Kubera Review : శేఖర్ కమ్ముల కుబేర హిట్టా ఫట్టా.. కంప్లీట్ రివ్యూ

రివ్యూ : కుబేర
ఆర్టిస్ట్స్ : అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా, జిమ్ సర్భ్, సయాజీ షిండే, సునయన, దలిప్ తాహిల్ తదితరులు
ఎడిటర్ : కార్తీక్ శ్రీనివాస్
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ : నికేత్ బొమ్మిరెడ్డి
నిర్మాతలు : సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహర్ రావు, అజయ్ కైకాల
రచన, దర్శకత్వం : శేఖర్ కమ్ముల
కొందరు దర్శకుల సినిమాలకు ముందే ప్రిపేర్ అయి ఉంటాం. కొన్నిసార్లు వాళ్లు ఆశ్చర్యపరుస్తారు. శేఖర్ కమ్ముల సినిమా అంటే ఎలా ఉంటుందో అందరూ ఊహిస్తారు. కానీ ఫస్ట్ టైమ్ స్టార్ హీరోలతో సినిమా చేశాడు. అది కూడా పూర్తిగా తన మార్క్ ది. హీరోలిద్దరూ ఇమేజ్ ను పక్కన పెట్టి పూర్తిగా శేఖర్ కు సరెండర్ అయ్యాం అన్నారు. సినిమాలో హీరోయిన్ లేదు. కానీ ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా వెలుగుతోన్న రష్మిక మందన్నా ఓ కీలక పాత్ర. రిలీజ్ కు ముందే దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం హైలెట్ అనిపించుకుంది. ప్రమోషన్స్ తో ఆకట్టుకున్నారు. ఇన్నేసి ప్రత్యేకతలతో ఈ శుక్రవారం విడుదలైన కుబేర ఎలా ఉందో చూద్దాం.
కథ :
బంగాళాఖాతంలో ఏళ్లతరబడి చేసిన కృషికి ఫలితంగా.. మన దేశానికి 15యేళ్లకు సరిపడా ఆయిల్ సమకూర్చగలిదే ఆయిల్ ఉన్నట్టు గుర్తిస్తారు. మామూలుగా అయితే అది సహజ వనరు. ప్రజలకు చెందుతుంది. కానీ ఆ విషయం ముందే తెలుసుకున్న ఓ నీరజ్ త్రిపాఠి (జిమ్ సర్భ్) అనే పారిశ్రామిక వేత్త ఆ ఆయిల్ టెండర్ ను తనకివ్వమని రాజకీయ నాయకులకు లక్ష కోట్ల లంచం ఆశ చూపిస్తాడు. అలాగే ఆ టెండర్ అతనికే చెందుతుంది. నీరజ్ అత్యంత క్రూరుడు. ఆ టెండర్ కోసం వందల మందిని చంపేసి ఉంటాడు. కాకపోతే లక్ష కోట్లను ఎంతోమంది రాజకీయ నాయకులకు ఎలా సమకూర్చాలా అన్న సమస్య వస్తుంది. ఆ సమస్యకు పరిష్కారంగా తన నిజాయితీ కారణంగా అక్రమ కేస్ లు బనాయించడంతో జైల్లో మగ్గుతున్న సిన్సియర్ సిబిఐ ఆఫీసర్ అయిన దీపక్ (నాగార్జున) అనుకుంటారు. పారిశ్రామిక వేత్తలు తలచుకుంటే జైళ్లు ఓ లెక్కా. దీపక్ ముందు కాదన్నా.. తర్వాత అతని కోసం పనిచేయడానికి ఒప్పుకుంటాడు. నీరజ్ అక్రమ సామ్రాజ్యంలో అడుగుపెట్టిన తెలివైన బ్యూరోక్రాట్ దీపక్ ఈ బ్లాక్ మనీని వైట్ గా మార్చేందుకు నలుగురు భిక్షగాళ్లను తీసుకురమ్మంటాడు. అలా తిరుపతి నుంచి వచ్చిన వాడు దేవా (ధనుష్). అతనితో పాటు మరో ముగ్గురు. మరి ఈ నలుగురునీ ఎలా వాడుకున్నారు. తర్వాత ఏం చేశారు. దేవా వల్ల దీపక్ తో పాటు నీరజ్ కు ఎలాంటి సమస్యలు వచ్చాయి.. ఎందుకు..? ఈ మొత్తం కథలోకి తెలియకుండా వచ్చి టార్గెట్ అయిన సమీర(రష్మిక మందన్నా) కథేంటీ.. అనేది మిగతా కథ.
