Saripodhaa Sanivaaram Movie Review : నాని సరిపోదా శనివారం మూవీ రివ్యూ

Saripodhaa Sanivaaram Movie Review :  నాని సరిపోదా శనివారం మూవీ రివ్యూ
X

రివ్యూ : సరిపోదా శనివారం

తారాగణం : నాని, ఎస్.జే. సూర్య, ప్రియాంక మోహన్, సాయి కుమార్, అభిరామి, మురళీ శర్మ

ఎడిటర్ : కార్తీక శ్రీనివాస్

సంగీతం : జేక్స్ బిజోయ్

సినిమాటోగ్రఫీ : మురళి జి

నిర్మాతలు : డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి

దర్శకత్వం : వివేక్ ఆత్రేయ

నేచురల్ స్టార్ నాని నుంచి మాస్ మూవీస్ వరుసగా వస్తున్నాయీ మధ్య. ఇప్పటి వరకూ చేసిన మూడు సినిమాలతో సెన్సిబుల్ డైరెక్టర్ అనిపించుకున్న వివేక్ ఆత్రేయ జానర్ మార్చి నానితో చేసిన సినిమా సరిపోదా శనివారం. ఇంతకు ముందు వీరి కాంబోలో వచ్చిన అంటే సుందరానికి ఆశించినంతగా ఆకట్టుకోలేదు. దీంతో ఈ సారి మాస్ ను టార్గెట్ చేస్తూ వచ్చారు. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ :

సూర్య ( నాని)కి చిన్నప్పటి నుంచి విపరీతమైన కోపం. ఆ కోపంతో చాలామందిని కొడుతుంటాడు. దీంతో అతని తల్లి (అభిరామి) కోపాన్ని కంట్రోల్ చేయడానికి కొన్ని టిప్స్ చెబుతుంది. అందులో భాగంగా ఎవరిపై అయినా కోపం వస్తే.. కొంత టైమ్ తీసుకుని బాగా ఆలోచించి ఆ తర్వాత కూడా కోపం ఉంటే వారంలో ఒక రోజు తీర్చుకోమని చెబుతుంది. అది ఏ రోజో చెప్పే టైమ్ కు ఆమె చనిపోతుంది. అది శనివారం. అప్పటి నుంచి తన కోపాన్ని తీర్చుకోవడానికి శనివారాన్ని ఎంచుకుంటాడు. పైగా తన పర్సనల్ మేటర్స్ లోనే కాదు.. సొసైటీలో ఎవరికైనా సమస్య వచ్చి.. అది తనకు కోపాన్ని తెప్పిస్తే అంతే. అది తన ప్రాబ్లమ్ అని ఫీలవుతాడు. అలా ఎవరి వల్ల తనకు కోపం వస్తుందో వారి పేర్లు డైరీలో రాసుకుంటాడు. శనివారం రోజు డైరీ తీసి ఆ రోజు కూడా కోపం ఉంటే వెళ్లి కొట్టి వస్తాడు. అలాంటి సూర్య ఎన్ఎల్ఐసీలో ఏజెంట్ గా పని చేస్తుంటాడు. అక్కడే ఓ క్రూరమైన సిఐ దయా (ఎస్జే సూర్య) ఉంటాడు. అతనికి తన అన్న ( మురళీ శర్మ) తో ఆస్తి తగాదాలు ఉంటాయి. ఆ క్రమంలో తనకు వచ్చే కోపాన్ని సోకుల పాలెం అనే ఊరి ప్రజలపై చూపిస్తాడు. ఇక అదే స్టేషన్ కు కానిస్టేబుల్ గా వస్తుంది చారులత ( ప్రియాంక). చారుతో సూర్య పరిచయం ప్రేమగా మారుతుంది. అలా ఒక రోజు తన డైరీలో సిఐ దయా పేరు రాసుకుంటాడు సూర్య. అందుకు కారణం ఏంటీ..? ఆ పోలీస్ తో సూర్యకు ఉన్న ఇష్యూ ఏంటీ.. మరి ఆ పోలీస్ ను తనదైన స్టైల్లో ఎలా కొట్టాడు అనేది మిగతా కథ.

