Officer : తెలుగలో డబ్ అయిన మళయాల మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఎలా ఉంది.?

Officer  :  తెలుగలో డబ్ అయిన మళయాల మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఎలా ఉంది.?
X

రివ్యూ : ఆఫీసర్ ఆన్ డ్యూటీ

తారాగణం : కుంచకో బోబన్, ప్రియమణి, జగదీష్, వైశాఖ్ నాయర్, వైశాఖ్ శంకర్, అంజలి రాజ్, లియా మమ్మేన్ తదితరులు

ఎడిటర్ : ఛామన్ చక్కో

సినిమాటోగ్రఫీ : రాబీ వర్ఘీస్ రాజ్

సంగీతం : జేక్స్ బెజోయ్

నిర్మాతలు : మార్టిన్ ప్రక్కత్, రంజిత్ నాయర్, శిబి చావర

దర్శకత్వం : జీతూ అష్రఫ్

ఓటిటి వచ్చిన తర్వాత మళయాల సినిమా దేశంలోని అన్ని భాషల వారికీ బాగా దగ్గరయింది. అయితే మాలీవుడ్ మూవీస్ లో ఎక్కువ మందికి కనెక్ట్ అయ్యేది ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీస్. ఈ తరహాలో గత నెల 20న విడుదలైన సినిమా ఆఫీసర్ ఆన్ డ్యూటీ. కుంచకో బోబన్, ప్రియమణి జంటగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఈ శుక్రవారం విడుదల చేశారు. మరి ఈ ఆఫీసర్ ఎలా ఉన్నాడో చూద్దాం.

కథ :

హరిశంకర్ (కుంచకో బోబన్) సిఐ. చాలా అగ్రెసివ్ పోలీస్. ఆ కారణంగా సస్పెండ్ అయ్యి అప్పుడే డ్యూటీలో జాయిన్ అవుతాడు. మొదటి రోజే నకిలీ గోల్డ్ చైన్ కు సంబంధించిన కేస్ వస్తుంది. ఆ కేస్ ను ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో అతనికో రహస్యం తెలుస్తుంది. దాన్ని ఛేదిస్తూ వెళ్లే క్రమంలో అలాంటివే మరో మూడు చైన్స్ కూడా అలాగే ఉన్నాయని తెలుసుకుంటాడు. దీని వెనక కొన్ని ఆత్మహత్యలు కూడా ఉంటాయి. అలా ఆ లింక్ ను ఛేదిస్తూ వెళుతున్న క్రమంలో తన జీవితంలో జరిగిన ఓ పెద్ద విషాద ఘటన వెనక ఉన్న చెప్పుకోలేని రహస్యం తెలుస్తుంది. ఈ మొత్తం సంఘటనల వెనక ఒక ముఠా ఉందని తన విచారణలో పై ఆఫీసర్స్ కు చెబుతాడు. మరి ఆ ముఠా ఎవరు..? ఈ హత్యలు, ఆత్మహత్యల వెనక ఉన్న నిజాలేంటీ..? ఈ మొత్తం ఎపిసోడ్స్ కు ఆ గోల్డ్ చైన్స్ కు ఉన్న సంబంధం ఏంటనేది మిగతా సినిమా.

ఎలా ఉందంటే..

