గ్రామసీమలను జగన్ పూర్తిగా నిర్వీర్యం చేశారు: లోకేష్

గ్రామసీమలను జగన్ పూర్తిగా నిర్వీర్యం చేశారు: లోకేష్
గ్రామ పంచాయతీలకు చెందాల్సిన ఫైనాన్స్ కమిషన్ నిధులు 8వేల 660 కోట్లు దారి మళ్లించారని లోకేష్‌ ఆరోపించారు

జగన్‌ అధికారంలోకి వచ్చాక గ్రామసీమలను పూర్తిగా నిర్వీర్యం చేశారని లోకేష్‌ ఆరోపించారు. యువగళం పాదయాత్రలో భాగంగా జమ్మలమడుగు నియోజకవర్గం సలివెందుల గ్రామస్తులు లోకేష్‌ను కలిసి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. గ్రామ పంచాయతీలకు చెందాల్సిన ఫైనాన్స్ కమిషన్ నిధులు 8వేల 660 కోట్లు దారి మళ్లించారని లోకేష్‌ ఆరోపించారు. జగన్ నిర్వాకం కారణంగా గ్రామాల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా పంచాయతీల వద్ద నిధుల్లేని పరిస్థితి నెలకొందన్నారు. పలువురు సర్పంచ్‌లు పరువు కోసం సొంత డబ్బులు ఖర్చుపెట్టి పనులుచేసి, బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

టీడీపీ హయాంలో ఫైనాన్స్ కమిషన్ నిధులకు అదనంగా రాష్ట్రప్రభుత్వం తరపున నిధులు మంజూరు చేసి.. గ్రామాలను అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 25వేల కిలోమీటర్ల మేర సిమెంటు రోడ్లు, 30లక్షల ఎల్‌ఈడీ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశామని.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తామని చెప్పారు. సలివెందుల గ్రామ కోనేరు, శ్మశాన వాటికలకు ప్రహరీగోడలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story