Rang De Movie Review : 'రంగ్‌దే' మూవీ రివ్యూ..!

Rang De Movie Review : రంగ్‌దే మూవీ రివ్యూ..!
కొన్ని సినిమాలు విడుదలకు ముందే హిట్ కళను తెచ్చుకుంటాయి. మరికొన్ని సినిమాలు ఎలా ఉన్నా చూడాల్సిందే అని ముందే ఫిక్స్ అయ్యేలా ఉంటాయి.

కొన్ని సినిమాలు విడుదలకు ముందే హిట్ కళను తెచ్చుకుంటాయి. మరికొన్ని సినిమాలు ఎలా ఉన్నా చూడాల్సిందే అని ముందే ఫిక్స్ అయ్యేలా ఉంటాయి. ఈ రెండు ఫీలింగ్స్ ను ఒకేసారి కలిగించిన సినిమా రంగ్ దే. నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈసినిమా ఇవాళ విడుదలైంది. ఈ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పుడే ఆసక్తిని పెంచి.. ఆ తర్వాత టీజర్, సాంగ్స్, ట్రైలర్ తో అంచనాలు పెంచింది టీమ్. మరి ఆ అంచనాలను ఈ సినిమా నిర్మించిన సితార బ్యానర్ అందుకుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం..

ఎనర్జిటిక్ పర్ఫార్మర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు నితిన్. ఏ పాత్రైనా సులువుగా చేయగల టాలెంటెడ్ అనిపించుకున్న బ్యూటీ కీర్తి సురేష్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఫస్ట్ మూవీ అనగానే ఆటోమేటిక్ గా అందరిలోనూ ఆసక్తి పెరిగింది. దీనికి తోడు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కు కేరాఫ్ అయిన సితార బ్యానర్ లో వస్తోంది అనగానే ష్యూర్ షాట్ అనుకున్నారు. అలాగే నితిన్ కు లాస్ట్ ఇయర్ ఇదే నెలలో ఇదే బ్యానర్ లో భీష్మ వంటి సూపర్ హిట్ పడింది కదా. ఆ సెంటిమెంట్ కూడా రిపీట్ అవుతుందని చాలామంది భావించారు. అలా ఫీలవడం తప్పేం కాదని ప్రూవ్ చేసుకుంటోంది రంగ్ దే.

రంగ్ దే కథగా చూస్తే.. అర్జున్, అనపమ చిన్నప్పటి నుంచి పక్క పక్క ఇళ్లలోనే పెరుగుతారు. అర్జున్ కు అను అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండదు. రాన్రానూ అది ద్వేషంగా మారుతుంది. అటు అను మాత్రం అర్జున్ అంటే ఇష్టం పెంచుకుంటుంది. అది చూపించాలనుకున్న ప్రతిసారీ అర్జున్ అవాయిడ్ చేస్తుంటాడు. అలాంటి ఈ ఇద్దరికీ ఏకంగా పెళ్లవుతుంది. చదువుకోసం దుబాయ్ కీ వెళతారు. అక్కడ అర్జున్ కు ఇష్టం లేకపోయినా అనూ ప్రగ్నెంట్ అవుతుంది.. అసలు అను అంటేనే ఇష్టపడని అర్జున్ కు అనును పెళ్లి చేసుకునేలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి..? చివరికి ఈ ఇద్దరూ కలిశారా..? అర్జున్ ద్వేషం తగ్గి ప్రేమ పుడుతుందా అనేది మిగతా కథ.

ఏ ప్రేమకథ ఉద్దేశ్యమైనా సక్సెస్ కావడం.. ఇద్దరు జంటవడం. కానీ ఇక్కడ జంటగా ఉన్న ఇద్దరిలో ఒకరికి ప్రేమ ఉండదు. అదే ఈ కథలో కనిపించే కొత్తదనం అనిపిస్తోంది కదూ..? యస్.. అర్జున్ కు ఇష్టం లేకుండా ఆమెను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు.. అనే పాయింట్ తో పాటు ఇష్టం లేకుండానే ప్రెగ్నెన్సీ వరకూ ఎలా వెళ్లారు.. అనేది మరో ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈ రెండు అంశాలూ ఆడియన్స్ ను ఆకట్టుకోవాలంటే స్క్రీన్ ప్లే లో ఏదో మ్యాజిక్ ఉండాలి. ఆ మ్యాజిక్ ఉంది కాబట్టేనేమో రంగ్ దే హిట్ టాక్ తెచ్చుకుంది.

