Mirai Movie Complete Review : రివ్యూ : మిరాయ్

రివ్యూ : మిరాయ్
ఆర్టిస్ట్స్ : తేజ సజ్జా, మంచు మనోజ్, శ్రీయ చరణ్, రితికా నాయక్, జగపతిబాబు, జయరాం, టాంజా కెల్లర్ తదితరులు
ఎడిటర్ : ఏ శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ : కార్తీక్ ఘట్టమనేని
మ్యూజిక్ : గౌరహరి
నిర్మాతలు : టి.జి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
దర్శకత్వం : కార్తీక్ ఘట్టమనేని
బాల నటుడుగా ప్రూవ్ చేసుకున్నాడు. హీరోగా మారిన తర్వాత వైవిధ్యమైన కథలతో ముందుకు వచ్చాడు తేజ సజ్జా. హను మాన్ తో ఓవర్ నైట్ సూపర్ హీరో అయిపోయాడు. ప్యాన్ ఇండియా ఆడియన్స్ కు గ్రాండ్ గా బ్లాక్ బస్టర్ తో పరిచయం అయ్యాడు. ఆ తర్వాత మిరాయ్ మూవీ అనౌన్స్ కావడం.. ఇదీ సూపర్ హీరో మూవీ అనడంతో ఆడియన్స్ క్యూరియాసిటీతో చూశారు. ఈ మూవీ టైటిల్ నుంచి ప్రమోషన్స్ వరకూ ప్రతిదీ ఆకట్టుకుంది. తేజ తన భుజాలపై ప్రమోషన్స్ ను మోశాడు. మరి అతని కష్టానికి తగ్గ రిజల్ట్ వచ్చిందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
అశోక చక్రవర్తి కాలానికి చెందిన 9 మహా గ్రంథాలు ఉంటాయి. వాటిని కాపాడటం చాలా ముఖ్యం. అవి దుష్టుల చేతిలో పడితే ప్రపంచం నాశనం అవుతుంది. వాటిని కాపాడే బాధ్యత అంబిక(శ్రీయా) తీసుకుంటుంది. తొమ్మిది మంది వ్యక్తుల చేతిలో ఆ గ్రంథాలు ఉంచుతుంది. తొమ్మిదో గ్రంథం మాత్రం తనకే తెలిసిన స్థలంలో భద్రపరుస్తుంది. ఆ విషయం తెలిసిన మహావీర్( మంచు మనోజ్) 24 యేళ్ల పాటు కష్టపడి అందులో నుంచి ఎనిమిది గ్రంథాలను కొల్లగొడతాడు. మహావీర్ ఇలా చేస్తాడని తన జ్ఞాననేత్రం ద్వారా తెలుసుకున్న అంబికా.. తనకు పుట్టిన బిడ్డనే అతన్ని ఎదుర్కొనే యోధుడుగా మార్చేలా ప్రణాళికలు చేస్తుంది. అందుకోసం అతన్ని పుట్టిన వెంటనే అనాథలా వదిలేస్తుంది. 24యేళ్ల తర్వాత అతన్ని వెదుక్కుంటూ విభా (రితికా నాయక్) వెళుతుంది. అతని కోసం దేశమంతా తిరిగి హైదరాబాద్ లో పట్టుకుంటుంది. విభా తనను ఓ యోధుడువి అని చెబుతుంది. తను ఈ లోకాన్ని కాపాడాలి.. మిరాయ్ ని సాధించాలని చెబుతుంది. మొదట నమ్మకపోయినా.. తర్వాత నమ్మాల్సి వస్తుంది. మరి ఆ తర్వాతేమైంది.. మహా వీర్ లక్ష్యం ఏంటీ..? అంబిక కొడుకుని వదిలి ఏమైపోయింది..? ఆ విభా ఎవరు..? ఆ తొమ్మిదో గ్రంథాన్ని వేద కాపాడాడా..? అసలు మిరాయ్ అంటే ఏంటీ..? దాన్ని వేద ఎలా సంపాదించాడు అనేది మిగతా కథ.
ఎలా ఉంది ?
