ఫ్లోరెన్స్ నైటేంగెల్ అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారతదేశంలో నర్సింగ్ రంగంలో విశేష సేవలందించిన నిపుణులకు గురువారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో 2022, 2023 సంవత్సరాలకు సంబంధించిన ప్రతిష్టాత్మక జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను ప్రదానం చేశారు. రెండు సంవత్సరాలకి కలిపి మొత్తం 30 మందికి రాష్ట్రపతి ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ కూడా పాల్గొన్నారు.
మొత్తం అవార్డు గ్రహీతలలో, 10 మంది సహాయక నర్సులు, మంత్రసానులు (ANM), నలుగురు మహిళా ఆరోగ్య సందర్శకులు, 16 మంది నర్సులు ఉన్నారు.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశంలోని నర్సులు, నర్సింగ్ నిపుణులు సమాజానికి అందిస్తున్న, అందించిన వారి విశేష సేవలకు గుర్తింపునివ్వడానికి 1973లో ఈ అవార్డులను ప్రారంభించింది.
తెలంగాణ రాష్ట్రం నుంచి తేజావత్ సుశీల 2022 సంవత్సరానికి గాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
ఇంగ్లాండ్‌కి చెందిన ఫ్లోరెన్స్ నైటేంగేల్ గణాంకవేత్త, సంఘసంస్కర్త, ఆధునిక నర్సింగ్ రంగానికి ఆధ్యురాలు. ఆమెకి "లేడీ విత్ ద ల్యాంప్" అని కూడా బిరుదు. క్రిమియా యుద్ధ సమయంలో బ్రిటన్, దాని మిత్ర దేశాల సైనికులకు తాను నర్సుల మేనేజర్‌గా, శిక్షకురాలిగా ఉండి గాయపడిన సైనికులకు చికిత్సలు నిర్వహించింది. ఆ సమయంలో వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ద్వారా సైనికుల మరణాలను తగ్గించగలిగారు. తాను చేసిన కృషి వల్లే నర్సింగ్ వృత్తిని గౌరవప్రదమైన వృత్తిగా గుర్తిస్తున్నారు. 90 యేళ్ల వయసులో 1910 లో కన్నుమూశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com