కర్ణాటక సీఎం ఎవరూ?

కర్ణాటక సీఎం ఎవరనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. కర్ణాటక బంతి మేడమ్ సోనియా కోర్టులో ఉంది. ఆమె ఎవరివైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తి రేపుతోంది. సీఎం సీటు షేరింగ్‌కు సిద్ధూ ఓకే అంటే డీకే నో అంటున్నారు. అయితే సిద్దరామయ్య వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల నేపధ్యంలో సీనియార్టీకే అధిష్టానం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది.
బెంగళూర్ షాంగ్రిలా హోటల్‌లో జరిగిన సీఎల్పీ భేటీకి అధిష్టానం దూతగా మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌కుమార్ షిండే హాజరయ్యారు. హోటల్ బయట అటు సిద్దరామయ్య మద్దతుదారులు, ఇటు డీకే శివకుమార్ మద్దతుదారులు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈనేపధ్యంలో 135 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని షిండేతో పాటు మరో ఇద్దరు పరిశీలకులు సేకరించారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రణదీప్ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే, ఎమ్మెల్యేల అభిప్రాయాలను హైకమాండ్ దూతలు సేకరించారు. సీఎం అభ్యర్థిని అధిష్టానమే ప్రకటించాలని ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా ఏకవాక్య తీర్మానం చేశారు. దీంతో సీఎం అంశాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాలని అబ్జర్వర్లు నిర్ణయించారు.
మరోవైపు అధిష్టానం దూతలు శివకుమార్, సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు. ఇద్దరు 50-50 షేరింగ్.. చెరో రెండున్నరేళ్లు సీఎంగా ఉండే ప్రతిపాదనను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇద్దరు నేతల దృష్టికి తీసుకువచ్చారు. అయితే, చెరో రెండున్నరేళ్ల ప్రతిపాదనను డీకే శివకుమార్ తిరస్కరించగా.. సిద్ధరామయ్య తాను అనుకూలమని ప్రకటించారు. ఇవాళ సిద్దరామయ్య, డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లనుండటంతో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com