బిల్కిస్ బానో కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు

బిల్కిస్ బానో కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
గుజరాత్ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది సుప్రీం ధర్మాసనం.బాధితురాలు బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ

బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.గుజరాత్ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది సుప్రీం ధర్మాసనం. బాధితురాలు బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం 11 మంది దోషులను శిక్షా కాలం పూర్తి కాకుండానే విడుదల చేయడానికి కారణాలేంటని గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. శిక్ష తగ్గించేప్పుడు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని, నేర తీవ్రతను పరిగణనలోకి తీసుకోవాలని వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం ఏకీభవించిందనే ఏకైక కారణం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం తన వివేకాన్ని వర్తింపజేయవలసిన అవసరం లేదని భావించకూడదని తెలిపింది.ఈ పిటిషన్లపై తదుపరి విచారణ మే 2న జరుగుతుందని తెలిపింది.

ఇక 2002లో జరిగిన గోద్రా అల్లర్లలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేసి, ఆమె కుటుంబంలోని ఏడుగురు సభ్యులను హత్య చేశారు. అప్పటికి ఆమె వయసు 21 సంవత్సరాలు, గర్భిణి కూడా. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషులకు గుజరాత్ ప్రభుత్వం శిక్షా కాలాన్ని తగ్గించింది. దీంతో గత ఏడాది ఆగస్టు 15న గోద్రా ఉప కారాగారం నుంచి వారు విడుదలయ్యారు. అప్పటికి వారు 15 సంవత్సరాలకుపైగా జైలు జీవితం గడిపారు. వీరు విడుదల కావడంతో బిల్కిస్ బానో గత ఏడాది నవంబరు 30న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై సామూహిక అత్యాచారం చేసిన 11 మంది జీవిత ఖైదు అనుభవించవలసి ఉండగా, ముందుగానే జైలు నుంచి విడుదల చేయడాన్ని ప్రశ్నించారు. దోషులు విడుదల కావడం వల్ల సమాజం ఆత్మ వణికిందని చెప్పారు.

Tags

Next Story