PM Modi: మోదీకి పొలం రాసిస్తానని ప్రకటించిన వందేళ్ల బామ్మ

PM Modi: మోదీకి పొలం రాసిస్తానని ప్రకటించిన వందేళ్ల బామ్మ
దేశానికి ఎంతో సేవ చేస్తున్నారాంటూ ప్రశంసలు

ప్రధానమంత్రి మోదీ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. మన దేశంలోనే కాదు మొన్న వెళ్లిన అమెరికాలోనూ తర్వాత వెళ్లిన ఈజిప్ట్ లో కూడా మోడీకి అభిమానులు ఘనంగా స్వాగతం పలికిన విషయం తెలిసిందే. అభివృద్ధి సంక్షేమాలకు పెద్దపీట వేసి దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు అంటూ జనం ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. యువకులు నుంచి వృద్ధులు వరకూ అందరూ మోదీని ఎంతో ఇష్టపడతారు అని ఆ పార్టీ నేతలు సైతం పదేపదే చెప్తూ ఉంటారు. తాజాగా, ఓ వృద్ధురాలు ప్రధానిని తన కొడుకుగా భావిస్తున్నానని చెప్పడమే కాదు.. తన పేరున ఉన్న 25 ఎకరాల పొలం రాసి ఇచ్చేస్తానని ప్రకటించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ జిల్లా హరిపుర గ్రామానికి చెందిన మంగీబాయి తన్వర్‌ అనే ఓ వందేళ్ల వృద్ధురాలికి 14 మంది సంతానం. అయితే మోదీని తన 15వ కుమారుడిలా భావిస్తానని ఆమె చెప్పిన వీడియో ఒకటి ఇప్పుడు వార్తల్లో నిలిచింది. మోదీ దేశానికి ఎంతో సేవ చేస్తున్నారని, అలాగే తనకూ ఎన్నో పథకాలు అందిస్తున్నారంటూ ప్రశంసలు కురిపించింది. మోదీకి మాత్రమే తాను ఓటు వేస్తానని వెల్లడించింది. అంతే కాదు తన పేరున ఉన్న 25 ఎకరాల భూమిని ప్రధానికి రాసిస్తానని ప్రకటించింది.

తనతో పాటు దేశంలోని ఎందరో వృద్ధుల అవసరాలను మోదీ తీరుస్తున్నారని ఆ బామ్మ పొగడ్తల్లో ముంచెత్తింది. అందుకే మోదీని తన 15వ కొడుకుగా భావిస్తూ.. తనకు ఉన్న 25 ఎకరాల ఆస్తిని ఆయన పేరున రాసి ఇవ్వనున్నట్లు మంగీబాయి వెల్లడించింది. అయితే ఈ వీడియోలో మంగీబాయి చుట్టూ ఉన్న కొందరు నువ్వు మోదీని గుర్తించగలవా అని ప్రధాని ఫోటో చూపించగా, ‘అవును.. ఇతడే మోదీ.. నాకు తెలుసు.. టీవీల్లో చూశాను’ అని సమాధానం ఇచ్చింది. మోదీ నాకు ఇల్లు ఇచ్చి, ఉచితంగా వైద్యం అందజేస్తున్నారు, వితంతు పింఛను ఇచ్చి ఆర్థికంగా ఆదుకుంటున్నారు, ఆహారం అందిస్తున్నారు. ఆయన వల్లే నేను తీర్థయాత్రలకు కూడా వెళ్లగలిగాను అంటూ ఆనందం వ్యక్తం చేసింది.. అందుకే ఆయనను నా కుమారుడుగా భావిస్తాను, అవకాశం ఉంటే ప్రధానిని స్వయంగా కలవాలని ఉంది అని కోరింది. ప్రధాని మంగళవారం మధ్యప్రదేశ్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ వీడియో వైరల్ కావడం గమనార్హం. ఈ ఏడాది చివరిలో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా మోదీ ఈరోజు ప్రచార కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రచారం ప్రారంభించనున్నారు. భోపాల్‌ రోడ్‌షోలో పాల్గొని, పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారు.

Tags

Read MoreRead Less
Next Story