12 Feb 2021 10:30 AM GMT

Home
 / 
సినిమా / రివ్యూ / Uppena Movie Review :...

Uppena Movie Review : ఉప్పెన మూవీ రివ్యూ!

Uppena Movie Review : ఏ ప్రేమకథకైనా.. కులం, మతం, ఆస్తులు వంటి అడ్డంకులే ఉంటాయి. వీటిని దాటి కొత్తగా ఆ ప్రేమకథకు ఎదురయ్యే సవాళ్లు అరుదు. అందుకే లవ్ స్టోరీ అంటే స్క్రీన్ ప్లే జాగ్రత్తగా ఉండాలి.

Uppena Movie Review : ఉప్పెన మూవీ రివ్యూ!
X

Uppena Movie Review : ఏ సినిమాకైనా రిలీజ్ కు ముందే ఆడియన్స్ లో అంచనాలు పెంచడం ముఖ్యం. ఈ విషయంలో ఓ రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ పెంచిన సినిమా ఉప్పెన. లాస్ట్ ఇయర్ సమ్మర్ లో విడుదల కావాల్సిన ఉప్పెన.. కరోనా కారణంగా ఈ రోజు విడుదలైంది. మ్యూజికల్ గా సూపర్ హిట్ అనిపించుకున్న ఉప్పెన.. సినిమాగానూ ఆ స్థాయిలోనే ఉందా..? ఇన్నాళ్ల నిరీక్షణ తర్వాత వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్దా అలాంటి రిజల్టే తెచ్చుకుంటుందా.. అనేది చూద్దాం..

ఏ ప్రేమకథకైనా.. కులం, మతం, ఆస్తులు వంటి అడ్డంకులే ఉంటాయి. వీటిని దాటి కొత్తగా ఆ ప్రేమకథకు ఎదురయ్యే సవాళ్లు అరుదు. అందుకే లవ్ స్టోరీ అంటే స్క్రీన్ ప్లే జాగ్రత్తగా ఉండాలి. ఇన్నేళ్లలో ఎన్నో ప్రేమకథలు చూసిన ఆడియన్ కు ఈ కథ కొత్తగా అనిపించాలంటే ఆ కథనం కొత్తగా ఉండాలి. ఆ ప్రయత్నం బాగానే చేసినట్టు అనిపించిన సినిమా ఉప్పెన. చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా కృతిశెట్టి హీరోయిన్ గా పరిచయం అయిన ఈ చిత్రంతో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడుగా అరంగేట్రం చేశాడు. ప్రీ ప్రమోషన్స్ లో సినిమాపై అంచనాలు పెంచడంలో మొత్తం టీమ్ సూపర్ సక్సెస్ అయింది. మరి ఈ కథేంటీ..? ఎలా ఉంది..?

ఉప్పాడ ప్రాంతంలోని జాలర్ల కుటంబంలోని కుర్రాడు ఆశీర్వాదం అలియాస్ ఆశీ.. చిన్నతనంలోనే ఓ జాతరలో చాలా పెద్దింటి అమ్మాయి అయిన బేబమ్మను చూసి మనసు పారేసుకుంటాడు. వయసుతో పాటు ఆ ఇష్టం పెరుగుతుంది. అన్ని ప్రేమకథల్లానే ఓ ఫైట్ సీన్ లో అతన్ని చూసి బేబమ్మ కూడా ప్రేమలో పడుతుంది. బేబమ్మ తండ్రి రాయణం.. ఆ ప్రాంతాన్ని శాసించే వ్యాపారవేత్త. కిందికులాలంటే చిన్నచూపు. అలాంటి వ్యక్తి కూతురు ఓ జాలరి కుర్రాడిని ప్రేమిస్తే పర్యవసనాలు ఎలా ఉంటాయి.. తన పరువు కోసం రాయణం ఏం చేశాడు.. అసలు ఈ బేబమ్మ, ఆశీ కలిశారా లేదా అనేది మిగతా కథ.

ప్రేమకథకు నవ్యత ముఖ్యం. అది ఆర్టిస్తుల పరంగా బాగా కనిపిస్తుందీ చిత్రంలో. అయితే కథనం విషయంలో ఇంకాస్త కొత్తగా ప్రయత్నం చేసి ఉండొచ్చు అనిపిస్తుంది. అయినా ఉన్నంతంలో ఈ కొత్తజంట తమ నటనతో కనువిందు చేస్తుంది. ముఖ్యంగా కృతిశెట్టిని అలా చూస్తూ ఉండిపోతారు ఆడియన్స్. తన ఎక్స్ ప్రెషన్స్ తో అందరి మనసులు కొల్లగొడుతుంది. ఇటు వైష్ణవ్ సైతం కళ్లతోనే నటించి ఆశ్చర్యపరుస్తాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తది కాదు. కానీ దాని ఎండింగ్ ఖచ్చితంగా షాకింగ్ గా ఉంది.

ప్రేమకథల్లో కథనం కొత్తగా కనిపించాలి. ఇప్పటి వరకూ ఇలాంటి ప్రేమికులను చూడలేదు అని ఆడియన్ ఫీలవ్వాలి. ఆ ఫీలింగ్ ను దర్శకుడు పూర్తిగా ఇవ్వలేకపోయినా.. సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం చేసే మ్యాజిక్ తో ఆ మైనస్ మరుగున పడుతుంది. ఇక రాయణం పాత్రలో విజయ్ సేతుపతి ఆ పాత్రకు ఓ గంభీరత్వాన్ని తెచ్చాడు. సెకండ్ హాఫ్ లో కొంత సాగదీత అనిపించినా.. క్లైమాక్స్ ట్విస్ట్ తో వాటికి సమాధానం చెప్పాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ అంతా ఒకే ప్రాంతంలో జరిగినా.. రెండో సగంలో నార్త్ ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో సాగుతుంది కథ. ఈ సందర్భంలో కొన్ని సీన్స్ ఇబ్బంది పెట్టినా.. ఓవరాల్ గా క్లైమాక్స్ తో ఆ సీన్స్ కు ఓ మంచి ముగింపు ఇచ్చాడు దర్శకుడు. అయితే ఈ క్లైమాక్స్ ను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే అంశంపైనే భారీ విజయం ఆధారపడి ఉంది.

మెగా ఫ్యామిలీ నుంచి మరో కుర్రాడు వచ్చాడు. రొటీన్ గా కాక.. వైవిధ్యమైన కథ ఎంచుకుని తనలోని నటుడిని తొలి సినిమాలోనే చూపించాడు వైష్ణవ్. కృతిశెట్టి ఖచ్చితంగా పెద్ద హీరోయిన్ అవుతుంది. క్లైమాక్స్ లో విజయ్ సేతుపతి ఎదురుగా తను చూపిన నటనకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. వైష్ణవ్ తండ్రి పాత్రలో సాయిచంద్ ఆకట్టుకుంటాడు. తర్వాత మరీ గుర్తుంచుకోవాల్సిన గొప్ప పాత్రలేం కనిపించవు. మొత్తంగా ఉప్పెన టీమ్ ప్రచారం చేసినట్టుగా ఇది క్లాసిక్ కాదు కానీ.. ఓ మంచి సినిమాగా మాత్రం చెప్పొచ్చు.

Tv5 cinema Desk

Next Story