Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్..రెండు ఘటనల్లో 18 మంది మావోయిస్టుల మృతి

బస్తర్ రీజియన్ వరుస ఎదురుకాల్పులతో నెత్తురోడుతోంది. శనివారం రెండు వేర్వేరు ఘటనల్లో 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో మావోయిస్టు పార్టీ ఎస్‌జడ్‌సీ సభ్యుడు, దర్బా డివిజన్ ఇన్‌ఛార్జి జగదీశ్ అలియాస్ బుద్రా ఉన్నాడు. అతనిపై రూ.25 లక్షల రివార్డు ఉంది. 2013లో కేంద్ర మాజీ మంత్రి విద్యాచరణ్ శుక్లా, సల్వాజుడుం సృష్టికర్త మహేంద్ర కర్మతో పాటు 30 మంది కాంగ్రెస్ నాయకులు మావోయిస్టుల కాల్పుల్లో చనిపోయిన విషయం తెలిసిందే. ఆ దాడికి జగదీశ్ ప్రధాన కుట్రదారుడిగా దస్త్రాల్లో నమోదైంది.
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా-దంతెవాడ సరిహద్దు కేరళపాల్ పోలీసుస్టేషన్ పరిధిలోని గోగుండ ప్రాంతంలోని ఊపంపల్లి అడవుల్లో మావోయిస్టులు ఉన్నారనే నిఘావర్గాల సమాచారంతో డీఆర్‌జీ (డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్), సీఆర్పీఎఫ్-159 బెటాలియన్ సంయుక్త బలగాలు ఆపరేషన్ నిర్వహించాయి. శనివారం ఉదయం 8 గంటల సమయంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. అనంతరం ఆ ప్రాంతంలో 17 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు సుక్మా ఎస్పీ కిరణ్‌చవాన్ వివరించారు. ఈ ఘటనలో దర్బా డివిజన్ ఇన్‌ఛార్జి జగదీశ్ హతమయ్యాడన్నారు. సుక్మా జిల్లా పిట్టేడబ్బా పోలీసుస్టేషన్ పరిధిలోని పౌర్గుడెంకు చెందిన జగదీశ్‌పై రూ.25 లక్షల రివార్డు ఉందని, 12 కేసులు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. 2023లో సుక్మా జిల్లాలోని అరన్‌పుర్‌లో డీఆర్‌జీ జవాన్లపై జరిగిన దాడిలోనూ జగదీశ్ ప్రధాన సూత్రధారని పేర్కొన్నారు. మృతుల్లో 11 మంది మహిళలు ఉన్నారని.. మొత్తం ఏడుగురిని గుర్తించామని, మిగిలిన వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు డీఆర్‌జీ, ఒక సీఆర్పీఎఫ్ జవాన్‌కు గాయాలు కాగా వారిని హెలికాప్టర్‌లో రాయ్‌పుర్ తరలించారు. వారి పరిస్థితి సాధారణంగా ఉందని ఎస్పీ వివరించారు. సుక్మా ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలు 17 మంది మావోయిస్టులను మట్టుబెట్టడం మరో విజయంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎక్స్‌లో పేర్కొన్నారు. బీజాపుర్ జిల్లాలో నర్సపుర్-టేక్మెట్ల గ్రామాల మధ్య శనివారం జరిగిన మరో ఎదురుకాల్పుల ఘటనలో ఓ మావోయిస్టు మృతి చెందాడు. మృతదేహాన్ని, ఆయుధాన్ని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆ ప్రాంతంలో గాలింపు కొనసాగిస్తున్నారు.
హంతక కగార్ దాడులను ఖండించండి
ఛత్తీస్‌గఢ్‌లో జనవరి 12 నుంచి మార్చి 25 వరకు 78 మంది మావోయిస్టులను, ఆదివాసీలను హతమార్చిన కేంద్ర, రాష్ట్ర హంతక కగార్ దాడులను ప్రజాస్వామిక వాదులు, ప్రజా సంఘాలు ఖండించాలని మావోయిస్టు పార్టీ బస్తర్ డివిజన్ అధికార ప్రతినిధి మోహన్ పిలుపునిచ్చారు. బూటకపు ఎన్ కౌంటర్లను తక్షణమే నిలిపేయాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com