Nani HIT 3 Movie Review : నాని హిట్ 3 .. బ్లాక్ బస్టరా.. డిజాస్టరా..?

రివ్యూ : హిట్ 3
తారాగణం : నాని, శ్రీనిధిశెట్టి, రావు రమేష్, సముద్రఖని, కోమలి ప్రసాద్ తదితరులు
ఎడిటర్ : కార్తీక శ్రీనివాస్
సంగీతం : మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రఫీ : సాను జాన్ వర్ఘీస్
నిర్మాత : ప్రశాంతి తిపిర్నేని, నాని
దర్శకత్వం : శైలేష్ కొలను
హిట్ మూవీతో నిర్మాతగా ఆకట్టుకున్నాడు నాని. ఆ ఫ్రాంఛైజీని కంటిన్యూ చేస్తూ హిట్ 2తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు తనే హీరోగా హిట్ 3తో వచ్చాడు. ట్రైలర్ ఆకట్టుకుంది. ప్రమోషన్స్ భారీగా చేశాడు. రక్తపాతం ఉందన్నాడు. పిల్లలు, సెన్సిటివ్ పీపుల్ చూడొద్దన్నాడు. మరి నాని ఇన్ని ప్రత్యేకతలు చెబుతున్నాడంటే ఖచ్చితంగా బావుంటుందనే కదా అనుకుంటారు. అందుకే ఓపెనింగ్స్ కూడా భారీగా ఉన్నాయి. మరి నాని చెప్పినంత మేటర్ సినిమాలో ఉందా లేదా అనేది చూద్దాం.
కథ :
అర్జున్ సర్కార్ (నాని) సిన్సియర్ కాప్. జమ్ము కశ్మీర్ నుంచి వైజాగ్ ట్రాన్స్ ఫర్ పై వస్తాడు. అందుకు ఓ బలమైన కారణం ఉంటుంది. వైజాగ్ లో హిట్ (Homicide Intervention Team)టీమ్ లీడ్ గా ఉంటాడు. కానీ అతను అత్యంత క్రూరంగా ఓ హత్య చేస్తాడు. అదే కేస్ ను తను అటెండ్ చేస్తాడు. తర్వాత మరో హట్య చేయబోతుండగా తన టీమ్ మెంబర్ అయిన మరో లేడీ పోలీస్ చూస్తుంది. అతనిపై కాల్పులు జరుపుతుంది. అయితే తను ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాను అనేది తనకు చెబుతాడు. ఆ క్రమంలో అతను జమ్మూ కశ్మీర్ లో ఉండగా జరిగిన ఓ హత్య గురించి చెబుతాడు. ఆ హత్యకు కారణాలు తెలుసుకుంటాడు. అదో పెద్ద ముఠా అని తెలుసుకుంటాడు. ఆ ముఠాలో చేరేందుకు తను ఈ హత్యలు చేస్తున్నట్టు చెబుతాడు. అలాగే అతనికి మృదులతో పరిచయం ప్రేమగా మారుతుంది. ఆ తర్వాత ఆమె అతనికో షాక్ ఇస్తుంది. మరి ఈ హత్యలు చేయడానికి కారణం ఏంటీ.. ఆ ముఠా ఏం చేస్తుంది.. దీని వెనక ఉన్నది ఎవరు.. మృదుల బ్యాక్ గ్రౌండ్ ఏంటీ..? అనేది సినిమాలో చూడాలి.
