Unni Mukundan : మార్కో మూవీ రివ్యూ

రివ్యూ : మార్కో
తారాగణం : ఉన్ని ముకుందన్, సిద్ధిఖీ, యుక్తి తరేజా, కబీర్ సింగ్, అభిమన్యు తదితరులు
ఎడిటింగ్ : షమీర్ మహ్మద్
మ్యూజిక్ : రవి బస్రూర్
సినిమాటోగ్రఫీ : చంద్రు సెల్వరాజ్
నిర్మాత : షరీఫ్ మహ్మద్
దర్శకత్వం : హనీఫ్ అదేని
పరభాషా చిత్రాలు సడెన్ గా మన భాషలోకి డబ్ అయ్యి రిలీజ్ అయ్యాయి అంటే ఆ సినిమాకు అక్కడ గొప్ప రివ్యూస్ వచ్చాయని అర్థం. గతంలో కాంతారకు ఇలాగే జరిగింది. ఇప్పుడు మళయాల మూవీ మార్కో కూడా అంతే. డిసెంబర్ 20న మళయాలంలో విడుదలైన ఈ చిత్రానికి సూపర్ రివ్యూస్ వచ్చాయి. అంతకు మించిన రెవిన్యూ వస్తోంది. అందుకే పది రోజుల్లోనే డబ్ చేసి తెలుగులో ఈ జనవరి 1న విడుదల చేశారు. పూర్తి హింసాత్మక చిత్రం అని రివ్యూస్ లో రాయబడిన ఈ చిత్రం తెలుగులో ఎలా ఉందో చూద్దాం.
కథ :
జార్జ్ (సిద్ధిఖీ) బంగారం వ్యాపారంలో టాప్ ప్లేస్ లో ఉంటాడు. అతను టోనీ, తారిఖ్ లతో పాటు మరికొందరితో సిండికేట్ అయ్యి బిజినెస్ చేస్తుంటాడు. క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉంటుంది. అతనికి ఒక సొంత తమ్ముడు అంధుడైన విక్టర్, చెల్లి ఆన్సీ ఉంటారు. మార్క్ అతనికి పెంపుడు తమ్ముడు లాంటి వాడు. మార్క్ చిన్నప్పటి నుంచి విపరీతమైన ఆవేశం ఉన్నవాడు. తన కుటుంబం జోలికి ఎవరు వచ్చినా వారిని అత్యంత దారుణంగా హతమారుస్తాడు. మార్క్, విక్టర్ కు మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. విక్టర్ తెలివైన వాడు. తన స్నేహితుడు ఓ సారి హత్య చేయబడితే.. కళ్లు లేకపోయినా అతన్ని ఎవరు చంపారు అనేది పోలీస్ లకు సమాచారం చెబుతాడు. దీంతో అతన్నీ చంపేస్తారు. ఈ హత్యలు చేసేది సిండికేట్ సభ్యులే. కానీ ఎవరికీ తెలియదు. అయితే విక్టర్ మరణంపై రగిలిపోయిన మార్కో ఏం చేశాడు. తమ్ముడి మరణానికి ప్రతీకారం తీర్చుకునే క్రమంలో అతను ఏం కోల్పోయాడు అనేది మిగతా వయొలెంట్ స్టోరీ.
ఎలా ఉంది :
కొన్ని కథలను విశ్లేషించడం కంటే చూస్తేనే ఆ ఫీల్ వస్తుంది. ఇదీ అలాంటిదే. విపరీతమైన హింస, రక్తపాతం. తెరంతా నెత్తుటి మరకలు, ధూమపానాల పొగే కనిపిస్తుంది. తమ్ముడిని చంపిన వారి కోసం వెదుకేందుకు సిండికేట్ సభ్యులు కూడా సహకరించడం.. వాళ్లు అతన్నీ, జార్జ్ ని తెలివిగా డైవర్ట్ చేయడం.. ఇంటర్వెల్ ముందు హంతకులు ఎవరో మార్కో కు తెలియడం.. ఇవన్నీ ఇది బ్యాంగ్ లో వచ్చే సీన్. ఈ టైమ్ లో వచ్చే ఫైట్ చూస్తే కాస్త వీక్ మైండ్ ఉన్నవాళ్లైతే కళ్లు తేలేస్తారు. చిన్న పిల్లలు, గర్భిణీలు అస్సలు చూడకూడనంత హింస ఉంది ఈ చిత్రంలో. అసలు సున్నిత మనస్కులు ఈ వైపు చూడకుండా ఉంటే చాలా మంచిది కూడా.
హీరో ఇంటర్డక్షన్ ఫైట్ కుక్కల మధ్య.. ఆ కుక్కలను చంపేసిన తర్వాత ఆ రక్తపు వాసనకు హీరో వాంతి చేసుకుంటాడు. ప్రతి ఫైట్ లో ప్రేక్షకుడి పరిస్థితీ అదే. కాకపోతే ఈ యాక్షన్ సీక్వెన్స్ లన్నీటికీ ఓ ఎమోషనల్ టచ్ ఉంటుంది. అదే సినిమాకు బిగ్గెస్ట్ ఎసెట్ అయింది. హీరో వయొలెన్స్ వెనక ఓ రివెంజ్ ఉంటుంది. అయితే ఆ రివెంజ్ ను అత్యంత క్రూరంగా తీర్చుకోవడంలోనే కొందరికి ఇబ్బంది. కానీ ఇలాంటి బ్లడ్ షెడ్ మూవీస్ అంటే ఇష్టపడేవారికి విపరీతంగా నచ్చుతుంది మార్కో.
