Godari Gattupaina Review : గోదారి గట్టుపైన మూవీ రివ్యూ

Godari Gattupaina Review :   గోదారి గట్టుపైన మూవీ రివ్యూ
X

రివ్యూ : గోదారి గట్టుపైన

ఆర్టిస్ట్స్ : సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్, జగపతిబాబు, లైలా, సుదర్శన్, రీనూ ఎస్.కే, రాజీవ్ కనకాల, రాజ్ కుమార్ కసిరెడ్డి తదితరులు

ఎడిటర్ : అనిల్ పసల

సంగీతం : నాగ వంశీ

సినిమాటోగ్రఫీ : సాయి సంతోష్

నిర్మాత : అభినవ్ రావు

దర్శకుడు : సుభాష్ చంద్ర

వంద షార్ట్ ఫిల్మ్స్ తీసిన దర్శకుడు అనగానే ఆ సినిమా ఎలా ఉంటుందా అని చాలామంది ఆసక్తిగా చూస్తారు. అన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసిన సుభాష్ చంద్ర గోదారి గట్టుపైన మూవీ తీశాడు. మేం ఫేమస్ మూవీతో దర్శకుడుగా హీరోగా ఆకట్టుకున్న సుమంత్ ప్రభాస్ ఈ చిత్రంలో హీరో. ప్రమోషన్స్ పరంగా బాగా ఆకట్టుకున్నారు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన మంచి లవ్ స్టోరీ అనిపించారు. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

రాజు (సుమంత్ ప్రభాస్) టెన్త్ క్లాస్ తో చదువు ఆపేస్తాడు. ఆటో నడుపుకుంటూ తన చెల్లిని చదివిస్తుంటాడు. చెల్లి కాలేజ్ కే చెందిన మాయ(నిధి ప్రదీప్)ని చూసి ఆ క్షణమే ప్రేమలో పడతాడు రాజు. మాయకు చదువుతో పాటు తన తండ్రే లోకం. తండ్రి చెప్పిన మాట దాటదు. అలాంటి మాయ ఓ సారి కాలేజ్ లో జరుగుతున్న గొడవ కారణంగా రాజుతో పాటు కొందరు స్టూడెంట్స్ కొట్టుకుంటారు. వారిని ఆపే ప్రయత్నం చేస్తుంది మాయ. అదే గొడవలో రాజు.. ఆమెను గట్టిగా చెంప దెబ్బ కొడతాడు. ఆ చెంప దెబ్బ తిన్న మరుక్షణమే మాయ ప్రేమలో పడిపోతుంది. మాయ తండ్రి శ్యాంబాబు(జగపతిబాబు) ఓ సెక్యూరిటీ గార్డ్. అతనికి తన కూతురుపై అనుమానం పెరుగుతంది. అది ప్రేమ అని తెలిసిన శ్యాంబాబు ఏం చేస్తాడు.. రాజు తనకు తెలియని గొడవలో పోలీస్ స్టేషన్ కు ఎందుకు వెళతాడు.. రాజుకు మరదలు మహాలక్ష్మితో ఉన్న అనుబంధం ఏంటీ అనేది మిగతా కథ.

ఎలా ఉంది :

గోదారి గట్టుపైన.. ఇదో పాత చింతకాయ పచ్చడి. అవుట్ డేటెడ్ కథ. ఆకట్టుకోని కథనం. పదే పదే సన్నివేశాలు రిపీట్ అవుతున్న భావన కలుగుతుంది. అసలు ఇలాంటి ప్రేమకథలో ఓ మంచి సంఘర్షణ ఉండాలి. అది పూర్తిగా మిస్ అయిందీ మూవీలో. కథనం ఏమాత్రం కొత్తదనంతో లేదు. రొటీన్ సీన్స్ తో కావాల్సినంత ఇబ్బంది పెడతాడు దర్శకుడు. మామూలుగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే కథల్లో ఉండే నవ్యత ఇందులో కనిపించదు. అసలు అమ్మాయి చెంప దెబ్బ తిన్న వెంటనే ప్రేమలో పడిపోవడం ఏంటో అంతుబట్టదు. పోనీ అంతకు ముందే ఆమెకు అతనితో పరిచయం ఉందా అంటే అదీ లేదు. ఇలాంటి అసహజమైన సన్నివేశాలు బోలెడు ఉన్నాయీ మూవీలో. హీరో పాత్ర ఆటో డ్రైవర్ గా ఉంటుంది. కానీ అతనెప్పుడూ ఒకరో ఇద్దరు కాలేజ్ అమ్మాయిలతో మాత్రమే ఉంటాడు. మరి మిగతా జనం ఎందుకు ఉండరు అంతుబట్టదు. అలాగే అతని ఫ్రెండ్స్ మాత్రం అదే పనిగా ఆటోలోనే తిరుగుతూ ఉంటారు. అసలు ఈ రోజుల్లో ఆటో పోటీలు అని నిర్వహించడం ఏంటో. కాకపోతే హీరో మాత్రం అతి మంచివాడుగా కనిపిస్తాడు. హీరోయిన్ తండ్రి చాటు అమ్మాయిగా ఉంటూనే మరోవైపు హీరోతో అన్నీ చేస్తుంది. చాలా పద్ధతుగా ఉన్న అమ్మాయి ఏకంగా ముద్దు సీన్స్ వరకు వెళ్లడం.. అది హీరో కంటే ముందే తను ఇన్సియేట్ తీసుకోవడం.. అబ్బో.. సరే ఇవన్నీ సినిమాటిక్ గా ఉన్న కాస్త ఫర్వాలేదు అనిపించేలా ఉన్నాయి. సెకండ్ హాఫ్ కథ ఓ పట్టాన ముందుకు వెళ్లదు.