ఆఫీసర్ ఆన్ డ్యూటీ.. ట్రైలర్ చూస్తేనే ఈ పోలీస్ చాలా అగ్రెసివ్ అని తెలుస్తుంది. అది సినిమా అంతా కనిపిస్తుంది. అదే సమయంలో సగం సినిమా తర్వాత ఆ పోలీస్ లో తెలియని ఆవేదన నిండిపోతుంది. సాధారణంగా ఇలాంటి మిస్టరీ థ్రిల్లర్స్ లో బాధితులకు న్యాయం చేయడానికి పోలీస్ లు ఉంటారు. ఇందులో ఆ కేస్ ను ఇన్వెస్టిగేట్ చేస్తోన్న పోలీస్ కూడా బాధితుడే కావడం విశేషం. కానీ సినిమా ఆ కోణంలో మొదలవదు. అతను నిజాయితీగా డ్యూటీ చేస్తోన్న క్రమంలో అందులో తన కూతురు కూడా ఉందన్న విషయం తెలుస్తుంది. తన కూతురు ఆత్మ హత్య చేసుకుంటుంది. ఓ పోలీస్, మరో అమ్మాయి కూడా చనిపోతారు. వీటి వెనక ఉన్న ‘కుర్రాడు’ని హరిశంకర్ చంపేస్తాడు. కానీ ఆ నేరం మరో పోలీస్ తన మీద వేసుకుంటాడు. అక్కడే కథ మరో టర్న్ తీసుకుంటుంది. ఆ కుర్రాడి ఫ్రెండ్స్ అంతా ఆ పోలీస్ పై పగపడతారు. కానీ చంపింది హరి అని తెలిసి అతన్నీ టార్గెట్ చేస్తారు. వీళ్లే కాదు.. తమ ఫ్రెండ్ మరణానికి డైరెక్ట్ గా, ఇన్ డైరెక్ట్ గా కారణమైన ప్రతి ఒక్కరినీ చంపేయాలని ప్రయత్నిస్తుంటారు. అన్నట్టుగానే పోలీస్ దంపతులను చంపేస్తారు. అక్కడి నుంచి వీరి మూలాలు బెంగళూరులో ఉన్నాయని తెలుసుకున్ను హరిశంకర్ తన టీమ్ తో అక్కడికి వెళ్లి వారి గురించి తెలుసుకుంటాడు. ఈ క్రమంలో అతను ఎదుర్కొనే మానసిక సంఘర్షణతో పాటు ఆ విలన్ గ్యాంగ్ చేసే ఆకృత్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. ముఖ్యంగా మార్చురీలో ఫైట్ చూస్తే.. ఆ ఇంటెన్సిటీకి ఫిదా అయిపోతాం. ఇలాంటి మూవీస్ గురించి ఎక్కువగా చెబితే థ్రిల్ పోతుంది. కాబట్టి సెకండ్ హాఫ్ చాలా ల్యాగ్ అనిపించినా.. ఈ తరహా సినిమాను ఇష్టపడే వారితో పాటు.. కూతుళ్లు ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అని చెప్పొచ్చు.

నటన పరంగా చూస్తే కుంచకో బోబన్ ఓటిటి ఆడియన్స్ కు బాగానే తెలుసు. కొన్నాళ్ల క్రితం మిడ్ నైట్ మర్డర్స్ అనే సినిమాతోనూ ఆకట్టుకున్నాడు. బట్ ఈ మూవీలో అతని నటన కట్టి పడేస్తుంది. ఆ పాత్రలో జీవించాడు. ప్రియమణి పాత్ర చాలా సాధారణంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ సగం తర్వాతే అసలు మొత్తం కథలో తన ఎపిసోడే అత్యంత కీలకం. ఇక విలన్ గ్యాంగ్ గురించి చెప్పాలి. నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. వారిని చూస్తేనే భయం వేస్తుంది. డ్రగ్స్ కు అడిక్ట్ అయిన వారు ఇలాగే ఉంటారు అనిపించేంత సహజంగా నటించారు. అమ్మాయిలైతే మరీ వయొలెంట్ గా కనిపిస్తారు. అంటే అంత గొప్పగా నటించారు. కండక్టర్ పాత్రలో జగదీష్ సహజంగా ఆకట్టుకున్నాడు. అతని పోలీస్ ఫ్రెండ్స్ కూడా నేచురల్ గా చేసుకుంటూ పోయారు.

టెక్నికల్ గా జేక్స్ బెజోయ్ సంగీతం బావుంది. సినిమాటోగ్రఫీ సూపర్బ్. తెలుగు డబ్బింగ్ చాలా బావుంది. ఎక్కడా డైలాగ్స్ తడబడలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బావున్నాయి. దర్శకుడు జీతూ అష్రఫ్ ఈ మూవీలో నటించాడు కూడా. ఫస్ట్ సూసైడ్ చేసుకునే పాత్ర అతనే. దర్శకత్వ పరంగా ఓ ఇంటెన్సివ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని మలచడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు.

ఫైనల్ గా : ఆఫీసర్ అదరగొట్టాడు

రేటింగ్ : 3/5

బాబురావు. కామళ్ల

Tags

Next Story