L2: Empooran Movie Review : మోహన్ లాల్ ఎల్ 2 : ఎంపూరన్ మూవీ రివ్యూ

రివ్యూ : ఎల్ 2 : ఎంపూరన్
ఆర్టిస్ట్స్ : మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, మంజు వారియర్, టోవినో థామస్, అభిమన్యు సింగ్, సూరజ్ వెంజరమూడు తదితరులు
ఎడిటర్ : అఖిలేష్ మోహన్
సినిమాటోగ్రఫీ : సుజిత్ వాసుదేవ్
నిర్మాతలు : ఆంటోనీ పెరుంబావుర్, గోకులమ్ గోపాలన్
రచయిత : మురళీ గోపి
తెలుగు రిలీజ్ : దిల్ రాజు
దర్శకత్వం : పృథ్వీరాజ్ సుకుమారన్
ఏ భాషలో అయినా సీక్వెల్స్ అనేవి కత్తిమీద సాములాంటివే. బావున్నా లేకున్నా ఫస్ట్ పార్ట్ తోనే పోలికలు చేస్తారు. అందుకే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో వచ్చిన లూసీఫర్ మళయాలంలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఓటిటిల్లో సూపర్ హిట్ అనిపించుకుంది. ఈ చిత్రానికే సీక్వెల్ గా ఇప్పుడు ఎల్ 2 ఎంపురాన్ అనే సినిమా వచ్చింది. దేశవ్యాప్తంగా భారీ ప్రమోషన్స్ తో విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ :
2002లో ఒకానొక ప్రాంతంలో మతపరమైన అల్లర్లు జరుగుతుంటాయి. ఆ అల్లర్లకు బల్ రామ్(అభిమన్యు సింగ్) నాయకత్వం వహిస్తుంటాడు. కొన్ని వందలమందిని ఊచకోత కోస్తాడు. ఒక మతం వారికి ఆశ్రయం ఇచ్చారని సొంత వాళ్లను కూడా చంపి తగలేస్తాడు. ఈ క్రమంలో ఓ గర్భిణిపై అతని అనుచరుడు మున్నా అత్యాచారం చేసి చంపేస్తాడు. ఆ కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తాడు. ఇక ప్రస్తుత కాలానికి వస్తే.. స్టీఫెన్( మోహన్ లాల్) కేరళ విడిచి వెళ్లి ఐదేళ్లవుతుంది. తను వెళ్లేముందు దివంగత పికే రామ్ దాస్ తనయుడు జతిన్ ను సీఎమ్ సీట్లో కూర్చోబెడతాడు. అయితే జతిన్ తండ్రి ఆశయాలను కాదని సొంత ఎజెండా అమలు చేస్తుంటాడు. అత్యంత ప్రమాదకరమైన బాబా భజరంగిని కేరళకు తెచ్చి కొత్త పార్టీ పెడతా అని ప్రకటిస్తాడు. ఆ నిర్ణయాన్ని పార్టీతో పాటు అతని అక్క ప్రియ (మంజు వారియర్) వ్యతిరేకిస్తుంది. అయితే ఈ నిర్ణయం పట్ల స్టీఫెన్ ఎలా రియాక్ట్ అవుతాడా అని కేరళ అంతా ఎదురుచూస్తుంటుంది. మరోవైపు అబ్రామ్ ఖురేషీ ప్రపంచంలోని బిగ్ డ్రగ్ కార్టెల్స్ ను మట్టు పెడుతుంటాడు. ప్రపంచంలో ఇండో ఇరానియన్ తో పాటు చైనా టీమ్ కు చెందిన రెండు ఏజెన్సీల మధ్య ఆధిపత్య పోరు సాగుతుంటుంది. ఇండో ఇరానియన్ ఏజెన్సీకి అబ్రామ్ లీడర్. ఇతనికి సపోర్ట్ గా నిలుస్తుంటాడు జయేద్ మసూద్ (పృథ్వీరాజ్ సుకుమారన్). ప్రియ తండ్రి వారసత్వం తీసుకోవాలనుకున్నప్పుడు ఆమెపై హత్యా ప్రయత్నం చేస్తాడు. మరి తను బ్రతుకుతుందా.. అబ్రామ్ ఎవరు.. ఎవరి కోసం పనిచేస్తుంటాడు. స్టీఫెన్ తిరిగి కేరళకు వచ్చాడా లేదా అనేది మిగతా కథ.