కొన్ని సినిమాల రిజల్ట్స్ ముందే తెలిసిపోతుంటాయి. మిరాయ్ విషయంలో చాలామంది ఊహించారు. ఇది కూడా హనుమాన్ లా ప్యాన్ ఇండియా స్థాయిలో విజయం సాధిస్తుందనుకున్నారు. అది నిజమే అని నిరూపించే కంటెంట్ తోనే వచ్చాడు దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని. ప్రభాస్ వాయిస్ ఓవర్ తో గంభీరంగా ప్రారంభమైన సినిమా తేజ సజ్జా పరిణామంతో తోక చుక్క చూపిన దారిలో సరదాగా సాగుతూ.. హైదరాబాద్ లో సాధారణంగా కనిపిస్తుంది. విభా వచ్చిన తర్వాత కథనంలో వేగం.. పాత్రల్లో పరిణతి మొదలవుతుంది. మరోవైపు మంచు మనోజ్ క్రూరమైన విలనీతో ఆ గ్రంథాలను కొల్లగొడుతుంటాడు. అతన్ని అత్యంత బలవంతుడైన విలన్ గా చూపించిన విధానం బావుంది. అంటే ఓ సాధారణ కుర్రాడు అంతటి బలవంతుడుని ఎలా ఎదుర్కొంటాడు అనే ఫజిల్ కరెక్ట్ గా సెట్ చేశాడు దర్శకుడు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. మిరాయ్ ని సాధించే క్రమం అంతా.. గూస్ బంప్స్ వచ్చేలా కనిపిస్తుంది. ఆ క్రమంలో వచ్చే విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ఎక్సెల్లెంట్ అంటే చిన్న మాటే అవుతుంది. మిరాయ్ ని సాధించిన తర్వాత అగస్త్య ముని (జయరాం) ఎంట్రీతో రసకందాయంలో పడటం.. ఆ క్రమంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ సినిమాకే హైలెట్ గా నిలవడం.. ఆపై అతను తన తల్లి ప్రాంతమైన కామఖ్యకు వెళ్లడం.. అక్కడ అనేక ఆసక్తి కరమైన, ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటాడు. ఆపై మహా వీర్ ను ఎదుర్కోవడం.. అతన్ని అంతం చేసే క్రమంలో ఏకంగా శ్రీరాముడి సాయం అందడం.. ఇవన్నీ.. చూస్తున్న ప్రేక్షకులను ఓ కొత్త లోకంలోకి తీసుకువెళతాయి. కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ ఉన్నా.. ఆ మైనస్ లేవీ ఈ కథనంలో కనిపించవు. స్క్రీన్ ప్లే గ్రాఫ్ పెరుగుతూ పోవడం ఈ సినిమా మెయిన్ హైలెట్స్ లో ఒకటి. ఎక్కడా డౌన్ కాకుండా సీన్ టు సీన్ హైలెట్ అవుతున్నట్టే అనిపిస్తుంది. సింపుల్ గా ఇలాంటి మూవీస్ గురించి వినడం, చదవడం కంటే ఫ్యామిలీతో కలిసి ఆ సినిమాను అనుభూతి చెందడ ఉత్తమం. ముఖ్యంగా పిల్లలకు ఇంకా ఇంకా నచ్చుతుందీ సినిమా.
నటన పరంగా చూస్తే తేజ సజ్జా అదరగొట్టాడు. తను అనాథ అనే ఫీలింగ్ నుంచి తనే ప్రపంచాన్ని కాపాడే యోధుడు అనేంత వరకూ సాగే ట్రాన్సఫర్మేషన్ ను అద్భుతంగా చూపించాడు. మంచు మనోజ్ బాగా హైలెట్ అయ్యాడు. మహావీర్ అలియాస్ బ్లాక్ స్క్వాడ్ పాత్రలో విశ్వరూపం చూపించాడు. శ్రీయా శరణ్ కు ఇది ఖచ్చితంగా ఈ ఇన్నింగ్స్ లో ది బెస్ట్ రోల్. బాగా నటించింది. జయరాం అగస్త్యుడుగా సెటిల్డ్ గా కనిపించాడు. జగపతిబాబు నేచురల్ గా చేశాడు. రితికా నాయక్ అందంగా, హుందాగా కనిపిస్తూ బాగా నటించింది. స్నేహితుల పాత్రల్లో హను మాన్ తర్వాత మరోసారి గెటప్ శీను నేచురల్ గా చేసుకుపోయాడు. ‘మ్యాప్’పాత్రలో నటించిన మ్యాడీ సూపర్బ్ గా చేశాడు. తనకు ఈ పాత్రతో బ్రేక్ వచ్చే అవకశాలూ ఉన్నాయి. ఇతర పాత్రలన్నీ ఓకే.
టెక్నికల్ గా చూస్తే ఈ మూవీకి మెయిన్ హైలెట్ సినిమాటోగ్రఫీ, మ్యూజిక్. దర్శకుడే సినిమాటోగ్రఫీ చేశాడు కాబట్టి ప్రతి షాట్ పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. అందంగా, అద్భుతంగా పిక్చరైజ్ చేశాడు. గౌర హరి నేపథ్య సంగీతం సినిమాకు బ్యాక్ బోన్ లా నిలిచింది. గొప్ప సంగీతం అందించాడు. ఎడిటింగ్ పరంగానూ ఆకట్టుకుంటుంది. వైబ్ ఉంది పిల్లా అనే పాటను తీసేయడం మంచిదే అయింది. డైలాగ్స్ బావున్నాయి. కాస్ట్యూమ్స్, సెట్స్, ఆర్ట్ వర్క్, విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్.. ప్రతిదీ హండ్రెడ్ పర్సెంట్ బావున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి మరో బెస్ట్ ప్రొడక్షన్ గా ఈ చిత్రాన్ని చెప్పొచ్చు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మూడో ప్రయత్నంలో ప్యాన్ ఇండియా రేంజ్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. తనేంటో దేశం మొత్తానికి ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఈ ఫ్రాంఛైజీ కొనసాగుతుందీ అనేలా సెకండ్ పార్ట్ కు లీడ్ ఇవ్వడం.. ఆ పార్ట్ లో రానా విలన్ గా నటిస్తున్నాడని చెప్పడంతో సెకండ్ పార్ట్ పై అప్పుడే క్యూరియాసిటీ మొదలైందని చెప్పొచ్చు.
ఫైనల్ గా : చందమామ కథలాంటి ఫీల్ ఉన్న సినిమా
రేటింగ్ - 3.5/5
- బాబురావు కామళ్ల
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com