మణిపూర్ హింసాకాండలో 60 మంది మృతి

మణిపూర్ హింసాకాండలో ఇప్పటివరకు 60 మంది మృతి చెందారని ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ తెలిపారు. మొత్తం 231 మంది గాయపడ్డారని, 1700 ఇళ్లు దగ్ధమైయ్యాయని అన్నారు. 20 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని.. ఇంకా 10 వేల మందిని తరలించాల్సి ఉందని చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో శాంతి పునరుద్ధరణకు సహకరించాలని సీఎం బీరేన్ సింగ్ ప్రజలను కోరారు.
మరోవైపు మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో కొన్ని గంటలపాటు కర్ఫ్యూను సడలించారు. దీంతో కాస్త సాధారణ పరిస్థితులు కనిపించాయి. అటు మణిపూర్‌లో చిక్కుకుపోయిన విద్యార్థులు, ప్రజలను వారి స్వస్థలాలకు తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో రెండు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు స్వస్థలాలకు చేరుకున్నారు. తెలంగాణకు చెందిన విద్యార్థులను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మంత్రి మల్లారెడ్డి వెళ్లి స్వాగతం పలికారు. అటు మణిపూర్‌లో ప్రాణ, ఆస్తి నష్టంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. స్థానికంగా ప్రార్థనా స్థలాలను పరిరక్షించడంతో పాటు బాధితులకు సహాయ, పునరావాస చర్యలను వేగవంతం చేయాలని కేంద్రం, మణిపూర్ ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను మే 17కి వాయిదా వేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com