Thangalaan Movie Review : తంగలాన్ మూవీ రివ్యూ
రివ్యూ ః తంగలాన్
తారాగణం ః విక్రమ్, పార్వతి, మాళవిక మోహనన్, పశుపతి, డేనియల్ కాల్టాగిరోన్ తదితరులు
ఎడిటర్ ః సెల్వ ఆర్.కే
సంగీతం ః జివి ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ ః ఏ. కిశోర్ కుమార్
నిర్మాతలు ః కేఈ గ్నాన్ వేల్ రాజా, పా. రంజిత్, జ్యోతి దేశ్ పాండే
దర్శకత్వం ః పా. రంజిత్
ఐడియలాజికల్ మూవీస్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ దర్శకుడు పా. రంజిత్. తన భావజాలాన్ని బాహాటంగానే ప్రదర్శిస్తూ.. సినిమాల్లోనూ దాన్నే ప్రతిబింబిస్తూ వస్తున్నాడు. కబాలి, కాలా సినిమాలతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న రంజిత్ ఇప్పుడు స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన కథగా, కేజీఎఫ్ నేపథ్యంలో రూపొందించిన తంగలాన్ అనే మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మరి ఈ మూవీ ఎలా ఉంది.. ఏ భావజాలాన్ని చూపించింది అనేది చూద్దాం.
కథ ః
స్వాతంత్ర్యానికి పూర్వం మైసూరుకు దగ్గరలో జరిగే కథ ఇది. కోలార్ అనే ఆ ప్రాంతంలోని ఒక ఊరిలో నివసిస్తుంటాడు తంగలాన్(విక్రమ్). భార్య గంగమ్మ (పార్వతి). తంగలాన్ కి తరచూ కలలో తనలానే ఉన్న ఓ వ్యక్తి బంగారం కోసం అన్వేషిస్తూ మరణించాడని.. కొన్ని దృశ్యాలు కనిపిస్తుంటాయి. వాటిని కథలుగా తన పిల్లలకు చెబుతుంటాడు. ఊరిలో ఉన్న చిన్న పొలంలో పంట పండిస్తూ గౌరవంగా బ్రతికేద్దా అనుకుంటాడు. కానీ ఆ ఊరి జమీన్ కు అది నచ్చదు. ఒక రోజు పంట నూర్పిల్లు అయిపోయిన తర్వాత తన మనుషులతో మొత్తం తగలబెట్టేస్తాడు. పైగా తంగలాన్ పన్నులు కట్టలేదు, శిస్తు చెల్లించలేదు, బ్రిటీష్ వారికి బాకీ ఉన్నాడని .. అతనితో పాటు రెండేళ్ల అతని పిల్లాడితో సహా తనకు వెట్టి చాకిరీ చేయమని ఆర్డర్ వేస్తాడు. చేసేదేం లేక తన పొలంలోనే తను బానిసలా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ బ్రిటీష్ వ్యక్తి వచ్చి తన వద్ద బంగారం తొవ్వే పని చేస్తే మంచి జీతం ఇస్తా.. బంగారంలో వాటా ఇస్తా అంటాడు. కుటుంబానికి ఇష్టం లేకపోయిన ఆ ఊరిలో మరికొందరితో కలిసి ఆ బ్రిటీష్ వారి వెంట వెళతారు. అలా వెళ్లిన వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి.. బంగారం దొరికిందా.. అతనికి కలలో కనిపించిన దృశ్యాలకు ఈ వేటకు ఏదైనా సంబంధం ఉందా అనేది మిగతా కథ.
విశ్లేషణ ః
పా. రంజిత్ కథలన్నీ అసమానతలు, అణచివేతల చుట్టూనే తిరుగుతుంటాయి. ఆ అసమానతలను సృష్టించిన వారిని ప్రశ్నిస్తూనో, వేలెత్తి చూపుతూనో కనిపిస్తాయి. ప్రధానంగా భూమి లేని నిరుపేదలకు భూమి విలువను చెప్పే సన్నివేశాలు కనిపిస్తుంటాయి. ఇది కూడా అలాంటి కథే. వేల యేళ్లుగా మూలవాసులుగా ఉంటూ ఆ నేలను సంరక్షించుకునే మనుషులు.. 'ఆశే అన్ని సమస్యలకు కారణం" అని బుద్ధుడి బోధనలను అనుసరిస్తూ.. నేలను దైవంగా కొలుస్తూ కనిపించే ఒక జాతి.. ఆ నేలను రక్షించేందుకు ప్రాణాలైనా అర్పించేందుకు సిద్ధం అవుతుంది. అలా విపరీతమైన బంగారం దొరికే చోటును కూడా ఆ మూలవాసుల జాతి ఎంచుకుంటుంది. ఆ ప్రాంతాన్ని సంరక్షించే బాధ్యతను ఆరతి (మాళవిక మోహనన్), అరణ్య అనే వ్యక్తులకు అప్పజెబుతారు. ఈ క్రమంలో వాళ్లు వేల యేళ్లుగా ఆ నేలను కాపాడుతుంటారు. అందుకోసం ఎన్నో యుద్ధాలు చేస్తుంటారు.అలాంటి ఒక యుద్ధంలో ఓడిపోయిన అరణ్య .. అవతలి వ్యక్తుల మాటలు నమ్మి.. సాధారణ జనంలో కలిసిపోతాడు. అప్పటి నుంచి అతనికి ''ఆశలు" పెరుగుతాయి. తనూ ఎన్ని జన్మలెత్తినా.. ఆ బంగారం గురించిన కలలు వస్తూ దాన్ని సాధించే ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ ఆరతి మాత్రం అన్ని జన్మల్లోనూ తన బాధ్యత నెరవేరుస్తూనే ఉంటుంది. ఆ బంగారాన్ని ఎవరూ ముట్టకుండా కాపాడుతుంది. మరి తంగలాన్ తరంలో కూడా ఆరతి అడ్డుపడుతుంది. చివరికి తంగలాన్ తనే అరణ్య అని తెలుసుకుంటాడు. కానీ అప్పటికే నష్టం జరుగుతుంది. అలా మొదలైన బంగారం వేట కాలక్రమంలో కోలార్ బంగారు గనుల కేంద్రంగా మారుతుంది. అలా అది కేజీఎఫ్ గా టన్నుల కొద్దీ బంగారం ఇస్తోంది.. అనేది ఈ సినిమా.
