Chhattisgarh: మొబైల్ ఫోన్ వాడద్దని చెప్పిన అన్నను చంపిన చెల్లెలు
ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాగఢ్ చుయిఖదాన్ గండై జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. అబ్బాయిలతో ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నావని మందలించినందుకు ఓ 14 ఏండ్ల బాలిక తన అన్నని నరికి చంపింది. అమ్లిదిహ్కల గ్రామంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గ్రామానికి చెందిన 14 ఏండ్ల బాలిక తరచూ ఫోన్‌లో అబ్బాయిలతో మాట్లాడుతున్నది. గమనించిన ఆమె అన్న (18).. ఇకపై ఫోన్‌లో అబ్బాయిలతో మాట్లాడొద్దని ఈ నెల 3న హెచ్చరించాడు. మొబైల్ వాడటానికి వీళ్లేదని చెప్పాడు. దీంతో అన్నపై కోపంతో రగిలిపోయిన ఆమె.. అతడు నిద్రపోతున్న సమయంలో గొడ్డలి తీసుకుని మెడపై నరికింది. తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
రక్తపు మరకలు కావడంతో స్నానం చేసిన ఆమె.. ఆ దుస్తులను దాచిపెట్టింది. అనంతరం తన అన్నని ఎవరో హత్యచేశారని ఇరుగుపొరుగువారికి చెప్పింది. దీంతో స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించారు. బాలికను తమదైన శైలిలో ప్రశ్నించడంతో నేరాన్ని ఒప్పుకున్నది. అన్నని తానే చంపానని, ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరని వెల్లడించింది. ఫోన్‌లో మాట్లాడినందకు తనను దూషించడాని.. అందుకే చంపేశానని తెలిపింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com