ఎలా ఉంది :
హిట్ మూవీ చూసిన ఎవరికైనా ఓ టెంప్లేట్ తెలుస్తుంది. వరుస హత్యలు జరగడం. ఆ కేస్ ‘హిట్’ టీమ్ కు రావడం. దాని వెనక ఎవరున్నారో కనిపెట్టే క్రమంలో సాగే రేసీ స్క్రీన్ ప్లేతో కూడిన కంటెంట్ ఉంటుంది. హిట్, హిట్ 2 అలాగే విజయం సాధించాయి. ఇదీ అంతే. కాకపోతే సెకండ్ హాఫ్ కు వచ్చాక కథనం రక్తపాతం వైపు వెళుతుంది. అలాగని బలమైన ఇన్వెస్టిగేషన్ ఉందా అంటే లేదు అనే చెప్పాలి. హీరో తెలివికి పరీక్షపెట్టేంత ముడులు ఏం లేవు. అదంతా అతనికి అనుకూలంగా వెళ్లిపోతుంది అనిపిస్తుంది. బట్ చూస్తున్నప్పుడు వెరీ ఎంగేజింగ్ గా కనిపిస్తుంది. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్ ఎపిసోడ్ తో పాటు రెండో హత్య చేయబోతోన్న వ్యక్తిని పట్టుకునే క్రమంలో వచ్చే జైపూర్ ఎపిసోడ్.. సూపర్బ్ అనిపిస్తాయి. ఇంటర్వెల్ తో ఓ పెద్ద లాక్ ఓపెన్ చేయబోతున్నట్టు అనిపిస్తుంది. అనుకున్నట్టుగానే హీరో ఆ ముఠాలో జాయిన్ కావడం.. ఆ తర్వాత అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం.. ఇవన్నీ ఆడియన్స్ కూ కొత్తగా అనిపిస్తాయి. అదే టైమ్ లో ఈ మధ్య వచ్చిన యానిమల్, కిల్, మార్కో తరహా యాక్షన్ సీక్వెన్స్ లు కనిపిస్తాయి. అలాగే స్క్విడ్ గేమ్ లాంటి సిరీస్ లూ కనిపిస్తాయి. అయినా నాని తనదైన శైలిలో మెప్పించే ప్రయత్నం చేశాడు. ఒక్కోసారి ఇంత హింస అవసరమా అనిపిస్తుంది. అయినా మంచి కథనంతో అదీ పాసైపోతుంది.
ఓ రకంగా ఈ తరహా వయొలెన్స్ మూవీస్ చూసేవారికి బాగా నచ్చుతుంది. నాని క్యారెక్టరైజేషన్ ను బట్టి అతనితో విపరీతమైన బూతు మాటలు చెప్పించారు. వీటికి ఇమేజ్ కాస్త అడ్డొస్తుందేమో కానీ.. ఈ సినిమాలోని క్యారెక్టరైజేషన్ కు బానే సెట్ అవుతాయి. అయినా కొన్ని పదాలు వాడకుండా ఉండాల్సింది అనిపిస్తుంది. సినిమాకు ప్రధానంగా కనిపించే లోపం బలమైన విలన్ లేకపోవడం. ఈ తరహా సినిమాల్లో కనిపించే థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ కనిపించకపోవడం.. అలాగే అన్నీ యాక్షన్ తోనే అని చేసేయడంతో.. హిట్, హిట్ 2 చిత్రాల్లోని ఇంటెన్స్ థ్రిల్లర్ తో పోలిస్తే కాస్త తేలిపోతుంది.
అర్జున్ సర్కార్ గా నాని ఆ పాత్రను ఓన్ చేసుకున్నాడు. చాలా సార్లు అతన్ని నాని అని మర్చిపోతాం. అంత బాగా నటించాడు. హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటన పరంగా మైనస్ మార్కులే పడతాయి. తన పాత్ర ద్వారా వచ్చే ట్విస్ట్ లు మాత్రం ఆకట్టుకుంటాయి. కోమలి ప్రసాద్ బాగా నటించింది. రావు రమేష్, సముద్ర ఖని ఉన్నారంటే ఉన్నారంతే. చివర్లో కేమియోగా వచ్చిన అడివి శేష్, మాగంటి శ్రీనాథ్ పాత్రలకు విజిల్స్ పడతాయి. క్లైమాక్స్ పడిన తర్వాత 4వ పార్ట్ కు కార్తీతో చేయించిన కేమియో సైతం విజిల్ బ్లోయింగ్ గా ఉంది.
టెక్నికల్ గా మిక్కీ జే మేయర్ నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. పాటలు యావరేజ్. సినిమాటోగ్రఫీ సూపర్బ్ గా ఉంది. ఎడిటింగ్ బావుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. దర్శకుడుగా శైలేష్ కొలను ఈ కథను నాని కోరినట్టుగా రూపొందించాడని అర్థం అవుతుంది. దర్శకుడుగా మరోసారి తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేశాడు. ఆకట్టుకున్నాడు.
ఫైనల్ గా : హిట్ 3 - సూపర్ హిట్
రేటింగ్ : 3/5
- బాబురావు. కామళ్ల
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com