విశ్లేషణ :

ఈ కథంతా విన్న తర్వాత శనివారం మాత్రమే కొట్టడం కన్విన్సింగ్ గా అనిపిస్తే మిగతా అంతా ఓకే అనిపిస్తుంది. లేదంటే ఇదేం గోలరా బాబు అనేలా ఉంటుంది సరిపోదా శనివారం. ఏ తల్లి అయినా తన కొడుకు కోపాన్ని పూర్తిగా తగ్గించే ప్రయత్నం చేస్తుంది కానీ.. ఇలా ఒక రోజు తీర్చుకోమని ఆప్షన్ ఇవ్వదు. ఇచ్చిందీ అనుకున్నా.. కోపం అతనికి మాత్రమే కాదు కదా.. అవతలి వారికీ ఉంటుంది. అదేంటో వాళ్లూ ఇతని శనివారంకు ప్రాధాన్యం ఇస్తూ అప్పటి వరకూ పట్టించుకోరు. మనోడు శనివారం వెళ్లి కొడితే కొట్టించుకుంటారు. కానీ ఫస్ట్ హాఫ్ అంతా వివేక్ ఆత్రేయ రైటింగ్ తెలివితో ఆకట్టుకుంటాడు. ఇది సాధ్యమా అన్న ప్రశ్న వచ్చినా.. ఏమో అనిపించేస్తాడు. ఎప్పుడైతే పోలీస్ తో గొడవ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి కథనం పరుగులు పెడుతుంది. ఎత్తులూ పై ఎత్తులూ అంటూ రేసీగా ఉంటుందనుకుంటాం. బట్ అలా జరగలేదు. సెకండ్ హాఫ్ చాలా సాగదీతగా కనిపిస్తుంది. అనవసరమైన సన్నివేశాలు వచ్చి పడుతుంటాయి. పైగా చూసేవాడికి ఎమోషన్ వచ్చినా.. ఆ ఎమోషన్ ను తీర్చాల్సిన హీరో శనివారం వరకూ ఆగాలి కదా. అది మరీ చిరాకుగా ఉంటుంది. కానీ హీరోకు అవసరం వస్తే క్యాలెండర్ లో శుక్రవారం పేజీ దానంతట అదే చిరిగిపోతుందన్నమాట.

ఇక హీరో , విలన్ ఫేస్ టు ఫేస్ వచ్చిన తర్వాత కథనం పక్కదాని పడుతుంది. మాస్క్ వెనక మొహం లాగా సూర్య ఎదురుగానే ఉన్నా.. దయా అస్సలే మాత్రం బుర్రకు పని చెప్పడు. మరోవైపు తన అన్నతో ఉన్న గొడవ ఓ ట్విస్ట్ లాగా తేలిపోతుంది. దీంతో అటు వైపు నుంచి కూడా సీరియస్ నెస్ కనిపించదు. అలా సెకండ్ హాఫ్ చాలా వరకూ తేలిపోయిందనే చెప్పాలి. ఒక బస్తీ లాంటి ఊరు. వారిని వేధించే విలన్. అక్కడికి వచ్చి ఆ జనానికి ధైర్యం చెప్పి అండగా నిలబడి విలన్ ను అంతం చేసే హీరో. ఇంతకు మించి పెద్దగా ఏం కనిపించదీ సినిమాలో. కాకపోతే కొత్త నేపథ్యంతో కనిపించే కథనం ఆకట్టుకుంటుంది. అందుకే ఎమోషన్స్ పండకపోయినా ఈ స్క్రీన్ ప్లే వల్ల చూస్తున్నంత సేపూ ఎంగేజింగ్ గానే అనిపిస్తుంది. అది కూడా ఫస్ట్ హాఫ్ వరకే కావడం కొంత మైనస్ గా మారింది.