మూలవాసుల నుంచి మొదలుపెట్టి ఆదివాసుల వరకూ వచ్చాడు పా. రంజిత్. కథ అతని ఐడియాలజీ పరంగా ఆకట్టుకుంటుంది. ద్రవిడ సంస్కృతిని నాశనం చేసేందుకు, బుద్ధుడి ఆనవాళ్లులేకుండా చేసేందుకు ప్రయత్నించిన బ్రాహ్మణులు , రామానుజార్యుని సిద్ధాంతంతో దళితులు బ్రాహ్మణులుగా మారేందుకు ప్రయత్నించినా వాళ్లు ఒప్పుకోని విధానం, కష్టపడేవాడిదే భూమి అనే సూత్రాన్ని దాటి కష్టించేవారిని బానిసత్వంలోకి నెట్టేసిన విధానాల వరకూ క్లుప్తంగా కొన్ని సన్నివేశాల్లో అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశాడు.
కాకపోతే రంజిత్ కథనం క్లిష్టంగా ఉంది. పాత్రధారులు అద్భుతమైన నటన చూపించినా స్క్రీన్ ప్లే పరంగా ఫస్ట్ హాఫ్ లో యుగానికి ఒక్కడును ఫాలో అయ్యాడనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు బావున్నాయి. కానీ సెకండ్ హాఫ్ సహనానికి పరీక్ష పెడుతుంది. ఆరతి పాత్ర తో పాటు డబ్బింగ్ చిరాకు పెడుతుంది. అందువల్ల తంగలాన్ సగటు ప్రేక్షకుడికి బోరింగ్ గానే కనిపిస్తుందని చెప్పాలి.
నటన పరంగా విక్రమ్ ఇలాంటి పాత్రల కోసమే పుట్టాడేమో అనిపించాడు మరోసారి. ఎంతో క్లిష్టమైన పాత్ర ఇది. చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అద్భుతంగా చేశాడు. పార్వతి, పశుపతి నటన అబ్బురపరుస్తుంది. ఇప్పటి వరకూ గ్లామర్ దివాగానే కనిపించిన మాళవిక మోహనన్ ఫెరోషియస్ పాత్రలో అదరగొట్టింది. మిగతా అందరూ పాత్రోచితంగా గొప్పగా నటించారు.
సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం ప్రాణం పోసింది. అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. పాటలూ బావున్నాయి. సినిమాటోగ్రఫీ ఎక్స్ ల్లెంట్. తెలుగు మాటలు బావున్నాయి. డబ్బింగ్ బాలేదు. బాగా ల్యాగ్ అనిపిస్తుంది. దర్శకుడుగా రంజిత్ భావజాలం నచ్చేవారితో పాటు సిద్ధాంతపరమైన విభేదాలున్న వారిని కూడా ఈ రైటింగ్ ఆకట్టుకుంటుంది. చాలా డీప్ గా స్టడీ చేస్తే తప్ప ఇలాంటి కథలు రాసుకోలేరు. అయితే సినిమా ఆరంభంలోనే కొన్ని కల్పిత కథలు, చెప్పుడు మాటల ఆధారంగా రాసుకున్నా అని డిస్ క్లెయిమర్ వేశారు. మొత్తంగా బుద్ధిజంకు ముందు సంఘటితంగా ఉన్న సమాజం.. వర్ణ వ్యవస్థ వచ్చిన తర్వాతే అసమానతలతో మునిగిపోయి మనిషిని మనిషే అంటరాని వాడిగా చూసిన విధానాన్ని తనదైన శైలిలో కేజీఎఫ్ నేపథ్యంలో చెప్పాడు రంజిత్.
ఫైనల్ గా ః తంగలాన్ కొందరికే బంగారం లాంటి సినిమా
రేటింగ్ ః 2.5/5
- బాబురావు. కామళ్ల
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com