Gaali Sampath : గాలి సంపత్‌ మూవీ రివ్యూ

Gaali Sampath :  గాలి సంపత్‌ మూవీ రివ్యూ
Gaali Sampath..రాజేంద్ర ప్రసాద్ కెరియర్ లో గుర్తుండిపోయే పాత్ర 'గాలి సంపత్'..

టైటిల్: గాలి సంపత్‌

నటీనటులు : శ్రీ విష్ణు, లవ్లీ సింగ్‌,రాజేంద్ర ప్రసాద్‌, తనికెళ్ల భరణి, సత్య, రఘుబాబు తదితరులు

మ్యూజిక్ : అచ్చు

డీఓపీ : సాయి శ్రీరామ్

ఎడిటింగ్‌ : బి.తమ్మిరాజు

నిర్మాత: ఎస్‌.కృష్ణ, హరీశ్‌ పెద్ది, సాహు గారపాటి

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం పర్యవేక్షణ: అనిల్‌ రావిపూడి

కథ, దర్శకత్వం: అనీశ్‌ కృష్ణ

రిలీజ్ : మార్చి 11, 2021

అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణలో అనీష్ కృష్ణ దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం గాలి సంపత్. ట్రైలర్ తోనే మంచి ఇంపాక్ట్ ని క్రియేట్ చేసిన గాలి సంపత్ ఎలాంటి ఎమోషన్స్ ని అందించాడో తెలుసుకుందాం..

కథ:

అరకులో ఉండే గాలి సంపత్ (రాజేంద్ర ప్రసాద్) నటుడిగా రాణించాలని తాపత్రయ పడే నడి వయస్సు వ్యక్తి. అతను మాట్లాడితే బయటకి గాలి తప్ప మరో శబ్దం రాదు.అతని కొడుకు (శ్రీ విష్ణు) ట్రక్ డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. తన నటనతో రాణించాలని కొడుకుకు సహాయ పడాలనుకుంటాడు. అయితే కొన్ని పనులతో కొడుకును దూరం చేసుకుంటాడు. ఇలాంటి సంఘటనల మధ్య తన ఇంటి ముందు ఉన్న ముప్పై అడుగుల గొయ్యిలో పడతాడు. నోటిలోంచి మాటలు రాని వ్యక్తి ఆ గోతిలోంచి ఎలా బయటికి వచ్చాడు.. కొడుకు.. తండ్రి మనస్సును అర్థం చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ..?

కథనం:

నటుడిగా రాజేంద్ర ప్రసాద్ కున్న విలక్షణత రుచి చూడని తెలుగు ప్రేక్షకుడుండడు. ఎలాంటి పాత్రనైనా తన ప్రతిభతో మెప్పించి ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించుకోవడంలో దిట్ట. రాజేంద్ర ప్రసాద్ కి దొరికిన మరో చక్కని అవకాశం గాలిసంపత్ పాత్ర. ఆపాత్ర తోనే ప్రేక్షకుడు లవ్ లో పడతాడు.. నవ్వించినా, ఏడిపించినా, ఆలోచింపజేసినా ఆ పాత్రేతోనే జరిగింది. సరదాగా మొదలైన గాలి సంపత్ కథ మెదటి భాగం చాలా ఎంటర్ టైనింగ్ గా సాగింది. రఘు బాబు, సత్య వంటి టాలెంటెడ్ నటులతో ఉన్న సన్నివేశాలు నవ్వులు తెప్పించాయి. శ్రీ విష్ణు తన సహాజ నటనతో మెప్పించాడు. అతని పాత్ర తో ప్రతి కొడుకు కనెక్ట్ అవుతాడు. ఘాట్ రోడ్ లో డ్రైవింగ్ సీన్స్, రక్తంతో లవ్ లెటర్ రాయడం వంటి సన్నివేశాలు అనిల్ రావిపూడి మార్క్ ని గుర్తుకు తెచ్చాయి.

రాజేంద్ర ప్రసాద్ చేసిన మైమ్ యాక్టింగ్ సినిమా కి హైలెట్ గా మరింది. ఏ కథ కయినా అందులో వచ్చే అడ్డంకులు అవి దాటుకునేందుకు చేసే ప్రయత్నాలు రసవత్తరంగా మార్చుతాయి. అలాంటి అడ్డంకే హీరో ఇంటి ముందు ఉన్న ముఫ్పై అడుగుల గొయ్యి. ఆ గొయ్యి ని కథతో పాటు ఎస్టాబ్లిష్ చేసాడు దర్శకుడు. కొడుకుతో గొడవ పడి ఆ బాధలో అనుకోకుండా ఆ గోతిలో పడిన రాజేంద్రప్రసాద్ అక్కడి నుండి ఎలా బయటకి వస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ గా మారింది.

అయితే అక్కడ అతను ఎన్ని రోజులున్నాడు అనేది ప్రేక్షకుల ఊహకే వదిలేసాడు. అలాంటి సన్నివేశాలు సృష్టించుకునేటప్పుడు లాజికల్ గా సన్నివేశాలను మలుచుకోవాలి.. అక్కడ టీం కాస్త ఉదాసీనత ప్రదర్శించింది అనిపించింది. ఇక సెకండాంఫ్ లో రాజేంద్ర ప్రసాద్ ఆ గొయ్యిలో పడి అతను పడిన శ్రమ అక్కడ అతను చూపించిన భావోద్వేగాలు అతనెంత విలక్షణ నటుడో గుర్తు చేసాయి. ఆ సిట్యువేషన్ లో ఉండే బరువు సన్నివేశాల్లో ఎక్కవు సేపు చూపించ లేకపోయాడు.ఇక లవ్లీ సింగ్ పాత్ర పర్వాలేదనిపించింది. డబ్బింగ్ లో లిప్ సింక్ కుదరలేదు. చూడటానికి బొమ్మలాగా ఉన్నా, ఆకట్టుకునే సన్నివేశాలు దొరకలేదు. ఇక బ్యాంక్ ఆడిట్ కి వచ్చి అరుకు మొత్తం తిరిగిన అనీష్ కురివిల్లా, అతన్ని బకరాని చేసిన శ్రీకాంత్ పాత్రలు జంధ్యాల కామెడీని గుర్తుకు తెస్తాయి. మొత్తంగా రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి ఒన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు.

చివరిగా:

రాజేంద్ర ప్రసాద్ కెరియర్ లో గుర్తుండిపోయే పాత్ర 'గాలి సంపత్'..

- కుమార్ శ్రీరామనేని

Tags

Read MoreRead Less
Next Story