Heavy Rains : కుండపోత వర్షంతో అతలాకుతలమైన తమిళనాడు

Heavy Rains :  కుండపోత వర్షంతో అతలాకుతలమైన తమిళనాడు
47 ఏళ్లలో తొలిసారి

తమిళనాడు దక్షిణ జిల్లాల్లో కురిసిన వర్షాల వల్ల పోటెత్తిన వరదలకు ప్రజలు అల్లాడి పోతున్నారు. తూత్తుకుడి నగరం దాదాపు నీట మునిగింది. జాతీయ రహదారిపైనా..నీరు చేరింది. నీట మునిగిన ఇళ్ల నుంచి వంట సామాన్లు మాత్రమే తీసుకుని ప్రజలు రోడ్లపైకి చేరుకుని సాయం కోసం ఎదురుచూస్తున్నారు. తిరునెల్వేలిలో అనేక ప్రాంతాలను వరద చుట్టుముట్టింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను బోట్ల సాయంతో పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. విపత్తు నిర్వహణ దళం, పోలీసులు సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. తూత్తుకుడి జిల్లాలో అనేక ప్రాంతాల్లో టెలిఫోన్ నెట్‌వర్క్‌కు అంతరాయం కలిగిందన్న అధికారులు సమాచారం కోసం పోలీస్ వైర్‌లెస్‌ సెట్ల సాయం తీసుకుంటున్నట్లు చెప్పారు. భారీ వర్షాల కారణంగా ఆ రెండు జిల్లాలకు చెందిన 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. గోడ కూలి కొందరు, విద్యుదాఘాతంతో కొందరు మరణించినట్లు వెల్లడించారు.

రోడ్లు, వంతెనలు తెగిపోవడంతో అనేక ప్రాంతాలకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అక్కడకు వెళ్లాలంటే కేవలం బోట్లతో మాత్రమే సాధ్యపడుతోంది. కొన్ని చోట్ల నీటి ఉద్ధృతి కారణంగా బోట్లను పంపలేని పరిస్థితి ఉందని అధికారులు తెలిపారు. అలాంటి చోట్ల ప్రజలకు హెలికాఫ్టర్ల ద్వారా ఆహారం జారవిడుస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో NDRF,SDRF,రక్షణ బలగాలు సహాయచర్యల్లో పాల్గొంటున్నట్లు తమిళనాడు సర్కార్‌ ప్రకటించింది. సహాయ చర్యల కోసం..మీడియం లిఫ్ట్, అడ్వాన్సుడ్‌ హెలికాఫ్టర్లతో భారతీయ వాయుసేన సహాయ చర్యలు చేపడుతోంది. మంగళవారం ఉదయం వరదల్లో చిక్కుకుపోయిన.. గర్భిణి, ఏడాదిన్నర చిన్నారి సహా నలుగురిని వాయుసేన కాపాడింది.


వరద బాధితులను రక్షించేందుకు, సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 279 బోట్లతో సహాయ చర్యలు చురుగ్గా కొనసాగుతున్నాయి. మరో 50 బోట్లను రామనాథపురం జిల్లా నుంచి తీసుకొస్తున్నారు. 10వేలమందికిపైగా వరద బాధితుల్ని కాపాడినట్లు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనా చెప్పారు. వారందరినీ 100పునరావాస శిబిరాలకు తరలించినట్లు తెలిపారు. బాధితులకు ఆహారం, పాలు, తాగునీరు, ఇతర మౌలిక వసతులు కల్పించినట్లు మీనా వెల్లడించారు. తెగిపోయిన రోడ్లు, రహదారులు పునరుద్ధరించేందుకు జాతీయ రహదారుల సంస్థ యుద్ధ ప్రాతిపదికన.. పనులు చేస్తోందని వివరించారు.

తిరునెల్వేలి, తూత్తుకుడిల్లో ఏడాది వర్షపాతం ఒక్కరోజులోనే నమోదైందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తెలిపారు. గత 47 నుంచి 60ఏళ్లలో ఎప్పుడూ లేనంత వర్ష పాతం నమోదైందని ఆయన చెప్పారు. ఒక్క కాయల్పట్టినంలోనే 94 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అన్నారు. తుపానుతో దెబ్బతిన్న ప్రాంతాలను ఆదుకునేందుకు అదనపు నిధుల కింద 7 వేల33 కోట్లు, శాశ్వత సాయంగా 12 వేల 59 కోట్లు కేంద్రాన్ని కోరినట్లు స్టాలిన్‌ వెల్లడించారు. కేంద్ర సాయంతో సంబంధం లేకుండా. 4 వరద ప్రభావిత జిల్లాల్లో కుటుంబానికి 6 వేలు అందిస్తున్నట్లు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story