ రివ్యూ
X

రివ్యూ ః డబుల్ ఇస్మార్ట్

తారాగణం ః రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, అలీ, సయాజీ షిండే, గెటప్ శీను, మకరంద్ దేశ్ పాండే తదితరులు

ఎడిటింగ్ ః కార్తీక శ్రీనివాస్

సంగీతం ః మణిశర్మ

సినిమాటోగ్రఫీ ః శ్యామ్ కే నాయుడు, గియానీ గియనెల్లీ

నిర్మాతలు ః పూరీ జగన్నాథ్, ఛార్మీ

దర్శకత్వం ః పూరీ జగన్నాథ్

ఇస్మార్ట్ శంకర్ మూవీ హిట్ అయింది. దానికి కొనసాగింపుగా డబుల్ ఇస్మార్ట్ వస్తుందన్నప్పుడు కాస్త అంచనాలుంటాయి. బట్ పూరీ చివరగా లైగర్ తో డిజాస్టర్ చూసి ఉన్నాడు. దీంతో ఈ మూవీపై పెద్దగా ఎక్స్ పెక్టేషన్స్ రాలేదు. అయినా రిలీజ్ కు ముందు చాలా హడావిడీ చేసి ఆడియన్స్ అటెన్షన్ ను గ్రాబ్ చేశారు. ఫైనల్ గా కాస్త మంచి అంచనాలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన డబుల్ ఇస్మార్ట్ ఎలా ఉన్నాడో చూద్దాం.

కథ ః

శంకర్( రామ్ ) ఆవారాగా తిరుగుతూ దొంగతనాలు చేస్తుంటాడు. తన ఫ్రెండ్ ( గెటప్ శీను ) కలిసి ఉన్నప్పుడు అతనికి జన్నత్ ( కావ్య థాపర్ ) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ముందు తనో ఆఫీసర్ లా పరిచయం అయినా.. తర్వాత తనలాగే దొంగ అని తెలుస్తుంది. పూరీ హీరోయిన్ లాగా ముందు బెట్టు చేసినా తర్వాత అతనికే పడిపోతుంది. అదే టైమ్ లో ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్ట్ లో ఉన్న బిగ్ బుల్ కు ( సంజయ్ దత్) క్యాన్సర్ వస్తుంది. మూడు నెలల్లో చనిపోతాడు అని తెలుస్తుంది. తను చనిపోకుండా ఉండేందుకు డాక్టర్ సాయంతో తన మెమరీని ఓ యంగ్ స్టర్ బ్రెయిన్ లో ఇన్ స్టాల్ చేయాలనుకుంటాడు. కొన్ని ప్రయత్నాల తర్వాత ఆల్రెడీ బ్రెయిన్ లో 'చిప్' ఉన్న శంకర్ అయితే బెటర్ అని సలహా ఇస్తాడు డాక్టర్. దీంతో బిగ్ బుల్ టీమ్ ఇండియా వచ్చి శంకర్ ను కిడ్నాప్ చేసి బలవంతంగా బిగ్ బుల్ మెమరీని శంకర్ బ్రెయిన్ లోకి ' కాపీ ' చేస్తారు. దానికి ముందే బిగ్ బుల్ కోసమే తను చిన్నప్పటి నుంచి వెదుకుతున్నా అని అతన్ని చంపడమే తన లక్ష్యం అని వార్నింగ్ ఇస్తాడు శంకర్. మరి వీరి మధ్య ఉన్న గొడవలేంటీ..? ఆ మెమరీని కాపీ చేయడం వల్ల బిగ్ బుల్, శంకర్ లైఫ్ లో ఎలాంటి మార్పులు వచ్చాయి. జన్నత్ ఏమైంది అనేది మిగతా కథ.

విశ్లేషణ ః

పూరీ జగన్నాథ్ కథలన్నీ ఒకే టెంప్లేట్ లో ఉంటాయి. హీరో ఎవరైనా అతనికి ఎదురుండదు.. పైగా బేవార్స్ అయి ఉంటాడు. హీరోయిన్లంతా ముందు పెంకిగా ఉన్నా తర్వాత వీళ్లకే పడతారు. కట్ చేస్తే ఏ దుబాయ్ నుంచో, లండన్ లేదంటే ముంబై నుంచో ఓ అండర్ వరల్డ్ డాన్. వాడితో హీరోకి తగువు. ఇదే టెంప్లేట్. ఆ టెంప్లేట్ ను ఏ మాత్రం మార్చకుండా విపరీతమైన బోరింగ్ స్క్రీన్ ప్లే తోనే ఈ కథను చెప్పాడు పూరీ జగన్నాథ్. అతని పెన్ లో పవర్ అయిపోయిందని ఆల్రెడీ ప్రూవ్ అయింది. అయితే ఫ్లాపులు పడిన తర్వాత ఎవరైనా అలెర్ట్ అవుతారు. బట్ పూరీ కాలేదు. అసలు ఇలాంటి సిల్లీ పాయింట్స్ తో సినిమాలు తీయడం అతనికే చేతనవుతుందేమో అనిపిస్తుంది.

