Anant Bagrodia: విద్యార్థే కాదు... సంస్కర్త కూడా.

16 ఏళ్ల కుర్రాడు ఏం చేస్తుంటాడు... కాలేజీకో స్కూల్‌కో వెళ్తుంటాడు. తల్లిదండ్రులతో సరదాగా గడుపుతుంటాడు. చెల్లిని ఏడిపిస్తూ అల్లరి చేస్తుంటాడు. లేదా బుద్ధిగా చదువుకుంటుంటాడు. దాదాపుగా ప్రతీ ఇంట్లో జరిగేది ఇదే. కానీ అంత చిన్న వయసులో సమాజానికి ఏదైనా మంచి చేయాలని సంకల్పిస్తే... ఆ సంకల్పం పేద పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించేదే అయితే... ఆ లక్ష్యం దిశగా పయనిస్తున్న ఆ కుర్రాడికి కేవలం 16 ఏళ్లే అయితే.... ఆశ్చర్యంగా ఉంది కదూ... పదండి ఆ అద్భుత కార్యాన్ని వాస్తవ రూపంలోకి తెస్తున్న అనంత్ బగ్రోడియా(Anant Bagrodia) గురించి తెలుసుకుందాం...
అనంత్ బగ్రోడియా.... ఢిల్లీలోని వసంత్ వ్యాలీ స్కూల్లో( Vasant Valley School in New Delhi) చదువుకుంటున్నాడు. వయసు 16 ఏళ్లు. చిన్నప్పటి నుంచి బగ్రోడియాకు మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్( Machine Learning and Data Science) అంటే చాలా ఇష్టం. సమాజం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలను పరిష్కరించేందుకు టెక్నాలజీనే శక్తివంతమైన సాధనంగా ఆనంత్ భావించేవాడు. టెక్నాలజీపై పట్టు సాధించిన బగ్రోడియాను కాలం మరో మార్గంలో పయనించేలా చేసింది.
కరోనా మహమ్మారి విజృంభణతో చాలామంది పిల్లలు పాఠశాల విద్యకు దూరమయ్యారు. ఆ సంక్షోభ సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న చాలామంది విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులు వినే మార్గం లేకుండా పోయింది. కేవలం ప్రభుత్వ పాఠశాలలో 8.1 శాతం మంది పిల్లలు మాత్రమే ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యారు. ఇదీ ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల మధ్య అంతరాన్ని చాలా పెంచింది. దీనిపై అనంత్ దృష్టి పడింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టెక్నాలజీని చేరువ చేయాలని భావించాడు. దీనిపై తన తల్లితో చర్చించిన అనంతరం ఓ నిర్ణయం తీసుకున్నాడు. నుున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ(MCD) లోని ప్రభుత్వ పాఠశాలల్లో నిరుపేద పిల్లలకు టెక్నాలజీలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.
అలా ఢిల్లీలో ఉన్న నిరుపేద పిల్లలకు టెక్నాలజీపై బోధించేందుకు వాలంటీర్లను సమీకరించేందుకు వాలంటీర్ ఫర్ MCD స్కూల్స్ యాప్ (Volunteer for MCD Schools app) ను ప్రారంభించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ట్యూషన్‌లకు వెళ్లలేక పోతున్న వేలాదిమంది విద్యార్థులకు ఈ యాప్‌లో నిపుణులు పాఠాలు బోధిస్తారు. ఈ యాప్ ద్వారా 120 మంది విద్య వాలంటీర్లు ఇప్పటికే 19 పాఠశాలల్లోని విద్యార్థులకు స్వచ్ఛందంగా పాఠాలు బోధిస్తున్నారు.
విద్య వాలంటీర్లు, పాఠశాలలు ఈ యాప్ మంచి ఫలితాలు ఇస్తున్నట్లు తెలిపినట్లు అనంత్ తెలిపాడు. ఇప్పటికీ దీన్ని ప్రోత్సహించడానికి క్రమం తప్పకుండా పాఠశాలలకు వెళ్తూనే ఉన్నానని వెల్లడించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com