Child marriage: కర్ణాటకలో దారుణం, 14 ఏళ్ల బాలికకు బలవంతపు పెళ్లి..

Child marriage: కర్ణాటకలో దారుణం, 14 ఏళ్ల బాలికకు బలవంతపు పెళ్లి..
X
భర్తతో వెళ్లేందుకు నిరాకరించడంతో ఏం చేశారంటే

మన దేశంలో బాల్య వివాహాలపై ఎన్ని చట్టాలు తెస్తున్నా ఎక్కడో ఒక చోట మైనర్లకు బలవంతపు పెళ్లిళ్లు చేస్తూనే ఉన్నారు. పేదరికం, నిరక్షరాస్యత, అభద్రతా భావం తదితర కారణాలతో కొందరు తల్లిదండ్రులు తమ కుమార్తెలకు చిన్నతనంలోనే బలవంతంగా పెళ్లి చేసిన అత్తారింటికి సాగనంపుతున్నారు. తాజాగా కర్ణాటక లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 14 ఏళ్ల బాలికను 29 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే, పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్లేందుకు నిరాకరించిన బాలికను భర్త భుజాలపై ఎత్తుకుని వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

హోసూర్ జిల్లా తొట్టమంజు పర్వత ప్రాంతంలోని తిమ్మతూర్ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక స్థానికంగా ఉన్న పాఠశాలలో ఏడవ తరగతి వరకూ చదివింది. చదువు ఆపేసి ఇంటిపట్టునే ఉంటోంది. అయితే, బాలికకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ క్రమంలో తమ సమీప బంధువు అయిన 29 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేశారు. మార్చి 3వ తేదీన బెంగళూరులో ఈ పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత దంపతులిద్దరినీ స్వగ్రామానికి తీసుకొచ్చారు. అయితే, అత్తారింటికి వెళ్లడం ఇష్టం లేని బాలిక.. అక్కడి నుంచి పారిపోయి అమ్మమ్మ ఇంటికి చేరింది.

దీంతో బాలిక తల్లిదండ్రులు చిన్నారికి నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. అయినా బాలిక వినిపించుకోలేదు. ఎంత చెప్పినా వినకపోవడంతో భర్త, అత్తారింటి బంధువు ఒకరు బాలికను భుజాన వేసుకుని తమతో పాటు తీసుకెళ్లిపోయారు. బాలికను భుజంపై వేసుకొని వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన పోలీసులు రంగంలోకి దిగారు. బాలిక తల్లి, చిన్నారిని బలవంతంగా వివాహం చేసుకున్న వ్యక్తి, మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు. బాలిక ప్రస్తుతం తన అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉంది.

బాల్య వివాహాల నిషేధ చట్టం 2007 నవంబరు 1న అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం చిన్నతనంలో వివాహం చేసినా, ప్రోత్సహించినా రెండేళ్ల జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా, లేదంటే రెండూ విధించవచ్చు. నిబంధనలు ఇంత కఠినంగా ఉన్నా కూడా రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, ఏపీ, తెలంగాణ సహా తదితర రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో బాల్యావివాహాలు జరుగుతూనే ఉన్నాయి.

Tags

Next Story