అయినప్పటికీ ఫస్ట్ హాఫ్ ను హీరోయిన్ ఎక్స్ పోజింగ్, రామ్ ఎనర్జిటిక్ డ్యాన్సులతో కాస్త ఎంగేజ్ చేయగలిగాడు. కానీ ఎక్కడా బావుంది అన్న ఫీల్ రాదు. జస్ట్ ఓకే అనిపిస్తాడు. బ్రెయిన్ కాపీ అయిపోయిన తర్వాత తను అప్పుడప్పుడూ సంజయ్ దత్ లా బిహేవ్ చేయాలి. ఈ విషయంలో రామ్ అతన్ని కాపీ కొట్టకుండా తనలాగే నటించే ప్రయత్నం చేశాడు. అంత వరకు బానే ఉంది.

ఫస్ట్ పార్ట్ లో లేని మదర్ సెంటిమెంట్ ఈ పార్ట్ లో పెట్టడం ఆర్టిఫిషియల్ గా ఉంది. పైగా హీరో తల్లి అచ్చంగా కేజీఎఫ్ మదర్ లాంటి డైలాగ్స్ చెప్పడంతో ఆ మూవీ పాయింట్ ను కాపీ కొట్టినట్టు అనిపిస్తుంది. కోట్లు కొల్లగొట్టే హీరో ఓల్డ్ సిటీలో ఉంటూ ఆటోలో తిరగడం ఏంటో పూరీకే తెలియాలి.

ఇక అలీ ట్రాక్ కామెడీ కోసం పెట్టారా జనాన్ని వీలైనంత ఎక్కువగా విసిగించడానికి పెట్టారా అనేది చూస్తే మనకే అర్థం అవుతుంది. అంత చిరాకుగా ఉంటుందా ట్రాక్. పైగా యధేచ్ఛగా బూతులు వాడేశారు. అంతేకాక కథకు ఏ మాత్రం సంబంధం లేని ట్రాక్ ఇది.

నటన పరంగా

రామ్ ఎప్పట్లానే ఎనర్జిటిక్ గా నటించేశాడు. అలవాటైన పాత్ర, స్లాంగ్ కాబట్టి అలవోకగా చేశాడు. కాకపోతే కథలో దమ్ము లేనప్పుడు హీరో ఎంత ఎగిరిపడినా ఏం ఉపయోగం ఉంటుంది..? హీరోయిన్ బావుంది. నటన కూడా ఓకే. పూరీకి కావాల్సినంత ఎక్స్ పోజింగ్ కూడా చేసేసింది. సంజయ్ దత్ గురించి కొత్తగా చెప్పేదేముందీ. అతను ఈజీగా చేసుకుంటూ పోయాడు. ఇతర పాత్రలన్నీ వెరీ రొటీన్.

సినిమాకు మెయిన్ హైలెట్ మణిశర్మ సంగీతం. అన్ని పాటలూ బావున్నాయి. నేపథ్య సంగీతం అదరగొట్టాడు. అతని ఎఫర్ట్ కు తగ్గట్టుగా మంచి స్క్రీన్ ప్లే కూడా పడి ఉంటే మణిశర్మ మరింత హైలెట్ అయ్యేవాడు. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ఎడిటింగ్ పరంగా అలీ ట్రాక్ అంతా ఎత్తేసినా ఏం నష్టం లేదు. పూరీ డైలాగుల్లో వాడి తగ్గ చాలాకాలం అయింది. కాస్ట్యూమ్స్,సెట్స్, ఆర్ట్ వర్క్ అన్నీ బావున్నాయి. దర్శకుడుగా పూరీ ''అప్డేట్'' కావడం లేదు అనేద నిజం. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చినవాడు. ఇప్పుడు హిట్ కొట్టడానికే తంటాలు పడుతున్నాడు. డబుల్ ఇస్మార్ట్ తో హిట్ అనే మాట వింటాడు అనుకోలేం. ఆ స్థాయిలో ఉంది మూవీ. కాకపోతే లైగర్ కంటే కాస్త బెటర్ అంతే.

ఫైనల్ గా ః అతుకుల బొంతలా ''కాపీ పేస్ట్ '' కథనం

రేటింగ్ ః 2.25/ 5

- బాబురావు. కామళ్ల

Tags

Next Story