Kerala: కేరళ ఆలయంలో బాణసంచా పేలుడు.. 150 మందికి గాయాలు

కేరళ ఆలయ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. కేరళలో కాసర్‌గోడ్‌లోని ఓ ఆలయంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో బాణసంచా పేలుడు ప్రమాదంలో 150 మందికి పైగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంజోతంబలం వీరర్కవు ఆలయంలో వార్షిక కాళియాట్లం ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఆలయం సమీపంలో నిల్వ ఉన్న బాణసంచా పేలడంతో మంటలు చెలరేగాయని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఆలయ వేడుకలు నేటి రాత్రితో వేడుక ముగియాల్సి ఉండగా, అందుకోసం రూ. 25 వేల విలువైన తక్కువ తీవ్రత కలిగిన బాణసంచాను ఆలయ అధికారులు కొనుగోలు చేసి ఓ గదిలో భద్రపరిచారు. కాగా, ఈ ప్రమాదంలో 150 మందికిపైగా గాయపడగా, వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కాసరగోడ్, కన్నూర్, మంగళూరులోని పలు ఆసుపత్రులకు తరలించి చికిత్సను అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ ప్రమాదంపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. భద్రతా రాహిత్యం వల్లనే ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. ‘ బాణసంచా నిల్వ ఉన్న ప్రాంతానికి కనీసం 100 మీటర్ల దూరంలో క్రాకర్లు కాల్చాలనే నిబంధనలు పాటించలేదు. నిల్వలకు సైతం అనుమతి తీసుకోలేదని విచారణలో వెల్లడైంది. ఘటనా స్థలంలో నమూనాలు సేకరించి కేసు నమోదు చేశాం’ అని వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com