Amarnath Yatra: అమర్‌నాథ్‌ యాత్రలో 17కు చేరిన మృతుల సంఖ్య..

Amarnath Yatra: అమర్‌నాథ్‌ యాత్రలో 17కు చేరిన మృతుల సంఖ్య..
Amarnath Yatra: అమర్‌నాథ్‌ యాత్రలో మృతుల సంఖ్య 17కు పెరిగింది. గల్లంతైన 40 మంది జాడ ఇప్పటి వరకు తెలియరాలేదు.

Amarnath Yatra: అమర్‌నాథ్‌ యాత్రలో మృతుల సంఖ్య 17కు పెరిగింది. గల్లంతైన 40 మంది జాడ ఇప్పటి వరకు తెలియరాలేదు. వరదల కారణంగా మొత్తం 65 మంది గాయపడ్డారు. వీరిని వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్, సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. ప్రస్తుతం యాత్రికులంతా ఎక్కడికక్కడే టెంట్లలో ఉండాలంటూ విజ్ఞప్తి చేశారు. 15వేల మంది యాత్రికులను రెస్ట్‌ క్యాంప్‌ అయిన పంచతరణికి తరలించారు. పరిస్థితులు సర్దుమణిగాక మళ్లీ యాత్రను ప్రారంభిస్తామని తెలిపారు.

రాళ్లు, బురదతో కూడిన వరద రావడంతో.. గల్లంతైన యాత్రికుల్లో చాలా మంది శిథిలాల కిందే ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అందుకే కొన్ని అడుగుల లోతు తవ్వి మరీ వెతుకుతున్నారు. స్నిఫర్‌ డాగ్స్‌ సాయంతోనూ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. డ్రోన్లు, అత్యాధునిక పరికరాలను ఉపయోగిస్తున్నారు. రెండు రోజులైనా గల్లంతైన వారి జాడ తెలియకపోవడంతో.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఈసారి అమర్‌నాథ్‌ యాత్రకు తెలంగాణ నుంచి వెయ్యి మంది భక్తులు వెళ్లారు. అయితే, ఆకస్మిక వరదల్లో తెలంగాణ భక్తులు చనిపోయినట్టు గాని, గాయపడినట్టు గాని ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు. బోలేనాథ్ గుహ వద్ద చిక్కుకున్న యాత్రికులను రక్షించి.. హెలికాప్టర్ల ద్వారా శ్రీనగర్‌కు తరలించినట్టు తెలిపారు. ఇక ఏపీ నుంచి ఈసారి 61 మంది భక్తులు అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లారు. వీరిలో ఎక్కువ మందితూర్పు గోదావరి జిల్లా వాళ్లే. ఫ్లాష్‌ ఫ్లడ్‌లో గాయపడిన వారిని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. అయితే, గాయపడిన వారి పేర్లను అధికారులు ఇప్పటి వరకు విడుదల చేయలేదు.

Tags

Read MoreRead Less
Next Story