ఇక హీరోయిన్ తండ్రి పాత్రలో జగపతిబాబు ఎందుకు అంత సీరియస్ గా ఉంటాడో ఎవరికీ తెలియదు. పోనీ అతనేమైనా ఊరి పెద్దా అంటే అదేం లేదు. జస్ట్ ఓ సెక్యూరిటీ గార్డ్ మాత్రమే. ఊరిలో చాలామందికి అతన్ని చూస్తే ఓ రేంజ్ లో భయం కలుగుతుంది. ఎందుకు అంటే మాత్రం తెలియదు అనే చెప్పాలి. ఇక అదే పనిగా తన కూతురుతో హగ్గులు, ఆ అమ్మాయిని ఓ రేంజ్ లో చూసుకోవడం.. అదే టైమ్ లో ఆమెపై అత్యంత అనుమాన పడటం ఇది ఏ తరహా పాత్రౌచితమో తెలియదు. ఇక హీరోని అతను ఇబ్బంది పెట్టిన సీన్ ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసిందే. మొత్తంగా ఈ మూవీలో కొద్దిగా ప్లస్ పాయింట్స్ అంటే హీరో, హీరోయిన్ల మధ్య అప్పుడప్పుడూ పాజిటివ్ సన్నివేశాలు. అలాగే హీరో తల్లి తండ్రుల ఎపిసోడ్. ఇక మహాలక్ష్మి పాత్ర అదే పనిగా చాటర్ బాక్స్ లా ఉండటం బావుంది. వాగుడు కాయలా కనిపించడం.. ఆ అమ్మాయి నటన బావుంది. అందంగానూ ఉంది. బట్ ఈ పాత్రను కూడా పూర్తి స్థాయిలో రాసుకోలేదు. స్పష్టమైన ముగింపు ఉండాల్సి ఉంది. మొత్తంగా ఏ మాత్రం కొత్తదనం లేని సినిమాగా గోదారి గట్టుపైన మిగిలిపోతుంది.

నటన పరంగా సుమంత్ ప్రభాస్ చాలా బాగా చేశాడు. కథలో దమ్ము లేకపోయినా తన నటనతో నిలబెట్టే ప్రయత్నం చేశాడు. నేచురల్ లుక్స్ తో పాటు ఆటో డ్రైవర్ గా బాగా సెట్ అయ్యాడు. నిధి ప్రదీప్ కూడా బాగా నటించింది. జగపతిబాబు పాత్రలో అంత ఇంపాక్ట్ ఉండే నటన లేదు. అది దర్శకుడి లోపమే తప్ప ఆయనది కాదు. చాలాకాలం తర్వాత తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చిన లైలా క్యారెక్టర్ లో ఎలాంటి డెప్ట్ ఉండదు. ఓ జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నా సరిపోతుంది అనిపిస్తుంది. హీరో ఫాదర్ గా దేవీ ప్రసాద్ బాగా చేశాడు. అతని భార్యగా చేసిన ఆమె కూడా ఫర్వాలేదు. సుదర్శన్ కామెడీ అక్కడక్కడా వర్కవుట్ అయింది. బట్ మాగ్జిమం ఇరిటేట్ చేశాడు. మహాలక్ష్మి పాత్రలో రీనూ చాలా బాగా చేసింది. పోలీస్ గా హర్షవర్ధన్ తెలంగాణ స్లాంగ్ లో ఎందుకు మాట్లాడతాడో అర్థం కాదు. కేవలం ఎస్సై స్థాయిలో ఉన్న అతను ఆ ప్రాంతానికే పరిమితం కావాలి. గోదావరి లేదంటే ఉత్తరాంధ్ర యాసలో అయితే బావుండేది. అసలు ఈ రాష్ట్రానికే చెందని భాషలో మాట్లాడ్డం ఏంటో తెలియదు. అతని నటనలోనూ ఓవరాక్షన్ ఉంది. మిగతా పాత్రలన్నీ ఓకే అనిపించుకున్నాయి.

టెక్నికల్ గా చూస్తే ఇలాంటి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే లవ్ స్టోరీస్ అంటే పాటల గురించి బాగా ఊహించుకుంటాం. బట్ ఇందులో అది మిస్ అయింది. ఒక పాట బావుంది. బట్ అది సరైన ప్లేస్మెంట్ లేక మమ అనిపించుకుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బానే ఉంది. సినిమాటోగ్రఫీ చాలా బ్యూటీఫుల్ గా ఉంది. ఎడిటింగ్ పరంగా చాలా చోట్ల రిపీటెడ్ సీన్స్ లా ఉన్నాయి. అంటే అది దర్శకుడి టేకింగే. డైలాగ్స్ జస్ట్ ఓకే. కాస్ట్యూమ్స్ బావున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. దర్శకుడు సుభాస్ చంద్ర ఇప్పటికే 100 షార్ట్ ఫిల్మ్స్ తీశాడు. వాటిలో చాలా కథలు అద్భుతంగా ఉంటాయి. బట్ ఈ మూవీలో మాత్రం అదే మిస్ అయింది.

ఫైనల్ గా : గోదారి గట్టుపైన.. రొటీన్ రొడ్డకొట్టుడు మూవీ

రేటింగ్ : 2/5

బాబురావు. కామళ్ల

Tags

Next Story