మనకు మామూలుగా కమర్షియల్ హీరో అంటే తన కుటుంబాన్ని కాపాడుకోవాలి అని సగటు ప్రేక్షకుడు అనుకుంటాడు. కానీ ఈ చిత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. కానీ కథ పరంగా చూసుకుంటే ఇంకా పుట్టని బిడ్డను కాపాడేందుకు దాదాపు 20 మంది కుటుంబ సభ్యుల మరణానికి కారణం అవుతాడు హీరో. అది ఓ పెద్ద డ్రా బ్యాక్ లా ఉంది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ అయితే.. ఎంత నిగ్రహంగా ఉన్నా.. ఒళ్లంతా జలదరించడం.. వామిటింగ్ సెన్సేషన్ కలగడం ఖాయం. అంత దారుణంగా కంపోజ్ చేశారు యాక్షన్ ఎపిసోడ్స్.
సైరస్ గా కబీర్ సింగ్ చేసే క్రౌర్యం చెప్పడానికి మాటలే కాదు.. రక్తమూ చాలదు. ఆకు రౌడీలు కూడా తుపాకులు వాడుతున్న కాలంలో అత్యంత ధనవంతులైన వీళ్లు కత్తులు పట్టుకుని సెకండ్ హాఫ్ సగం వరకూ ఫైటింగ్ లు చేయడం కేవలం దర్శకుడి యాక్షన్ సీక్వెన్స్ సౌలభ్యం కోసమే. తుపాకీ అయితే కాల్చేస్తే అయిపోతుంది. కత్తి అయితే.. పొడిచి పొడిచి చంపేయొచ్చు. అందుకు దర్శకుడు ఎంచుకున్న మనుషుల శరీర భాగాలు చూసేవారికి కళ్లు తిరిగేలా చేస్తాయి. ఇది విలన్స్ తో పాటు హీరో పాత్రకూ వర్తిస్తుంది.
మొత్తంగా ఓ చిన్న రివెంజ్ డ్రామా చుట్టూ, కాస్త ఎమోషన్ ను అత్యంత హింసను జోడించి వెండితెరపై నెత్తుటేరులు పారించిన సినిమా మార్కో అని చెప్పాలి. కేరళలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న ఈ చిత్రానికి తెలుగులో ఎలాంటి అప్లాజ్ వస్తుందో కానీ.. ఓ కొత్త నేపథ్యం అనే చెప్పాలి. సింపుల్ గా చెబితే.. ఇప్పటి వరకూ ఇండియన్ స్క్రీన్ మీద ఇంత హింసాత్మక సినిమా రాలేదు. ఆ మధ్య బాలీవుడ్ లో ‘కిల్’ అనే సినిమా వచ్చిందన్నారు. బట్ మార్కో ముందు కిల్ దేనికీ నిలబడదు.
నటన పరంగా మార్కో గా ఉన్ని ముకుందన్ అదరగొట్టాడు. యాక్షన్ సీన్స్ లో చాలా చురుకుగా కదిలాడు. అతను తెలుగు వారికీ సుపరిచితమే. అనుష్కతో భాగమతి సినిమాలో నటించాడు. జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ తనయుడుగా రవితేజ ఖిలాడీ, సమంత యశోదలోనూ నటించి మెప్పించాడు. అతనీ పాత్రను బాగా ఓన్ చేసుకున్నాడు. మార్కోను తనలోకి ఆవాహన చేసుకున్నాడు అనేలా ఉంది. తర్వాత ఎక్కువ మార్కులు సీనియర్ యాక్టర్ సిద్ధిఖీకి పడతాయి. అదరగొట్టాడు. యుక్తి తరేజా ఫీమేల్ లీడ్ గా ఉన్నా.. ఇందులో విక్టర్ లవర్ కు తప్ప మిగతా మహిళా పాత్రలకు అస్సలు ప్రాధాన్యం లేదు. చివర్లో చనిపోవడం తప్ప.
టెక్నికల్ గా :
టెక్నికల్ గా ఇదో బ్రిలియంట్ మూవీ. అతని ఆలోచనకు తగ్గట్టుగా కెమెరా, లైటింగ్ నెక్ట్స్ లెవల్ లో కనిపిస్తాయి. అంత హింసకు మనమూ అలవాటు పడేలా కెమెరా పనితనం కనిపిస్తుంది. ఇక కేజీఎఫ్, సలార్ చిత్రాలతో దేశవ్యాప్తంగాపాపులర్ అయ్యాడు. ఈ సినిమాతో అతనిలో మరో కోణం కనిపిస్తుంది. హాలీవుడ్ రేంజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాకు కెమెరా తర్వాత మరో బ్యాక్ బోన్ లా నిలిచాడు. ఎడిటింగ్ సూపర్బ్. తక్కువగా ఉన్నా.. కథకు తగ్గట్టుగా ఇంపాక్ట్ ఫుల్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బావున్నాయి. నిజానికి ఇది చాలా తక్కువ లొకేషన్స్ లోనే పూర్తయ్యే సినిమా. అయినా అలా అనిపించదు. ఇక ఈ సినిమాకు సంబంధించి దర్శకుడి గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి. షాట్ డివిజన్, టేకింగ్, మేకింగ్ పరంగా దర్శకుడు హనీష్ అదేనీ మెస్మరైజ్ చేస్తాడు. దర్శకుడుగా తన ముద్రను స్పష్టంగా చూపించడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. చాలామంది కమర్షియల్ మూవీస్ చేస్తారు. కానీ ఆ కమర్షియల్ యాంగిల్ ను హింసతో ముడిపెట్టి.. కన్విన్సింగ్ గా చెప్పే ప్రయత్నం మెచ్చుకోదగ్గదే అనాలి.
ఫైనల్ గా : వెండితెరపై నెత్తుటేరులు పారించిన మార్కో
రేటింగ్ : 2.5/5
- బాబురావు. కామళ్ల
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com