Natyam Review: నాట్యం.. రివ్యూ..!

Natyam Review: క్లాసికల్ డాన్సర్ సంధ్యారాజు ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం 'నాట్యం'.. సంధ్యారాజు స్వీయనిర్మాణంలో నటించిన ఈ చిత్రానికి రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో సినిమా పైన అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో మన సమీక్షలో చూసి తెలుసుకుందాం.
కదేంటంటే..
సంప్రదాయ నృత్యానికి పెట్టింది ఆ గ్రామం...అక్కడ ఉన్నవాళ్ళందరూ క్లాసికల్ డ్యాన్సర్లే.. అందులో సితార( సంధ్యరాజు) ఒకరు.. ఎప్పటికైనా సరే తన గురువు (ఆదిత్య మేనన్) తనకు చెప్పిన కాదంబరి కథను అందరిముందు ప్రదర్శించాలని చిన్నప్పటి నుంచి ఓ కలగా పెట్టుకుంటుంది. కానీ ఆ కథని ఎవరు చెప్పాలనుకున్నా వారి ప్రాణాలకి ముప్పు తప్పదని అందరు భయపడుతుంటారు. దీనికి అమ గురువు గారి భార్య మరణమే పెద్ద ఉదాహరణ.. దీనితో సితార కోరికకు ఆమె గురువు అడ్డుపడుతుంటాడు. ఇంతకీ ఈ కాదంబరి కథ ఏంటి? ఆ కథను సితార ప్రజలందరికీ ఎలా తెలియజేసింది? లేదా? అంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఎలా ఉందంటే:
నాట్యం, సంగీతం ప్రధానంగా సినిమాలు వచ్చి చాలు రోజులైంది.. అప్పట్లో ఇలాంటి సినిమాలను కె.విశ్వనాథ్ తెరకెక్కించేవారు. అయితే రానురాను ఇలాంటి కథలకి ప్రశంసలు తప్ప.. కాసులు రాకపోవడంతో నిర్మాతలు కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు.. కానీ మళ్ళీ ఆ తరహ కథలతో ఇలాంటి పరిస్థితుల్లో నాట్య ప్రధాన కథాంశంతో సినిమాని తీసుకురావాలనుకోవడం అభినందించాల్సిన విషయమనే చెప్పాలి. భావోద్వేగభరితమైన ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించారు దర్శకుడు రేవంత్ .. సినిమా మొదటిభాగంలో గ్రామం, అందులో ఓ దేవాలయం, దానివెనుక ఉన్న కథను చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు దర్శకుడు. కాదంబరి కథను చెప్పాలనుకునే ప్రయత్నంలో ఆదిత్య మేనన్ తన భార్యను పోగొట్టుకోవడంతో అసలు కథ మొదలవుతుంది. కాదంబరి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ ని ఇంట్రెస్టింగ్ గా నడిపించిన దర్శకుడు రెండో భాగాన్ని అంతే ఇంట్రెస్టింగ్ గా నడిపించడంలో కాస్త తడబడ్డాడనే చెప్పాలి. క్లైమాక్స్ మరింత భావోద్వేగభరితంగా ఉంటే సినిమా స్థాయి ఇంకో స్థాయిలో ఉండేది.
ఎవరెలా చేశారంటే:
సితార పాత్రలో సంధ్యా రాజు నటించింది అనడం కన్నా జీవించిందనే చెప్పాలి. స్వయంగా నాట్యకారణి కావడం సినిమాకి చాలా ప్లస్ అయింది. క్లాసికల్ డ్యాన్స్ విషయంలో ఆమె ప్రతిభ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది.రోహిత్ పాత్రలో రోహిత్ బెహల్ ఆకట్టుకున్నాడు. క్లాసికల్ డ్యాన్సర్‌గా కమల్ కామరాజు కనిపించిన విధానం బాగుంది. మిగతానటీనటుల పెర్ఫార్మన్స్ పరవాలేదని అనిపిస్తుంది. సాంకేతికవర్గానికి వస్తే.. శ్రావణ్ భరద్వాజ్ అందించిన పాటలు బాగున్నాయి. ఎడిటర్ తన కత్తెరకి మరింత పని చెబితే బాగుండేది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com