ఎలా ఉంది :
శేఖర్ కమ్ముల ముందు నుంచీ తనో అద్భుతమైన సినిమా చేశానని చెబుతూ వస్తున్నాడ. హీరోలను కూడా అలాగే నమ్మించాడు. వారు కూడా నమ్మేశారు. నిజమే. ఇది అద్బుతమైన కథే. కాకపోతే రెండో సగంలో ఆ కథ కథనంగా పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. ఫస్ట్ హాఫ్ మొత్తం గ్రిప్పింగ్ గా రూపొందించిన శేఖర్ రెండో సగం సగానికి వచ్చాక చేతులెత్తేసినట్టు కనిపిస్తుంది. ఈ దేశ సహజ వనరులైన, ప్రజలకు భాగస్వామ్య హక్కులూ ఉన్న ఖనిజాలు, అడవులు, నిక్షేపాలు, చమురులు, మట్టి, మైన్స్, సముద్ర జలాలను కార్పోరేట్ శక్తులు ఎలా కొల్లగొడతాయి.. ఇందుకు రాజకీయ వ్యవస్థ ఎలా సహకరిస్తుంది. అక్రమ సంపాదనలో వ్యాపార వేత్తలు సామాన్యులను ఎలా బలి చేస్తారు అనే పాయింట్ ను అద్భుతంగా తీసుకున్నాడు. టేకాఫ్ అదిరిపోయింది. ఇంటర్వెల్ బ్యాంగ్ బావుంది. నలుగురు బిక్షగాళ్లు ఓ పేద్ద బిజినెస్ టైకూన్ ఆటలోకి వచ్చిన తర్వాత కథనం మరింత రక్తి కడుతుంది. అయితే తమ పని అయిపోయాక వారిని వదిలించుకోవాలనుకుంటారు. దేవా విషయంలో వారి పని పూర్తవదు. ఇక్కడే అద్భుతమైన లాక్ పడుతుంది. ఆ లాక్ ను తెలివిగా క్లియర్ చేస్తాడు శేఖర్ అనుకుంటాం. దీపక్ సాయంతో అదే స్టార్ట్ అవుతుంది. కానీ సెకండ్ హాఫ్ సగం నుంచి కథనం నీరసంగా మారుతుంది. దీంతో ఈ పార్ట్ పై అతను పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టలేదు అనుకుంటాం. కాకపోతే దర్శకుడి ఇంటెన్షన్ ఈ కార్పోరేట్, పొలిటికల్, బ్యూరోక్రాట్ వ్యవస్థలు ఈ దేశ సహజ వనరులను దోచుకునేందుకు ఎంతటి విధ్వంసాన్ని ఎలా సృష్టిస్తాయి అనే లేయర్ తో ఆపేసినట్టు కనిపిస్తుంది. దీనికి పరిష్కారం కూడా చెప్పడు. పైగా చివర్లో అది సాధారణమే అనేలా ఒకే ఒక్క సీన్ తో తేల్చిపడేశాడు. అంటే ఆలోచించాల్సింది ప్రజలే. పాలకులను ఎంచుకునేప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోవాలని ఇన్ డైరెక్ట్ గా చెప్పినా.. ఈ దేశంలో డబ్బున్నోడితే అంతా అనే అంశాన్ని చాలా క్లియర్ గా చెప్పేశాడు.
ప్రమోషన్స్ లో కనిపించిన రష్మిక పాట సినిమాలో లేదు. అలాగే పోయిరా పోయిరా అనే పాట కూడా తీసేసి ఉండాల్సింది అనిపిస్తుంది. నిడివి కూడా ఈ చిత్రానికి పెద్ద సమస్య. లెంగ్త్ ఎక్కువగా ఉన్నా.. కథనంతో కట్టిపడేస్తే ఆడియన్స్ కు నిడివి గుర్తుకు రాదు. సెకండ్ హాఫ్ లో ఆ కథన లేమి కారణంగా అప్పుడప్పుడూ ఆవులింతలు వస్తుంటాయి.
నటన పరంగా ధనుష్ ఈ పాత్రకు ప్రాణం పోశాడు. దేవాగా అతను జీవించాడు. ఎక్కడా అతని ఇమేజ్ తాలూకూ షాట్ ఒక్కటి కూడా కనిపించలేదు. సింపుల్ గా చెబితే అతనూ అతని నటనా ఓ అద్భుతం. దీపక్ గా నాగార్జునకు గొప్ప పాత్ర పడింది. చాలా గొప్పగా నటించాడాయన. ఈ పాత్రలో అనేక డైమన్షన్స్ కనిపిస్తాయి. అన్నిటినీ అద్భుతంగా పలికించాడు. నాగ్ కెరీర్ లో దీపక్ పాత్ర ఓ మెమరబుల్ రోల్ గా నిలిచిపోతుంది. రష్మిక అనుకోకుండా ఈ కథలోకి వచ్చినట్టు కనిపించినా.. తన పాత్ర కూడా అలాగే ఉంటుంది.. ఈ మధ్య కాలంలో తను చేస్తున్న పాత్రలకు పూర్తి భిన్నమైన పాత్ర. సూపర్బ్ గా నటించింది. ఈ ముగ్గురూ పూర్తిగా దర్శకుడుకి సరెండర్ అయ్యారు. చెత్త కుప్పలు, డంప్ యార్డ్ లు, బురద గుంటలు ఇలా దేనికీ నో చెప్పలేదు. పాత్రలను ఓన్ చేసుకుంటేనే ఇది సాధ్యం అవుతుంది. ఇతర పాత్రల్లో ధనుష్ తో పాటు కనిపించిన ఖుష్బూ అనే అమ్మాయి బాగా చేసింది. బిజినెస్ టైకూన్ గా జిమ్ సర్భ్ నెక్ట్స్ లెవల్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు.
టెక్నికల్ గా దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి బ్యాక్ బోన్. సినిమాటోగ్రఫీ సూపర్బ్ గా ఉంది. ఎడిటింగ్ పరంగా లెంగ్త్ అయినా సీన్స్ అయినా డైరెక్టర్ ఛాయిస్ కాబట్టి అతన్నేం అనలేం. కానీ సులువుగా 15 నిమిషాలు కట్ చేయొచ్చు అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. డైలాగ్స్ బావున్నాయి. కాస్ట్యూమ్స్ బావున్నాయి. దర్శకుడుగా శేఖర్ కమ్ముల బెస్ట్ రైటింగ్ కనిపిస్తుంది. కానీ స్క్రీన్ ప్లే పరంగా సెకండ్ హాఫ్ లో తడబాట్లు ఉన్నాయి. ఏ సినిమాకైనా అత్యంత కీలకం అనిపించే చివరి అరగంట విషయంలో మరీ తేలిపోయాడు.
ఫైనల్ గా : దేశ సహజ వనరుల విధ్వంసకుల కథ
రేటింగ్ : 3/5
- బాబురావు కామళ్ల
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com