కర్నాటక సీఎం అభ్యర్థి ఎంపికపై వీడని సస్పెన్స్

కర్నాటక సీఎం అభ్యర్థి ఎంపికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఢిల్లీలో తమ ప్రయత్నాలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. సీఎం పీఠం కోసం ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ఎవరికి పట్టం కట్టాలనే అంశంపై కాంగ్రెస్ హైకమాండ్ మల్లగుల్లాలు పడుతోంది. నిన్న ఢిల్లీలోని ఖర్గే నివాసానికి వెళ్లిన డీకే శివకుమార్.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడితో పలు అంశాలపై చర్చించారు. అయితే డీకే శివకుమార్ భేటీ అనంతరం సిద్ధరామయ్య కూడా ఖర్గేతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. డీకేఎస్, సిద్ధరామయ్యతో చర్చించిన మల్లికార్జున ఖర్గే ఇప్పుడు సోనియా, రాహుల్ గాంధీతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో కన్నడ ముఖ్యమంత్రి ఎవరనే నిర్ణయం ఇవాళ వెలువడే అవకాశం ఉంది. అయితే సీఎం పేరును బెంగళూరులోనే ప్రకటించే అవకాశం ఉంది.
ఇప్పటికే ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించిన పార్టీ పరిశీలకులు హైకమాండ్‌కు ఆ నివేదికను అందించారు. అయితే తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా సీఎం ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ చర్చోపచర్చలు జరుపుతోంది. ఇదిలా ఉంటే కన్నడ సీఎంగా సీనియర్ నేత సిద్ధరామయ్యకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌ను గౌరవప్రదంగా ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపైనే ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. కీలకమైన శాఖలతో డిప్యూటీ సీఎం హోదా కట్టబట్టే అంశంపై డీకేకు సర్దిచెప్పేందుకు అధిష్టానం ప్రయత్నిస్తున్నట్లు టాక్ వినడుతోంది. మరోవైపు హైకమాండ్ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని శివకుమార్ ఇప్పటికే స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com