ఎలా ఉంది.
పృథ్వీరాజ్ సుకుమారన్ లో మంచి దర్శకుడు ఉన్నాడని లూసీఫర్, బ్రో డాడీ చూస్తే తెలుస్తుంది. ఈ సారి ఆ దర్శకుడు కాస్త మిస్ అయినట్టు కనిపిస్తుంది. బట్ కథా పరంగా చూస్తే ఓ మంచి పాయింట్ ను తీసుకున్నారు. 2002లోదేశంలో జరిగిన(గుర్తున్నవారికి ఇది గోద్రా అల్లర్ల రిఫరెన్స్ అనిపిస్తుంది) అత్యంత హింసాత్మకమైన అల్లర్ల నేపథ్యంతో మొదలుపెట్టి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని ముఠాలు ఆయా దేశాల కోసం ఎలా పనిచేస్తాయి. ఈ క్రమంలో వారి మధ్య ఆధిపత్య పోరాటం ఎలా ఉంటుంది.. ఇందుకోసం వారు ఉపయోగించే ఏజెంట్స్ ఎంత నిక్కచ్చిగా ఉంటారు అనే కోణాలను చర్చిస్తూ కనిపిస్తుందీ సినిమా. అయితే సినిమా ప్రారంభమైన 50 నిమిషాల వరకూ హీరో ఎంట్రీ ఉండదు. మొదటి 20 నిమిషాల ఎపిసోడ్ ఆ కాలంలో జరిగిన అల్లర్లను, హత్యలను కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. కాస్త అతిగా సాగినట్టూ అనిపిస్తుంది. ఇటు కేరళలో పార్టీ నియమాలను కాదని ఓ మత తత్వ పార్టీని తీసుకువచ్చే ప్రయత్నం చేసే జతిన్ ను అండగా పెట్టుకుని ఆ మత పార్టీ నాయకుడు కేవలం మతం కోసం కాకుండా అక్కడ ఉన్న సహజ వనరులపై కన్నేసిన తీరు చూస్తే మతం అంటేనే రాజకీయం అని మొదటే ఓ లేడీ పాత్రతో చెప్పించిన మాట నిజం అనిపిస్తుంది. చంపేది హిందువులు, ముస్లీంలు కాదు.. రాజకీయాలు మాత్రమే మనుషులను చంపేస్తాయి అని స్పష్టంగా చెప్పించడంతో పాటు ఆ ఘటనలో గాయపడిన ఓ టీనేజర్ టెర్రరిస్ట్ కాకుండా మత ఛాందసుల ఎత్తుగడలను తిప్పి కొట్టిన అబ్రామ్ ఖురేషీ పాత్రలోని ఔన్నత్యాన్ని చూపిస్తాడు దర్శకుడు.
మోహన్ లాల్ ఎంట్రీ పవర్ ఫుల్ గా కనిపిస్తుంది. కాకపోతే ప్రతి సారీ ఎలివేషన్ తో ఆ పాత్రను పరిచయం చేయడం చిరాకు తెప్పిస్తుంది. అదీ కాక ప్రతి పాత్రను ప్రతిసారి ఎలివేషన్ లోనే చూపించాలనుకోవడం చూస్తే.. కేజీఎఫ్ ఎఫెక్ట్ అనిపిస్తుంది. బట్ ఆ ఎమోషన్ ఈ ఎలివేషన్స్ లో కనిపించదు. మోహన్ లాల్ ఆ పాత్రకు కావాల్సిన ‘ఆరా’ను అద్భుతంగా పలికించాడు. బ్రిటిష్ ఏజెన్సీలు, ఇరాన్ ఏజెన్సీలు, చైనా ఏజెన్సీల మధ్య ఇండియన్ ఏజెన్సీ పవర్ ఫుల్ గా కనిపించడం ఆనందమే కానీ అందుకు తగ్గ ఎలివేషన్ మాత్రం సెట్ కాలేదు.
