Operation Raavan Movie Review : ఆపరేషన్ రావణ్ మూవీ రివ్యూ

Operation Raavan Movie Review : ఆపరేషన్ రావణ్ మూవీ రివ్యూ
X

రివ్యూ : ఆపరేషన్ రావణ్

తారాగణం : రక్షిత్, సంగీర్తన విపిన్, చరణ్ రాజ్, రాధిక, టివి5 మూర్తి తదితరులు

ఎడిటర్ : సత్య గిడుతూరి

సంగీతం : శ్రావణ్ వాసుదేవ్

సినిమాటోగ్రఫీ : నాని చమిడిశెట్టి

నిర్మాత : ధ్యాన్ అట్లూరి

దర్శకత్వం : వెంకట సత్య

పలాస 1978 మూవీతో ఫేమ్ అయిన హీరో రక్షిత్. కమర్షియల్ గా వర్కవుట్ కాకపోయినా ఈ మూవీతో మంచి గుర్తింపు వచ్చింది. రీసెంట్ గా నరకాసుర అనే మూవీతోనూ ఆకట్టుకున్నాడు. తాజాగా తన తండ్రి వెంకట్ సత్య డైరెక్షన్ లోనే ఆపరేషన్ రావణ్ అనే మూవీతో వచ్చాడు. నరకాసురలో ఒక హీరోయిన్ గా నటించిన విపిన్ సంగీర్తన హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఈ శుక్రవారం విడుదలైంది. ఈ రావణ్ ఎలా ఉన్నాడో చూద్దాం.

కథ :

నగరంలో పెళ్లికి సిద్ధమైన అమ్మాయిలను అపహరించి హత్య చేస్తుంటాడో సైకో కిల్లర్. అతన్ని పట్టుకునే ప్రయత్నంలో ఉంటుంది పోలీస్ డిపార్ట్ మెంట్. టివి 45 అనే ఒక ఛానల్లో పనిచేసే ఆమని(సంగీర్తన ) కు తోడుగా రామ్ ఆ కేస్ ను పోలీస్ లు సరిగా ఇన్వెస్టిగేట్ చేయడం లేదు అని.. వీళ్లూ దర్యాప్తు మొదలుపెడతారు. ఈ క్రమంలో వీరు ప్రేమలో పడి పెళ్లికి సిద్ధం అవుతారు. పెళ్లికి ముందు రోజు ఆమనని కూడా కిడ్నాప్ చేస్తాడు ఆ సైకో. మరి అతనెవరు.. ఆమెను రామ్ ఎలా కాపాడుకున్నాడు. ఆ సైకో మోటివ్ ఏంటీ.. అనేది మిగతా కథ.

ఎలా ఉంది.. :

కొన్ని సినిమాల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఇది కోవలోకే వచ్చే సినిమా. ఎంచుకున్న కథ నేపథ్యం, సమాజం, డిపార్ట్ మెంట్ పట్ల కనీస అవగాహన కూడా లేకుండా రాసుకున్న కథ, తీసిన సినిమా అంటే అతిశయోక్తి కాదు. పోనీ మేకింగ్ పరంగా బావుందా అంటే అదీ లేదు. సహనంతో టెస్ట్ మ్యాచ్ ఆడుకున్నారు. అసలు ఇలాంటి సీరియల్ కిల్లర్, సైకో తరహా సినిమాలకు కావాల్సింది స్పీడ్ స్క్రీన్ ప్లే. నెక్ట్స్ ఎవరిని చంపుతారా అనే ఉత్కంఠ. ఆ రెండూ అస్సలు లేకుండా రూపొందించిన సినిమా. హీరో పేరు రామ్ కాబట్టి.. విలన్ హీరోయిన్ ను ఎత్తుకుపోయాడు కాబట్టి ఆపరేషన్ రావణ్ అనే టైటిల్ పెట్టారు. ఫస్ట్ హాఫ్ ఆరంభంలో ఒక హత్య. అంతే ఇంక ఆ సైకో కిల్లర్ అడ్రస్ ఉండడు. ఈలోగా టివి ఛానల్ లో వ్యవహారం అంటూ అసలు ఒక న్యూస్ ఛానల్ ఎలా పనిచేస్తుందో కూడా అవగాహన లేని రైటింగ్ తో కావాల్సినంత విసిగించేశారు. హీరోయిన్ కిడ్నాప్ తో ఇంటర్వెల్ బ్యాంగ్. ఓ ఏసిపిని ఆ సైకో చంపితే ఆ శవాన్ని ఇంటికి తీసుకువెళ్లే వరకూ ఆ కుటుంబానికి తెలియదట. ఇంత టెక్నాలజీ, మీడియా, సోషల్ మీడియా ఉన్న టైమ్ లో ఏసిపిని చంపితే శవం ఇంటి వరకు వచ్చే వరకూ ఫ్యామిలీకి తెలియదు అని చూపించారు.. ఇది చాలు దర్శకుడి పనితనం తెలియడానికి., ఇలాంటివి కో కొల్లలు.

ఇక సైకో ఎవరో ఊహించగలిగేలానే ఉంటుంది. అతని మోటో మాత్రం కన్విన్సింగ్ గా లేదు. అందుకోసం మరో ఉపకథను భరించాలి. మొత్తంగా ఇప్పటికే సైకో కిల్లర్ కథలు చాలా చూశాం. ఆ కోవకు ఏ మాత్రం చెందని కథ ఇది. కథనం ఇమెచ్యూర్ గా ఉంటుంది. భరించలేనంత లాగ్ కూడా ఉంది. అయినా ఫర్వాలేదు అనుకుంటే చూడొచ్చు.

నటన పరంగా రక్షిత్ కు ఇప్పటికీ డిక్షన్ పై పట్టు రాలేదు. పలాసలో అద్భుతంగా ఆకట్టుకున్నా.. ఆ నటనను కంటిన్యూ చేయలేకపోతున్నాడు. ఈ మూవీలో చాలా చోట్ల క్లూ లెస్ ఎక్స్ ప్రెషన్స్ కనిపిస్తాయి. హీరోయిన్ గా సంగీర్త అందంగా ఉంది.బానే చేసింది. రాధిక, చరణ్ రాజ్ లాంటి సీనియర్స్ ఉన్నా.. వాళ్లు కథకు ఉపయోగపడింది లేదు. ఉన్నారంటే ఉన్నారంతే. మిగతా అంతా రొటీన్

టెక్నికల్ గానూ జస్ట్ ఓకే అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ బిలో యావరేజ్. ఆర్ఆర్ కాస్త ఫర్వాలేదు అనిపిస్తుంది. ఎడిటింగ్ పరంగా ఓ 20 నిమిషాలు ట్రిమ్ చేసినా ఈ మూవీలో వేగం రాదు. సో.. దాని గురించి చెప్పడం వేస్టేమో. దర్శకత్వం లోపం స్పష్టంగా కనిపిస్తుంది. చాలా చోట్ల అది కనిపిస్తుంది. ఇలాంటి కథలకు చాలా హోమ్ వర్క్ అవసరం అని దర్శకుడికి రిజల్ట్ చెబుతుందేమో.

ఫైనల్ గా : ఆపరేషన్ ఫెయిల్

రేటింగ్ :1.5/5

- బాబురావు. కామళ్ల

Tags

Next Story