Rocketry Review: 'రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్' మూవీ రివ్యూ.. మాధవన్ లెక్క ఎక్కడ తప్పింది..?

Rocketry Review: రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ మూవీ రివ్యూ.. మాధవన్ లెక్క ఎక్కడ తప్పింది..?
Rocketry Review: నంబి నారాయణన్ జీవితకథను ఇప్పటివరకు ఎవరూ చెప్పడానికి ప్రయత్నించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

Rocketry Review: ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేసి, దేశద్రోహి ముద్ర వేసుకొని, ఎన్నో సంవత్సరాలు ఓ క్రిమినల్‌గా జైలులో గడిపారు నంబి నారాయణన్. తన పనికి మెచ్చిన నాసా.. తనకు ఓ ఉన్నతస్థాయి ఉద్యోగాన్ని ఆఫర్ చేసినా వెళ్లకుండా దేశసేవ చేయాలనుకున్న నంబి జీవితంలో ఎన్నో అనుకోని ములుపులు తిరిగింది. ఇలాంటి వ్యక్తి జీవితకథను ఇప్పటివరకు ప్రేక్షకులకు ఎవరూ చెప్పడానికి ప్రయత్నించకపోవడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అందుకే మాధవన్ ఈ పనిచేయడానికి ముందుకొచ్చారు.


లవర్ బాయ్‌లాగా పేరు తెచ్చుకున్న మాధవన్.. నంబి నారాయణన్ లాంటి వ్యక్తి జీవితకథను ప్రేక్షకులకు చెప్పాలనుకొని పెద్ద సాహసమే చేశారు. ఇప్పటివరకు మాధవన్‌ను ఒకవిధంగా చూడడానికి అలవాటు పడిన ప్రేక్షకులకు తనలోని కొత్త కోణాన్ని చూపించాడు. అందుకే తాను కథ రాసి, దర్శకత్వం వహించిన 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌' చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఆ అంచనాలను డైరెక్టర్‌గా మాధవన్ కొంతమేరకు అందుకోగలిగాడు.


నంబి నారాయణన్ జీవితకథ గురించి చాలాంమందికి తెలియదు. అందుకే మాధవన్.. ఆ కథను ఇంకాస్త ఎఫెక్టివ్‌గా చూపించవచ్చని ప్రేక్షకులు విమర్శిస్తున్నారు. ఓ సైంటిస్ట్ కథను తెరకెక్కిస్తున్నప్పుడు.. అది ప్రతీ ఒక్క ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పడం కొంచెం కష్టమే. కానీ మాధవన్.. ఈ విషయంలో మాత్రం కాస్త ఎక్కువగానే జాగ్రత్తపడ్డారు. రాకెట్రీలో ఫస్ట్ హాఫ్ అంతా దాదాపు రాకెట్ల తయారీ చూపించడంతోనే గడిచిపోతుంది.


నంబి నారాయణన్.. ఎంతోమంది జాతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలతో పనిచేశారు. అయితే ఆ శాస్త్రవేత్తల పాత్ర పోషించిన వారితో తమిళంలో మాట్లాడించేలా చేయడం చూడడానికి కాస్త అసౌకర్యంగా ఉంటుంది. ఎవరి భాషలో వారు మాట్లాడి ఉంటే లిప్ సింక్‌లాంటి సమస్యలు ఎదురవ్వకుండా, సీన్స్ కూడా చూడడానికి బాగుండేవి అని చాలామంది ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


రాకెట్రీలో ఫస్ట్ హాఫ్ శాస్త్రవేత్తగా నంబి జీవితాన్ని చూపించినా.. ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అయ్యే భావోధ్వేగం అంతా సెకండాఫ్‌లోనే ఎక్కువగా కనిపించింది. నిర్దోషిగా నంబి విడుదలయ్యే సీన్స్, పద్మభూషణ్‌ అందుకునే సీన్.. సినిమాలో లీనమయిన వారికి కంటతడి పెట్టిస్తాయి. ఇక సహాయ పాత్రలు చేసిన సిమ్రాన్, సూర్య తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా సూర్య పాత్ర, తను చెప్పే డైలాగులు ఆలోచింపజేస్తాయి.


డైరెక్టర్‌గా మాధవన్ చేసిన ఒక నిజాయితీ అయిన ప్రయత్నంగా రాకెట్రీని భావించవచ్చు. కానీ నంబి నారాయణన్ జైలులో ఎన్ని కష్టాలు పడ్డారో మరికొంత స్పష్టంగా చూపించే అవకాశం ఉన్న సమయం మొత్తం అనవసరమైన సీన్స్‌తో నింపేశారని మాధవన్‌పై విమర్శలు వినిపిస్తున్నాయి. నంబి జీవితంలో మిస్ అయిన మరిన్ని విషయాలను కవర్ చేయడం కోసం మరో సినిమా తెరకెక్కిస్తే బాగుంటుందని మరికొందరు అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story