Maharashtra : మహారాష్ట్రలో వర్షాలు.. 11 మంది మృతి

Maharashtra :  మహారాష్ట్రలో  వర్షాలు.. 11 మంది మృతి
X
సురక్షిత ప్రాంతాలకు 41 వేల మంది తరలింపు

మహారాష్ట్రను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వానలకు రాష్ట్రం అతలాకుతలమవుతోంది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 11 మంది ప్రాణాలు కోల్పోగా, 41 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ముంబై, థాణె, మరఠ్వాడా ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించింది.

ఈ నెల‌ 27 నుంచి 29 వరకు జరిగిన వేర్వేరు ఘటనల్లో ఈ మరణాలు సంభవించాయి. శుక్రవారం ఒక్కరోజే నాందేడ్‌తో పాటు పలు ప్రాంతాల్లో ముగ్గురు వ్యక్తులు వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. అంతకుముందు రోజు నాశిక్‌, యావత్మాల్‌, జాల్నా జిల్లాల్లో ఇళ్లు కూలడం, వరదల కారణంగా ఐదుగురు మరణించారు. ఈ నెల‌ 27న నాందేడ్, వార్ధాలలో మరో ముగ్గురు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.

సోలాపూర్‌, జాల్నా, ఛత్రపతి శంభాజీనగర్‌, ధారాశివ్‌ జిల్లాల్లో వరదల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల నుంచి సుమారు 41 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించి, తాత్కాలిక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

గత శనివారం ముంబై మహానగరంలో కురిసిన భారీ వర్షానికి రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. రాష్ట్రంలోనే అత్యధికంగా పాల్ఘర్‌ జిల్లాలోని తలసారిలో 208 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా, ఛత్రపతి శంభాజీ నగర్‌లో 120.8 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Tags

Next Story