Manipur Encounter : మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్..

కుకీ, మెయితీ తెగల మధ్య చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో మణిపూర్ రాష్ట్రం గత ఏడాదిన్నర కాలంగా అట్టుడికిపోతోంది. కేంద్ర, రాష్ట్ర బలగాలను మోహరించినా పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. దీంతో ఆ రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఓ చోట కాల్పులు, హింస చెలరేగుతూనే ఉంది. తాజాగా భద్రతా బలగాలకు, మిలిటెంట్లకు జరిగిన కాల్పుల్లో 11 మంది మిలిటెంట్లు మృత్యువాత పడ్డారు. ఈ మిలిటెంట్లు కుకీ వర్గానికి చెందిన సాయుధులు అని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో మరోసారి మణిపూర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కాల్పుల ఘటనలో కొందరు సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా గాయపడినట్లు తెలుస్తోంది.
మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లా బోరోబెక్రాలో సోమవారం ఈ హింస చోటు చేసుకుంది. బోరోబెక్రా పోలీస్ స్టేషన్‌పై సోమవారం మధ్యాహ్న సమయంలో.. కొందరు తుపాకులు కలిగి ఉన్న మిలిటెంట్లు ఒక్కసారిగా దాడులకు దిగారు. ఆ తర్వాత ఆ పోలీస్ స్టేషన్‌కు దగ్గర్లో ఉన్న జకురాడోర్ కరోంగ్ గ్రామంలోకి చొరబడ్డారు. అక్కడ ఆ మిలిటెంట్లు విధ్వంసం సృష్టించారు. దీంతో మిలిటెంట్లకు అడ్డుకట్ట వేసేందుకు.. భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. దీంతో ఆ మిలిటెంట్లు, సీఆర్పీఎఫ్ జవాన్ల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 11 మంది సాయుధులు చనిపోయారు. అయితే చనిపోయిన వారంతా కుకీ తిరుగుబాటుదారులుగా స్థానిక అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక అదే సమయంలో ఈ కాల్పుల్లో కొంతమంది సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా గాయపడినట్లు తెలుస్తోంది.
అయితే ఇటీవలె బిష్ణుపుర్ జిల్లాలో మిలిటెంట్లు జరిపిన దాడిలో ఓ మహిళ మృతి చెందడం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు కారణం అయింది. ఇంఫాల్ లోయలోని సైటాన్ ప్రాంతంలో నవంబర్ 9వ తేదీన ఈ ఘటన జరిగింది. పొలంలో పని చేసుకుంటున్న రైతులే లక్ష్యంగా.. మిలిటెంట్లు కాల్పులు జరిపారు. దీంతో అక్కడికక్కడే ఓ మహిళ చనిపోవడంతో.. గత కొన్ని రోజులుగా మణిపూర్‌లో ఉద్రిక్తతలు తగ్గినట్లే తగ్గి ఒక్కసారిగా మళ్లీ పాత పరిస్థితి నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com