Chhattisgarh: ఎన్‌కౌంటర్ లో 11 మంది నక్సల్స్ హతం

ఛత్తీస్‌గఢ్ అడవుల్లో బస్తర్ రీజియన్ బీజాపూర్ జిల్లాలో మంగళవారం భద్రతా బలగాల ఎన్‌కౌంటర్‌లో 11 మంది నక్సల్స్ మృతిచెందారు. వీరిలో ఒక మహిళ ఉన్నారు. పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బీజాపూర్ జిల్లా అడవుల్లో మావోయిస్టులు ప్లీనరీ నిర్వహించనున్నట్టు సమాచారం అందింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా రిజర్వు గార్డ్స్(డీఆర్‌జీ), సీఆర్పీఎఫ్, కోబ్రా, బస్తర్ ఫైటర్స్, ఛత్తీస్‌గఢ్ ఆర్మ్‌డ్ ఫోర్స్(సీఏఎఫ్) భద్రతా బలగాలు గంగలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని అడవులను చుట్టుముట్టాయి.
ఈ క్రమంలో మంగళవారం ఉదయం కోర్‌చోలీ సమీపంలోని లెంద్రా అడవుల్లో తారసపడిన మావోయిస్టు దళాలు జవాన్లపై కాల్పులకు దిగాయి. వెంటనే జవాన్లు అప్రమత్తమై ఎదురు కాల్పులు జరిపారు. రెండు గ్రూపుల మధ్య దాదాపు రెండు గంటల పాటు తుపాకుల మోత మోగింది. ఎన్‌కౌంటర్ అనంతరం భద్రతా బలగాలు ఘటనాస్థలిలో మొత్తం 11 మంది నక్సలైట్ల మృతదేహాలతో పాటు భారీయెత్తున ఆయుధ, వస్తు సామగ్రిని స్వాధీనం చేసుకొన్నారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నదని ఐజీ పీ సుందర్‌రాజ్ తెలిపారు. తాజా ఎన్‌కౌంటర్‌లో డీవీసీ మెంబర్ క్రాంతి ముచతోపాటు మరో కీలక సభ్యుడు పాపారావు మృతిచెందినట్లు ప్రాథమిక సమాచారం అందింది. మావోయిస్టులు భారీ సంఖ్యలోనే గాయపడ్డట్లు భద్రతా దళాలు అంచనా వేస్తున్నాయి. కాగా, గత నెల 27న ఇదే బీజాపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు నక్సలైట్లు మరణించిన విషయం తెలిసిందే. తాజా ఘటనతో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ రీజియన్‌లో వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మొత్తం 43 మంది నక్సలైట్లు మృతిచెందారు.
సరిహద్దు జిల్లాలో మరొకటి
మధ్యప్రదేశ్‌లోని ఛత్తీస్‌గఢ్ సరిహద్దు జిల్లా బాలాఘాట్‌లో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళతో సహా ఇద్దరు నక్సలైట్లు మరణించారు. పలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వీరిద్దరిపై రూ.43 లక్షల నగదు రివార్డు కూడా ఉన్నది. కేర్జారి అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని అధికారులు తెలిపారు. బాల్‌ఘాట్‌లో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో డాబ్రీ-పిత్‌కోన సమీపంలోని కేర్‌జారీ అడవుల్లో మావోయిస్టులు తారసపడ్డారు. ఎన్‌కౌంటర్‌లో మృతిచెంది వారిలో ఒకరు రూ.29 లక్షల రివార్డు ఉన్న డీవీసీఎం సజంతి అలియాస్ క్రాంతి కాగా.. మరొకరు రూ.14 లక్షల రివార్డు ఉన్న ఏరియా కమిటీ సభ్యుడు రఘు అలియాస్ శేషసిన్హాగా పోలీసులు గుర్తించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com