కర్ణాటక కౌంటింగ్ షురూ

నరాల తెగే ఉత్కంఠకు కాసేపట్లో తెరపడబోతోంది. కన్నడ భవితవ్యమేంటో తేలిపోనుంది. కర్ణాటక ఓటర్లు ఏం తీర్పు చెప్పారనే దానిపై మరికొద్ది గంటల్లో క్లారిటీ రానుంది. ఈవీఎంల్లో నిక్షిప్తమైన పార్టీల భవితవ్యం ఎలా ఉంది. కన్నడ ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టారు? ఏ పార్టీకి ఝలక్ ఇచ్చారు? ఏ నేత తలరాతను ఎలా రాశారు? కర్ణాటక తీర్పు ఎలా ఉండబోతోంది. ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమవుతాయా? కర్ణాటక కింగ్ ఎవరు? హంగ్ వస్తుందా? కింగ్ మేకర్ ఎవరు? అధికార పీఠమెక్కే పార్టీ ఏది? అనేది తేలిపోనుంది.
ఓట్ల లెక్కింపు కోసం కర్నాటక వ్యాప్తంగా 36 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. 10 గంటల కల్లా తొలి ఫలితం రానుంది. మధ్యాహ్నం వరకు ఫలితంపై స్పష్టత రానుంది. ఈనెల 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. 73.19 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. 113 స్థానాలు గెలుచుకున్న పార్టీ అధికారం చేపట్టనుంది.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి కొన్ని ఎగ్జిట్‌పోల్స్ పట్టంకట్టగా.. మరికొన్ని సర్వే సంస్థలు మాత్రం హంగ్ ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేశాయి. దాంతో కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది దేశవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌లు మాత్రం గెలుపు తమదంటే తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అటు ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మొహరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com