ఛత్తీస్‌గఢ్‌లో భారీ లిక్కర్ స్కామ్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ లిక్కర్ స్కామ్ బయటపడింది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ పొలిటికల్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంటే. ఛత్తీస్‌గఢ్‌లోనూ భారీ లిక్కర్ స్కామ్‌ను ఈడీ వెలుగులోకి తెచ్చింది. ఈ కుంభకోణం సూత్రధారి సీనియర్ ఐఏఎస్ అధికారి అనిల్ టుటేజా అయితే ప్రధాన పాత్రధారి అన్వర్ ధేబార్ గా గుర్తించారు ఈడీ అధికారులు. ఈ ఇద్దరిని ఈడీ అరెస్టు చేసింది. ఛత్తీస్‌గఢ్ లో లిక్కర్ పాలసీ ప్రకారం డిస్టిలరీలు, హోల్‌సేల్, రిటైల్ అమ్మకాలన్నీ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరుగుతాయి. అయితే..సీనియర్ ఐఏఎస్ అధికారి అనిల్, ప్రధాన పాత్రధారిగా రాయ్‌పూర్ కాంగ్రెస్ మేయర్ ఐజాజ్ ధేబర్ సోదరుడు అన్వర్ ధేబార్ 2019-22 మధ్యకాలంలో ఓ నెట్‌వర్క్ ఏర్పాటు చేసి దాదాపు 2 వేల కోట్ల మేర అక్రమార్జనకు పాల్పడ్డాడని ఈడీ తేల్చింది. ఈ స్కామ్‌లో పలువురు రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు. ఎక్సైజ్ అధికారులకు వాటాలున్నట్లు ఈడీ తన రిమాండ్ రిపోర్ట్ లో తెలిపింది.
ఇక గత మార్చినెలలోనే కుంభకోణంపై ఆరాతీసిన ఈడీ ఏకకాలంలో ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, ఢిల్లీల్లో 35 చోట్ల సోదాలు నిర్వహించింది. ఆదే సమయంలో అన్వర్, తన ఇంట్లో సోదాలు జరుగుతుండగానే ఈడీ కళ్లుగప్పి సీక్రెట్ డోర్ ద్వారా పారిపోయాడు. అప్పటి నుంచి అన్వర్ బినామీ పేర్లతో తీసుకున్న సిమ్‌కార్డులు, ఇంటర్నెట్ డాంగుల్స్‌ను వినియోగిస్తూ తప్పించుకు తిరిగాడు. అన్వర్ తన స్నేహితుడి హోటల్‌లో ఉన్నట్లు సమాచారం అందుకున్న ఈడీ ఆయన్ను అరెస్టు చేసింది. ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన ఛత్తీస్‌గఢ్ సీనియర్ ఐఏఎస్ అధికారి అనిల్ టుటేజా ప్రస్తుతం పరిశ్రమల శాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు. 2003 బ్యాచ్‌కు చెందిన అనిల్ టుటేజాపై గతంలోనూ కేసులున్నాయి.
మరోవైపు మూడు రకాలుగా అక్రమాలు జరిగినట్లు ఈడీ తేల్చింది. మొదటగా CSMCL సేకరించే మద్యానికి సంబంధించి ప్రతి కేస్‌పై 75 నుంచి 150 రూపాయల దాక కమీషన్ తీసుకున్నారు.ఇక రెండో కేటగిరీలో ప్రైవేటు మద్యాన్ని ప్రభుత్వం ద్వారా అమ్మేలా చేశారు. ఇందుకోసం CSMCL,ఎక్సైజ్ డిపార్ట్మెంట్, మద్యం సీసాల తయారీ యూనిట్లు, హోలోగ్రామ్ తయారీ సంస్థ, రిటైల్ ఔట్‌లెట్లలో పనిచేసేందుకు ఉద్యోగులను సరఫరా చేసే మ్యాన్‌పవర్ ఏజెన్సీలు..ఇలా అన్ని చోట్లా తన నెట్‌వర్క్‌ను పెంచుకున్నారు.ఇక మూడో కేటగిరీలో.. విదేశీ మద్యాన్ని విక్రయించే ఎఫ్‌ఎల్-10ఏ లైసెన్స్ పొందిన వారి నుంచి ఒక్కొ బాటిల్ పైన కమీషన్లు తీసుకునేవారు. ఇలా మూడు రకాలుగా జరిపిన అక్రమార్జన విలువ 2 వేల కోట్లు ఉంటుందని ఈడీ తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com