MAD Square Review : మ్యాడ్ స్క్వేర్ హిట్టా ఫట్టా.. పర్ఫెక్ట్ రివ్యూ

MAD Square Review  :  మ్యాడ్ స్క్వేర్ హిట్టా ఫట్టా.. పర్ఫెక్ట్ రివ్యూ
X

రివ్యూ : మ్యాడ్ స్క్వేర్

ఆర్టిస్టులు : నార్నే నితిన్, రామ్ నితిన్, సంతోష్ శోభన్, విష్ణు ఓయి, సునిల్, సత్యం రాజేష్, మురళీధర్ గౌడ్, ప్రియాంక జవాల్కర్ తదితరులు

ఎడిటర్ : నవీన్ నూలి

సంగీతం : భీమ్స్ సిసిరోలియో

సినిమాటోగ్రఫీ : షామ్ దత్ (ఐ.ఎస్.సి)

నిర్మాతలు : హారిక సూర్యదేవర, సాయి సౌజన్య

దర్శకత్వం : కళ్యాణ్ శంకర్

కామెడీ సినిమాలకు కూడా సీక్వెల్స్ తీయొచ్చు అని డిజే టిల్లు, టిల్లు స్క్వేర్ మూవీస్ తో నిరూపించింది సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్. అదే బ్యానర్ నుంచి వచ్చిన మ్యాడ్ 2023లో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. టిల్లు స్క్వేర్ ఇచ్చిన ఉత్సాహంతో ఈ చిత్రానికీ సెకండ్ పార్ట్ రూపొందించారు. యూత్ అంతా జోష్ ఫుల్ గా ప్రమోషన్స్ చేసిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలైంది. మరి ఎలా ఉంది అనేది చూద్దాం.

ఇలాంటి సినిమాల నుంచి కథ ఎక్స్ పెక్ట్ చేయొద్దు. చూస్తున్నంత సేపూ హాయిగా నవ్వుకుని వెళ్లండి. లాజిక్స్ కూడా చూడొద్దు అని ప్రమోషన్స్ లో పదేపదే చెప్పింది మూవీ టీమ్. అది నిజమే. పెద్దగా కథంటూ కనిపించదు. ఉన్నా.. అదీ ఒక పద్ధతిలో సాగదు. కాకపోతే సన్నివేశాలకు అనుగుణంగా ఓ థ్రెడ్ కనిపిస్తుంది. ఆ థ్రెడ్ కూడా ఫస్ట్ హాఫ్ లో ఒకటి, సెకండ్ హాఫ్ లో ఒకటిగా కనిపిస్తుంది. ఫస్ట్ పార్ట్ లో ఉన్న లడ్డు పెళ్లితో మొదలవుతుంది మ్యాడ్ ‘కథనం’. మదన్( రామ్ నితిన్), అశోక్ ( నార్నే నితిన్), డీడీ(సంగీత్ శోభన్) లను పిలవకుండానే పెళ్లి చేసుకుంటుంటాడు లడ్డు. అయినా వీళ్లు ముగ్గురూ వెళతారు. తర్వాత ఆ పెళ్లి చుట్టూ అనేక అంశాలతో సాగే కామెడీతో తెగ నవ్విస్తుంది. తీరా చూస్తే పెళ్లి రోజు పెళ్లి కూతురు లేచిపోతుంది. అది కూడా తన ఫ్రెండ్స్ తీసుకువచ్చిన ఓ రాపిడో ఆటో డ్రైవర్ తో. బాదపడుతున్న లడ్డూను ఓదార్చడానికి అతన్ని తీసుకుని గోవా వెళతారు ఫ్రెండ్స్. అక్కడికి వెళ్లాక వారికి కాలేజ్ ప్రిన్సిపల్ అక్కడ ఓ రిసార్ట్ పెట్టుకుని కనిపిస్తాడు. అదే రిసార్ట్ లో దిగిన వీరికి లైలా వల్ల ఓ సమస్య వస్తుంది. లోకల్ గా ఉండే ఓ డాన్ మ్యాక్స్(సునిల్) కు సంబంధించిన ఓ చైన్ వీరికి దొరుకుతుంది. పోలీస్ అధికారి సెబాస్టియన్( సత్యం రాజేష్) వీరిని వెదుకుతుంటాడు. గోవాలో కొడుకు ఇబ్బంది పడుతున్నాడేమో అని లడ్డూ ఫాదర్ (మురళీధర్) గోవా వస్తాడు. కట్ చేస్తే లడ్డూ ఫాదర్ ను కిడ్నాప్ చేసి ఆ చైన్ తెస్తేనే తండ్రిని వదులుతా అంటాడు మ్యాక్స్. ఆ చైన్ కోసం ఈ ఫ్రెండ్స్ పడే తిప్పలుతో పాటు మ్యాక్స్ కు ఉన్న ఓ హ్యాబిట్, తింగరి పోలీస్ గా సెబాస్టియన్.. ఇలా ప్రతి ఒక్కరూ కామెడీని పంచడమే టార్గెట్ గా కనిపిస్తారు. అసలు ఇందులో కథంటూ పెద్దగా కనిపించదు. జస్ట్ ఫస్ట్ హాఫ్ లో పెళ్లి అనే థ్రెడ్. సెకండ్ హాఫ్ లో చైన్ అనే థ్రెడ్. అంతే. వాటి చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు, డైలాగ్స్ తోనే కామెడీని క్రియేట్ చేశాడు దర్శకుడు.

