Amarnath yatra: 15వేల మంది యాత్రికులు సేఫ్..16కు చేరిన మృతులు..కొనసాగుతున్న రెస్క్యూ

Amarnath yatra: 15వేల మంది యాత్రికులు సేఫ్..16కు చేరిన మృతులు..కొనసాగుతున్న రెస్క్యూ
Amarnath yatra: అమర్‌నాథ్‌ యాత్రలో మృతుల సంఖ్య 16కు చేరింది. 15వేల మంది యాత్రికులు సురక్షితం. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి

అమర్‌నాథ్‌ యాత్రలో మృతుల సంఖ్య 16కు చేరింది. ఇప్పటికీ గల్లంతైన వారి ఆచూకీ లభించలేదు. దీంతో ఇండియన్ ఆర్మీ ముమ్మర గాలింపు చేపడుతోంది. ఆకస్మిక వరదల్లో 40 మంది వరకు గల్లంతయ్యారని అధికారులు చెబుతున్నారు. ఫ్లాష్‌ ఫడ్‌ కారణంగా అమర్‌నాథ్‌ గుహ వద్ద వేలాది మంది చిక్కుకుపోయారు. ఇప్పటివరకు దాదాపు 15వేల మంది యాత్రికులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు ఐటీబీపీ అధికారులు చెబుతున్నారు. వరదల కారణంగా దాదాపు 65 మంది గాయపడినట్టు తెలుస్తోంది. వీరిని వాయుసేన విమానాల్లో ఆసుపత్రికి తరలించారు.

ఏపీ, తెలంగాణ నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వెల్లడంతో ఇప్పుడు ఆ కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట టీఆర్‌ఎస్‌ నాయకుడు జల్లిపల్లి శ్రీరామమూర్తితో పాటు మరో ఆరుగురు, ఇతర ప్రాంతాలకు చెందిన 40మందితో కలిసి ఐదు రోజుల క్రితం అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లారు. అయితే, శ్రీనగర్‌ కు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలోనే నిలిపివేయడంతో వీరంతా క్షేమంగానే ఉన్నారు. ఇక సిద్దిపేటకు చెందిన అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అమర్‌నాథ్‌ యాత్ర సమీపంలోని బాల్తాల్‌ బేస్‌క్యాంపు వద్ద భారీ లంగర్‌ ఏర్పాటు చేశారు. సిద్దిపేటకు చెందిన 20 మందితోపాటు భోజనానికి వచ్చిన భక్తులు సురక్షితంగా ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. వరద ప్రభావం గుహ వద్దనే ఉందని చెప్పారు.

అమర్‌నాథ్‌ మంచు లింగాన్ని దర్శించుకునేందుకు జూన్‌ 30 నుంచి యాత్ర ప్రారంభించారు. నిన్న సాయంత్రం ఈ క్షేత్రానికి సమీపంలో ఒక్కసారిగా భారీ కుండపోత వర్షం పడి వరద పోటెత్తింది. చూస్తుండగానే కొండల పైనుంచి భారీఎత్తున వర్షపు నీరు ముంచెత్తింది. కొండలపైనుంచి పెద్ద ఎత్తున రాళ్లు, బురద కొట్టుకొచ్చాయి. రాళ్లతో దూసుకొస్తున్న వరద చూసిన యాత్రికులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో అనేక మంది గాయపడ్డారు.

ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రాంతంలో కొండచరియలు ఏమీ విరిగిపడటం లేదు. కాకపోతే బోలేనాథ్‌ గుహ వద్ద ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పైగా యాత్రకు వెళ్లే దారులు ధ్వంసం అవడంతో.. తాత్కాలికంగా అమర్‌నాథ్ యాత్రను నిలిపివేశారు. అటు సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకం జరగడం లేదు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌తో పాటు భారత సైన్యం, ఎస్‌డీఆర్ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్, ఇతర భద్రతా సిబ్బంది సహాయకచర్యల్లో పాల్గొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story