కర్ణాటక ఎన్నికలు.. ప్రచారంలో బ్రహ్మానందం..

కర్ణాటక ఎన్నికలు.. ప్రచారంలో బ్రహ్మానందం..
ప్రస్తుతం ప్రధాన పార్టీలన్నీ కర్ణాటకవైపు చూస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు మెజారిటీ సాధిస్తారు అనే విషయంపైనే చర్చలు కొనసాగుతున్నాయి.

ప్రస్తుతం ప్రధాన పార్టీలన్నీ కర్ణాటకవైపు చూస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు మెజారిటీ సాధిస్తారు అనే విషయంపైనే చర్చలు కొనసాగుతున్నాయి. పోటాపోటీగా చేస్తున్న ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. రాజకీయ నాయకులకు, సినీ తారలకు అవినాభావ సంబంధం ఉన్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో సినీతారల ప్రచారం నాయకుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.. ఓట్లు పడినా పడకపోయినా జన సమీకరణ మాత్రం భారీగా జరుగుతుంది..

రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఈ వారాంతంలో తెరపడనుంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేసి ప్రజల విశ్వాసాన్ని చూరగొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో కర్ణాటక ఆరోగ్య మంత్రి కె సుధాకర్ ఎన్నికల ప్రచారానికి తెలుగు హాస్యనటుడు బ్రహ్మానందంను ఎంపిక చేశారు.

గురువారం మంత్రి సుధాకర్‌ నియోజకవర్గం చిక్‌బళ్లాపుర్‌లో బ్రహ్మానందం పర్యటించి సుధాకర్‌కు ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఈ నియోజక వర్గంలో తెలుగు సామాజికవర్గం ప్రధాన ఓటు బ్యాంకు ఉందని, అందుకే టాలీవుడ్ నటుడితో మంచి అనుబంధం ఉన్న మంత్రి ప్రచారం చేయాలని బ్రహ్మానందంను కోరారు. మంత్రి అభ్యర్థనకు కట్టుబడి బ్రహ్మానందం ప్రచారంలో పాల్గొన్నారు. ‘‘సుధాకర్‌కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేసేందుకు హైదరాబాద్‌ నుంచి వచ్చాను. ఆయన నిజాయితీపరుడని, ప్రజలకు ఎంతో సేవ చేశారని ప్రచారంలో పాల్గొన్న ఆయన ప్రజలకు వివరించారు. అలాంటి నాయకులను ప్రోత్సహించాలి, కాబట్టి మీ అమూల్యమైన ఓటును సుధాకర్‌కు వేసి ఆయనను గెలిపించాలి అని బ్రహ్మి అన్నారు.

బ్రహ్మానందం పట్టణంలో ఉన్నాడని తెలుసుకున్న స్థానిక ప్రజలు హాస్య నటుడిని చూసేందుకు ఎగబడ్డారు. బ్రహ్మానందం రాజకీయాల్లోకి వస్తున్నారా.. బీజేపీతో జత కట్టబోతున్నారా అని సినీ పరిశ్రమలోని కొన్ని వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అయితే బ్రహ్మానందం, మంత్రి సుధాకర్ మంచి స్నేహితులని, ప్రచారానికి మంత్రి బ్రహ్మీని అడగ్గా, ఆయన నో చెప్పలేకపోయారని కొందరు అంటున్నారు.

Tags

Next Story