Karwa Chauth Shock: కర్వా చౌత్ రాత్రి భర్తల ఇళ్లలే దోచేసిన 12 మంది నూతన వధువులు

కర్వా చౌత్’ రోజు ఉత్తర భారతదేశంలోని వివాహిత మహిళలు తమ భర్తల దీర్ఘాయుష్షు కోసం ఉపవాసం ఉండగా.. యూపీలోని అలీఘర్‌లో మాత్రం ఉహించని సంఘటన ఒకటి చోటుచేసుకుంది. కర్వా చౌత్ రాత్రి నూతన వధువులు జల్లెడలో చంద్రుడిని చూసి తమ భర్తలకు హారతి ఇచ్చి.. కుటుంబ సభ్యులకు మత్తుమందు కలిపిన ఆహరం పెట్టారు. అందరూ మత్తులోకి జారుకున్నాక ఇంటిలోకి డబ్బు, నగలను తీసుకుని పారిపోయారు. ఇలా జరిగింది ఒక ఇంట్లో కాదు.. ఏకంగా 12 ఇళ్లలో జరిగింది. దాంతో పన్నెండు కుటుంబాలలో కర్వా చౌత్ పండగ ఆనందం ఛిన్నాభిన్నమైంది. ఈ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనంతటికి కారణం బ్రోకర్లే అని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇది ఓ ముఠా పనిగా పోలీసులు అభివర్ణించారు. అమ్మాయిల కొరత ఎదుర్కొంటున్న కుటుంబాలను బ్రోకర్లు టార్గెట్ చేస్తున్నారు. బీహార్, జార్ఖండ్ నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి.. పెళ్లి కాని యువకులతో వివాహం చేయిస్తున్నారు. ఇందుకు గాను బ్రోకర్లు ఒక్కరి నుంచి రూ.80000 నుంచి రూ.1,50,000 రూపాయల వరకు తీసుకుంటున్నారు. వివాహం తర్వాత ఈ పన్నెండు మంది వధువులూ తమ అత్తమామల హృదయాలను గెలుచుకున్నారని దర్యాప్తులో తేలింది. కొందరు తమ అత్తగారితో పాటు ఆలయానికి వెళ్లే అలవాటును చేసుకున్నారు. మరికొందరు తమ భర్తలతో కలిసి పని కోసం పొలాలకు వెళ్లేవారు. పెళ్లైన కొన్ని రోజుల్లోనే మంచి నమ్మకం సంపాదించారు.
అలీఘర్‌లో 12 మంది నూతన వధువులు కర్వా చౌత్ రోజు ఇళ్లను అందంగా అలంకరించారు. గోరింట పూసుకుని వాళ్లు కూడా రెడీ అయ్యారు. ఉపవాసం ముగించే సమయంలో ఎవరికీ అనుమానం రాకుండా ఒక పన్నాగం పన్నారు. వధువులందరూ స్వయంగా విందు తయారు చేసి.. అందులో మత్తుమందు కలిపారు. ఉపవాసం ముగించాక కుటుంబ సభ్యులకు ఆ ఆహరం పెట్టారు. అందరూ స్పృహ కోల్పోయిన వెంటనే.. వారు తమ బ్యాగులను సర్దుకుని పారిపోయారు. ఉదయం కుటుంబ సభ్యులకు స్పృహలోకి వచ్చేసరికి అల్మారాలు, లాకర్లు ఖాళీగా ఉన్నాయి. వధువులు ఎవరూ కనబడలేదు. బ్రోకర్లకు కాల్ చేయగా.. వారి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేయబడ్డాయి. దాంతో విషయం అందరికీ అర్ధమయింది. ఇది యాదృచ్చికం కాదు.. ప్రణాళిక ప్రకారం వేసిన కుట్ర తెలుసుకున్నారు.
12 మంది భర్తలు సస్ని గేట్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ 12 మంది వధువు దొంగలు కలిసి రూ.30 లక్షలకు పైగా ఎత్తుకెళ్లారని తేలింది. బంగారం, వెండి ఆభరణాలు, నగదు, మొబైల్ ఫోన్లు కూడా చోరీ చేశారు. ఒక బాధితుడు మాట్లాడుతూ.. ‘వివాహం జరిగి 10 రోజులే అయింది. కర్వా చౌత్ నాడు ఎంతో ప్రేమతో పూజ చేశానని చెప్పింది. మేమందరం చాలా భావోద్వేగానికి గురయ్యాము. మా అదృష్టం మారిపోయిందని అనుకున్నాం. ఉదయం లేచేసరికి అంతా దోచుకుపోయింది’ అని తెలిపారు. ‘పెళ్లికి ముందు అమ్మాయిలు సాధారణ కుటుంబం నుండి వచ్చినట్లు నటించారు. దాంతో మాకు ఎటువంటి అనుమానం రాలేదు’ అని మరొక కుటుంబం తెలిపింది. వివాహాలను ఏర్పాటు చేసిన ఏజెంట్ల ఫోటోలు, పత్రాలను పోలీసులు సేకరిస్తున్నారు. మహిళల వివరాలు తెలుసుకునేందుకే పోలీసులు బీహార్, జార్ఖండ్‌లోని అనేక జిల్లాలను జల్లెడ పడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com