ఎంత కాదనుకున్నా రంగ్ దే చూస్తున్నప్పుడు కొన్ని పాత సినిమాలు గుర్తొస్తాయి. కానీ ట్రీట్మెంట్ పరంగా రంగ్ దే సరికొత్తగా కనిపిస్తుంది. నితిన్, కీర్తిల పెయిర్ ప్రధాన ఆకర్షణగా వారి నటన హైలెట్ గా ప్రతి సీన్ ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. ఈ ఇద్దరినీ ఇంకా అందంగా చూపిస్తూ పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఉంటుంది. మరీ ఎక్కువ ట్విస్టులు లేకుండా కేవలం ఎంటర్టైన్మెంట్ ను దృష్టిలో పెట్టుకునే దర్శకుడు వెంకీ అట్లూరి కథనం రాసుకున్నట్టు కనిపిస్తుంది. నిజానికి ప్రేమకథల్లో ఎక్కువ శాతం వర్కవుట్ అయ్యేదే మంచి కథనం వల్ల. ఆ విషయంలో దర్శకుడు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ తో సర్ ప్రైజ్ చేసి సెకండ్ హాఫ్ స్టార్ట్ కాగానే ఆ ఇద్దరికీ ముడేశాడు. దీంతో ఆ ముడి వారి మనసుల్లోనూ పడేలా చేయడం కోసం రాసుకున్న సన్నివేశాలు మలిసగాన్ని సాఫీగా తీసుకువెళతాయి.

ఫస్ట్ హాఫ్ లో ప్రధాన పాత్రల మధ్య వచ్చే గిల్లికజ్జాలు మంచి ఎంటర్టైనింగ్ గా సాగుతాయి. అభినవ్ గోమటం, సుహాస్ ల కామెడీతో పాటు బ్రహ్మీజీతో ఉన్న సీన్స్ అన్నీ హెల్డీ కామెడీని పంచాయి. సెకండ్ హాఫ్ లో వెన్నెల కిశోర్ మంచి ఛాయిస్ గా కనిపిస్తాడు. హీరో అండ్ టీమ్ చేతిలో మోసపోయి దుబాయ్ లో చిక్కుకున్న ఆ పాత్రను చివరికి ఈ ఇద్దరి మనస్పర్థలను తొలగించే వాహకంగానూ దర్శకుడు వాడుకున్న తీరు ఆకట్టుకుంటుంది. నితిన్, కీర్తిల మధ్య వచ్చే ఓ ఇంటిమేట్ సాంగ్ ఖచ్చితంగా కీర్తి ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తుంది. ఇతర పాత్రల్లో నరేష్, కౌసల్య, రోహిణిలకు ఇవన్నీ టైలర్ మేడ్ రోల్స్. హీరో బావ పాత్రలో నిన్నటి యంగ్ తరంగ్ వినీత్ మెరుస్తాడు.

రంగ్ దే కు ఆర్టిస్టుల తర్వాత మెయిన్ ఎస్సెట్ టెక్నికల్ సపోర్ట్. పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇక దేవీ శ్రీ ప్రసాద్ పాటలు, ఆర్ఆర్ తో బ్యాక్ బోన్ లా నిలిచాడు. ఎడిటింగ్ బావుంది. మాటలు ఆకట్టుకుంటాయి. అన్నిటికీ మించి ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. మొత్తంగా ఆలస్యంగా వచ్చినా అలరించడం గ్యారెంటీ అనే నమ్మకంతో ఉన్న దర్శకుడి కాన్ఫిడెన్స్ ను ప్రేక్షకులు నిజం చేసినట్టే అని చెప్పాలి. అంటే నితిన్ అకౌంట్ లో సితార బ్యానర్ నుంచి మరో హిట్ పడినట్టే అని అర్థమవుతోంది కదా..?

TV5 రేటింగ్ 3/5

పంచ్ లైన్ : నితిన్ బర్త్ డే గిఫ్ట్

Tags

Next Story