నిజానికి ఈ తరహా సినిమాలకు మూలం జాతిరత్నాలు. సీక్వెల్స్ గా సాగే కథనంతో కడుపుబ్బా నవ్వించడం కనిపిస్తుంది. దాన్ని నెక్ట్స్ లెవల్ కు తీసుకువెళ్లేలా మ్యాడ్ స్క్వేర్ కూడా కనిపిస్తుంది. అందుకే చూస్తున్నంత సేపూ ఆ కామెడీని ఎంజాయ్ చేస్తాం. ఇక ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో కనిపించే అమాయకత్వం మంచి కామెడీకి తోడ్పడుతుంది. వారు అమాయకత్వంతో చేస్తున్నారా లేక అతి తెలివితో చేస్తున్నారా అనేది అనవసరం. ఆ పాత్రలు నవ్వులు పంచాయా లేదా అనేదే ప్రధానం. ఆ విషయంలో సూపర్ సక్సెస్ అయ్యారు. ఎవరికి వారు అదరగొట్టారు.

ప్రధాన పాత్రలతో పాటు ఆ క్యారెక్టరైజేషన్స్ ను కూడా కంటిన్యూ చేస్తూ నార్నే నితిన్ పాత్రతో క్లైమాక్స్ లో ఓ ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు. అదీ సిల్లీగానే ఉన్నా.. సెట్ అయిపోతుంది.

నటన పరంగా కుర్రాళ్లంతా అదే ఎనర్జీని మెయిన్టేన్ చేస్తూ అదరగొట్టారు. ఫస్ట్ పార్ట్ లో సంగీత్ శోభన్ కాస్త అప్పర్ హ్యాండ్ గా కనిపిస్తాడు. ఈ సారి విష్ణు ఓయ్ అందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేస్తాడు. అంటే ఆ క్యారెక్టర్ డిజైనింగే అలా ఉంటుంది. ఈ మధ్య రెగ్యులర్ గా విలన్ గానే కనిపిస్తోన్న సునిల్ కామెడీతో అదరగొట్టాడు. చాలా రోజుల తర్వాత సత్యం రాజేష్ తెగ నవ్వించాడు. శుభలేఖ సుధాకర్ పాత్ర కొత్తగా ఉంది. మురళీధర్ గౌడ్ మరోసారి అదరగొట్టాడు. మంచి టైమింగ్ సూపర్బ్ గా నవ్వించాడు. చివర్లో అనుదీప్ ఆకట్టుకుంటే.. ఐటమ్ సాంగ్స్ లో రెబా మోనికా జాన్, ప్రియాంక జవాల్కర్ అందాలతో అలరించారు.

టెక్నికల్ గా చూస్తే ఈ సారి కూడా భీమ్స్ దుమ్మురేపాడు. ఎనర్జిటిక్ సాంగ్స్ తో పాటు మంచి నేపథ్య సంగీతంతో సినిమాకు ఎసెట్ గా నిలిచాడు. సినిమాటోగ్రఫీ చాలా చాలా బావుంది. గోవాను బాగా ఎక్స్ ప్లోర్ చేశాడు. ఎడిటింగ్ గ్రిప్పింగ్ గా కనిపిస్తూ ఎక్కడా కామెడీ నుంచి డీవియేట్ కాకుండా ఉంది. డైలాగ్స్ తో పండిన కామెడీ హైలెట్ గా ఉంది. పెళ్లి కోసం వేసిన సెట్స్ చాలా బావున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా కనిపిస్తాయి. దర్శకుడు కళ్యాణ్ శంకర్ ద్వితీయ విఘ్నాన్ని కూడా నవ్వులతో దాటేశాడు. మరోసారి మంచి రైటింగ్ తో హిట్టైపోయాడు అనే చెప్పాలి.

ఫైనల్ గా : మ్యాడ్ స్క్వేర్.. అన్ లిమిటెడ్ ఫన్ రైడ్

రేటింగ్ : 3.25/5

బాబురావు. కామళ్ల

Tags

Next Story