నైరుతి రుతుపవనాల కోసం..రైతన్న ఎదురుచూపు

రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ అంచనాలు తప్పాయి. 4వ తేదీ వరకు కేరళ తీరాన్ని తాకుతాయని ప్రకటించిన ఐఎండీ.. మాన్‌సూన్ ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితిలో ఉంది. రుతుపవనాల ఆలస్యంతో రైతుల్లో ఆందోళన పెరిగింది. సమయానికే రతుపవనాలు వస్తున్నాయన్న సంతోషంలో.. ఏరువాకకు సిద్ధమైన రైతన్న ఆశలపై తుఫాన్ దెబ్బ కొట్టింది. కేరళలో నైరుతి రుతుపవనాలప్రవేశానికి వాతావరణం అనుకూలించడం లేదు. తుఫాన్ దెబ్బతో రుతపవనాల రాకకు బ్రేక్ పడింది.
ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్‌గా మారింది. ఈ తుఫాన్‌కు బంగ్లాదేశ్ సూచించిన 'బిపర్ణాయ్' అనే పేరు పెట్టారు. ఇది మరో తొమ్మిది రోజులు అరేబియాలో ఉత్తరంగా కొనసాగే సూచనలు ఉన్నాయి. అతి తీవ్ర తుఫాన్‌గా మారుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది.
ఈ తుఫాన్ రుతుపవనాలకు అడ్డంకిగా మారుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దక్షిణ అరేబియా సముద్రంలో పడమర గాలులు బలపడినప్పటికీ... కేరళ, లక్షద్వీప్, కోస్తా కర్ణాటకల్లో ఇంకా వర్షాలు ఊపందుకోలేదు. తుఫాన్ ప్రభావం తగ్గాకే రుతుపవనాల్లో పురోగతి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరో మూడు రోజుల్లో రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉన్నా..అవి బలహీనంగానే ఉంటాయని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా.దీంతో.. ప్రజలకు మరికొన్ని రోజులు వేసవి వేడి సెగలు తప్పేలా లేవు. రైతన్నకు ఎదురుచూపు కూడా తప్పని పరిస్థితి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com