దేశంలో నీతివంతమైన పాలన అందించే ఒకే ఒక్క పార్టీ బీజేపీ : పీఎం మోదీ

దేశంలో నీతివంతమైన పాలన అందించే ఒకే ఒక్క పార్టీ బీజేపీ : పీఎం మోదీ

దేశంలో స్వచ్ఛమైన, సమర్థవంతమైన, నీతివంతమైన పాలన అందించే ఒకే ఒక్క పార్టీ బీజేపీ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.. రాజస్థాన్‌లో పర్యటించిన ప్రధాని.. రాజసమంద్‌ జిల్లా నాథ్‌ద్వారాలో 5,500 కోట్ల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.. ఉదయ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు.. రాజస్థాన్-ఉదయ్‌పూర్‌ రెండు లేన్ల రోడ్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం అబు రోడ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. రాజస్థాన్‌లో అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పించడంపైనే తమ ప్రభుత్వం దృష్టిసారించినట్లు మోదీ చెప్పారు.. 5,500 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు.. దేశంలో మంచి పనులు జరుగుతుంటే కొందరు చూసి ఓర్వలేకపోతున్నారని.. కావాలని వివాదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.. దేశానికి మంచి జరగకూడదనే ప్రతికూల మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు.. వేగవంతమైన అభివృద్ధి జరగాలంటే ప్రాథమిక సౌకర్యాలతోపాటు ఆధునిక మౌలిక సదుపాయాలు కూడా అవసరమని చరిత్ర గుర్తు చేస్తోందన్నారు.. ఈ సందర్భంగా సూడాన్‌ అల్లర్ల అంశాన్ని ప్రధాని ప్రస్తావించారు.. కర్నాటకకు చెందిన హక్కీ పిక్కీ తెగకు చెందిన కొందరు సూడాన్‌లో చిక్కకుపోగా.. వారిని సురక్షితంగా భారత్‌ తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని.. కానీ, కాంగ్రెస్‌ మాత్రం దానిని ఎన్నికలకు ముడిపెట్టి దుమారం సృష్టించిందన్నారు.. ఈ అంశం తమకు ఎన్నికల్లో ప్రయోజనం చేకూర్చుతుందని కాంగ్రెస్‌ భావించిందని.. కానీ, ప్రతి భారతీయుడి భద్రత కోసం మోదీ ఎలాంటి హద్దునైనా దాటగలరన్న విషయాన్ని మర్చిపోయిందని కౌంటర్‌ ఇచ్చారు.

అంతకుముందు ప్రధాని మోదీ శ్రీనాథ్‌జీ మందిరాన్ని దర్శించుకున్నారు.. దర్శనం అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మందిరంలో అర్చకులతో కలిసి కూర్చుని ఆధ్యాత్మిక విషయాలు చర్చించారు. ప్రధాని అయిన తర్వాత మోదీ శ్రీనాథ్‌జీ ఆలయానికి రావడం ఇదే తొలిసారి.. శ్రీనాథ్‌ జీ మందిరానికి వచ్చే సమయంలో మోదీ వాహనంపై ప్రజలు పూలవర్షం కురిపించారు. భారీగా తరలివచ్చిన ప్రజలు మోదీకి ఘన స్వాగతం పలికారు.

Next Story