అతను తిరిగి కేరళకు వచ్చినప్పుడు నైట్ ఎఫెక్ట్ లో ఫైట్ బావుంది. తర్వాత జతిన్ ను తప్పించి, ప్రియను సిఎమ్ సీట్ కు దగ్గర చేసే ఎత్తుగడలు చాలా బావున్నాయి. అతని అంచనాలకు తగ్గట్టుగా జరుగుతూ ఆడియన్స్ లో ఓ క్యూరియాసిటీని బిల్డ్ చేస్తాయి. ఈ క్రమంలో వచ్చే సీన్స్ ఒక పెద్ద పార్టీ తన మాట వినని వేరే పార్టీల నాయకులను ఎన్ఐఏ, ఈడి, సిబిఐ అంటూ ఎలా ఇబ్బంది పెడుతుంది అనేదానికి రిఫరెన్స్ లా కనిపిస్తుంది. కేరళలో పికే రాందాస్ పార్టీ మళ్లీ ఆయన ఆశయాలకు తగ్గట్టుగా ఉండేలా సెట్ చేసి వెళతాడు స్టీఫెన్ అలియాస్ లూసీఫర్. ఆ క్రమంలో క్లైమాక్స్ లో తనకు అత్యంత ఆప్తుడైన మనిషిని కోల్పోతాడు.
మొత్తంగా మతాలను వాడుకుని మనుషులను అందులో ఆడిస్తూ రాజకీయాలు సాగించే వికృత క్రీడను ఎత్తి చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్. ప్రస్తుతం దేశంలో జరుగుతోన్న ఎన్నో పరిణామాలు కళ్లముందే కనిపిస్తున్నాయి కాబట్టి అన్నీ వాస్తవాలు గానూ అదే రాజకీయ నాయకుల చేతుల్లో కీలు బొమ్మలుగా ఉన్నవారికి అసత్యాలుగానూ కనిపిస్తాయి. ఈ వైరుధ్యం అర్థం అయితే సినిమా మనుషులు బావుండాలి అనే పాయింట్ తో కనిపిస్తుంది. లేదంటే ఒక పార్టీని ఇబ్బంది పెట్టాలి అన్నట్టుగా కనిపిస్తుంది.
నటన పరంగా మోహన్ లాల్ గురించి చెప్పేదేముందీ.. పాత్రలోకి వెళ్లిపోయాడు. టోవినో థామస్ ఆకట్టుకున్నాడు. పృథ్వీరాజ్ కు పెద్దగా నటించే స్కోప్ ఉన్న పాత్ర కాదు. అభిమన్యు సింగ్ నిజంగా భయపెట్టాడు. అంత భయానకంగా నటించాడు. మంజు వారియర్ మరోసారి మెప్పిస్తుంది. ఇంద్రజిత్ సుకుమారన్, సాయికుమార్, కిశోర్, సూరజ్ వెంజరమూడు అంతా సహజంగా చేసుకుంటూ వెళ్లిపోయారు.
టెక్నికల్ గా మ్యూజిక్ లో ఎలివేషన్స్ బావున్నాయి. పాటలు పెద్దగా అర్థం కావు. సినిమాటోగ్రఫీ బ్రిలియంట్ గా ఉంది. ఎడిటింగ్ పరంగా చూస్తే తెలుగు వరకైనా ఓ అరగంట ట్రిమ్ చేయాల్సింది. డైలాగ్స్ బావున్నాయి. కానీ ఎక్కువ శాతం హిందీ, ఇంగ్లీష్ లోనే ఉన్నాయి. వీటికి తెలుగు సబ్ టైటిల్స్ పడుతుంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. డైరెక్షన్ పరంగా ఎలివేషన్స్ పెట్టిన శ్రద్ధ ఎమోషన్స్ పెట్టలేదు దర్శకుడు. మేకింగ్ బావుంది. టేకింగ్ బావుంది. కానీ ఆడియన్స్ కు హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ చేయడంలో వైఫల్యమూ ఉంది. లూసీఫర్ తో పోలిస్తే దర్శకుడుగా పృథ్వీరాజ్ ఈ సారి సగం మార్కులే తెచ్చుకున్నాడు అని చెప్పాలి.
ఫైనల్ గా : మతం, రాజకీయాల కలబోత
రేటింగ్ : 2.5/5
బాబురావు. కామళ్ల
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com