తెలుగు రాష్ట్రాల్లో మెండుగా ఎండలు

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఉదయం నుంచి భానుడి భగభగలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. ఈ రేంజ్ లో ఉష్ణోగ్రతలు పెరగడంతో జనం భరించలేక పోతున్నారు. మండుటెండలతో అల్లాడిపోతుంటే... వాతావరణశాఖ మరో బాంబు పేల్చింది. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని.. జనం అప్రమత్తంగా గా ఉండాలని హెచ్చరించింది.
హైదరాబాద్‌లో ఎండలు మండిపోతున్నాయి. ఖైరతాబాద్ 41 , సికింద్రాబాద్ 40, మెహిదీపట్నం 40, ఉప్పల్ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. ఇక మంచిర్యాల, జగిత్యాల, కొమురంభీం, నల్గొండ.. నిజామాబాద్‌లో ఉష్ణోగ్రతలు నిన్న 45 డిగ్రీలు దాటాయి. ఉత్తర తెలంగాణలోని 14 జిల్లాల్లో అత్యధిక ఎండలు ఉంటాయని ఐఎండీ అధికారులు తెలిపారు. భద్రాద్రి, కరీంనగర్, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కొమురం భీం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలో వేడి గాలులు ఎక్కువగా వీస్తాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.
ఏపీలోనూ భానుడి భగభగలతో జనం అవస్థలు పడుతున్నారు. తీవ్రమైన ఎండలు, వడగాడ్పులకు మధ్య కోస్తాలో పలు ప్రాంతాలు ఉడికిపోతున్నాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో వడగాడ్పులు వీచాయి. బంగాళాఖాతంలో ఉన్న తుఫాన్ దిశగా పడమర దిశ నుంచి వీచిన గాలుల్లో తేమ లేకపోవడంతో ఎండ మండిపోయింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. అనేకచోట్ల 40 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జంఘమహేశ్వరపురంలో 45, జగ్గయ్యపేటలో 44.8, ద్వారకా తిరుమలలో 44.7, కామవరపుకోటలో 44.5, నందిగామలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రానున్న రెండు, మూడు రోజుల్లో ఎండలు పెరిగి వడగాడ్పులు వీయనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోఇవాళ 127 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 173 మండలాల్లో వడగాడ్పులు, రేపు 92 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 190 మండలాల్లో గాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రానున్న రెండు రోజుల్లో అక్కడక్కడా 45 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. మోచా తుఫాను ఇటు వచ్చి ఉంటే.. తెలుగు రాష్ట్రాలకు ఎండల నుంచి ఉపశమనం కలిగేది. కానీ అది బంగ్లాదేశ్ వైపు వెళ్లి తీరం దాటేసింది. అందువల్ల తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. తెలంగాణలో ఏకంగా రెడ్ అలర్ట్ ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఈ నెల 18 వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఐఎండీ అధికారులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com