అదానీ గ్రూప్‌పై సెబి ఫోకస్

అదానీ గ్రూప్‌పై స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి ఫోకస్ పెట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై సెబి దర్యాప్తు చేస్తోంది. తన కంపెనీల షేర్ల ధరల్లో అవకతవకలకు అదానీ సంస్థ పాల్పడిందని అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ ఆరోపించింది. దీనిపై దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని సెబీని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఈ దర్యాప్తు పూర్తి చేసేందుకు గడువును మరో 6 నెలలు పొడిగించాలని సుప్రీంకోర్టును సెబీ కోరింది.
అదానీ గ్రూప్ చాలాకాలంగా అకౌంటింగ్ మోసాలకు పాల్పడుతోందని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. అక్రమ విధానాల్లో కంపెనీల షేర్ల ధరను కృత్రిమంగా పెంచుతోందని పేర్కొంది. జనవరి 24న నివేదికను విడుదల చేస్తూ హిండెన్‌బర్గ్ అదానీ గ్రూప్ అవకతవకలపై పలు ఆరోపణలు చేసింది. ఆ తర్వాత అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా క్షీణించాయి. ఒక దశలో గ్రూప్ మార్కెట్ విలువ సగానికి పైగా తగ్గడంతో పాటు సాధారణ ఇన్వెస్టర్లు కూడా భారీగా నష్టపోయారు. దాంతో అదానీ గ్రూప్ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలు అయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com