సూర్య పాత్రను బాగా రాసుకున్నాడు దర్శకుడు. కానీ ఆ క్యారెక్టరైజేషన్ ను ఎలివేట్ చేసే క్రమంలో అతను రోజుల తరబడి ఒకే వ్యక్తిని స్టేషన్ లో బంధించి కొట్టడం అనేది ఓవర్ ద బోర్డ్ అనేలా ఉంటుంది. ఇంత సెల్ ఫోన్ కాలంలో ఇలాంటి పోలీస్ ల గురించి బయటి ప్రపంచానికి సులువుగానే తెలిసిపోతుంది. పైగా పోలీస్ వ్యవస్థ దయా పొజిషన్ తోనే ఎండ్ అయినట్టుగా అతనిపైన ఇంకెవ్వరూ కనిపించరు.

నాని యాక్షన్ హీరోగా ఆకట్టుకున్నాడు. అతని ఇమేజ్ కు భిన్నంగా ఊరమాస్ ఫైట్స్ చేస్తుంటే వెరైటీగా ఉంది. నటన పరంగా కొత్తదనం చూపించాల్సిన అవసరం లేని పాత్ర కూడా. కేవలం సీరియస్ నెస్ అంతే. విశేషం ఏంటంటే అంత కోపం ఉన్న హీరో తలపడే విలన్లు ఇద్దరు. ఒకటి అజయ్ ఘోష్ విలన్లు. రెండోది ఎస్జే సూర్య పాత్రే. ఫస్ట్ హాఫ్ అంతా అజయ్ ఘోష్ మనుషులతోనే ఫైట్. సెకండ్ హాఫ్ దయాతో. అంతే.

ప్రియాంక పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. హర్షవర్ధన్ ఆకట్టుకున్నాడు. మురళీ శర్మ మరోసారి రొటీన్ రోల్ అయినా తనదైన శైలిలో మెప్పించాడు. సాయి కుమార్ కు ఈ మధ్య కాలంలో ఫాదర్ క్యారెక్టర్స్ తో పోలిస్తే బెటర్ రోల్. అభిరామి, ఝాన్సీ, అనిత చౌదరి, శుభలేఖ సుధాకర్ లవి అతిథి పాత్రలకు ఎక్కువ ప్యాడింగ్ ఆర్టిస్ట్ లకు తక్కువ.

సినిమాకు హైలెట్ గా నిలిచింది జేక్స్ బెజోయ్ నేపథ్య సంగీతం. ఓ రేంజ్ లో అందించాడు ఆర్ఆర్. ఓరకంగా చాలా సాధారణంగా కనిపించే ఈ సినిమాను కాస్త ఎక్కువ స్థాయిలో నిలిపింది అతని నేపథ్య సంగీతమే. పాటలు మాత్రం యావరేజ్. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. లైటింగ్, హీరో ఎలివేషన్ కోసం వాడిన కలరింగ్స్ బావున్నాయి. డైలాగ్స్ ఓకే. ఎడిటింగ్ పరంగా చాలా నిడివి తగ్గించొచ్చు. నిర్మాణ విలువలు రిచ్ గా కనిపించాయి. దర్శకుడుగా వివేక్ ఆత్రేయ తనలోని కొత్త యాంగిల్ ను చూపించడంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు. కాకపోతే కథలో డెప్త్ లేకుండా కేవలం ఎలివేషన్స్ తోనే ముందుకు వెళ్లాలనుకోవడం వివేకంగా అనిపించలేదు. సూర్యను ఎంతో పవర్ ఫుల్ గా చూపించి హీరోను అతని ముందు వీక్ గా నిలపడంతో ఆ పాత్రే తేలిపోయింది. ఓవరాల్ గా ఓకే అనిపించాడు.

ఫైనల్ గా : చాలా ఎక్కువైంది

రేటింగ్ : 3/5

- బాబురావు. కామళ్ల

Tags

Next Story