Uttarakhand: మదర్సా ఘటనలో మృతులు ఇద్దరే..250 మందికి గాయాలు

ఉత్తరాఖండ్‌లో అక్రమంగా నిర్మించిన మదర్సా కూల్చివేతతో చెలరేగిన ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటికే ఇద్దరు మరణించగా 250 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. తొలుత నలుగురు మరణించినట్లు వార్తలు వచ్చినా తర్వాత మృతుల సంఖ్య రెండేనని కలెక్టర్ వెల్లడించారు. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో అక్రమంగా నిర్మించారన్న ఆరోపణలతోమదర్సాను కూల్చివేయడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. హైకోర్టు ఆదేశాలతో మదర్సాను కూల్చి వేసేందుకు ప్రభుత్వ అధికారుల బృందంప్రయత్నించడంతో ఘర్షణలు చెలరేగాయి. వన్‌భుల్‌పురా ప్రాంతంలోని నివాసితుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. బుల్‌డోజర్లతో మదర్సాను ధ్వంసం చేసేందుకు అధికారులు ప్రయత్నించడంతో ఆగ్రహించిన స్థానికులు, మహిళలతో సహా వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు.
ఈ ఘర్షణల్లో 20కి పైగా ద్విచక్రవాహనాలు,సెక్యూరిటీ బస్సును కూడా నిరసనకారులు తగులబెట్టారు. పోలీస్ స్టేషన్ బయట వాహనాలకు నిప్పు పెట్టడంతో హింస మరింత తీవ్రరూపం దాల్చింది. పోలీసు కారుతో సహాపలు వాహనాలకు కూడా నిప్పు పెట్టినట్లు అధికారులు తెలిపారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు టీయర్ గ్యాస్ ప్రయోగించారు. ఘర్షణల్లో 250మందికిపైగా గాయపడగా అందులో వందమందికి పైగా పోలీసులు ఉన్నట్లు వెల్లడించారు. ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ఇప్పటికే హల్ద్వానీ నగరంలో కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు అమల్లోకి తెచ్చారు. కర్ఫ్యూ కూడా విధించారు. పారామిలటరీ బలగాలను భారీగా మోహరించారు. నగరంలోని పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు. శాంతిభద్రతల పరిస్థితిని కాపాడే ప్రయత్నంలో ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపేసినట్లు పుష్కర్‌సింగ్ థామీ ప్రభుత్వం తెలిపింది.
హైకోర్టు ఆదేశాల మేరకే అక్రమ నిర్మాణాలను కూల్చేసినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రహ్లాద్ మీనా తెలిపారు. పోలీసులు ఎవరినీ రెచ్చగొట్టలేదని... అయినప్పటికీ, వారిపై దాడి చేశారని నైనిటాల్ కలెక్టర్ వందనా సింగ్ తెలిపారు. బంభూల్‌పురా పోలీసు స్టేషన్‌ను అల్లరిమూకలు ధ్వంసం చేశాయని... పోలీసు సిబ్బందిని స్టేషన్‌లోనే సజీవంగా తగల బెట్టేందుకు ప్రయత్నించారని వెల్లడించారు. పెట్రోల్ బాంబులతో పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారని వివరించారు. పోలీసులు ఆత్మ రక్షణ కోసమే కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. సుమారు 1,100 మంది పోలీసులను మోహరించినట్లు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు ముందస్తు నోటీసులిచ్చి కూల్చివేసినట్లు వెల్లడించారు. హింసాత్మక ప్రాంతాలకు నాలుగు కంపెనీల పారామిలటరీ బలగాలను పంపినట్లు ఐజీ నీలేష్ ఆనంద్ భర్నే తెలిపారు. ఉధమ్ సింగ్ నగర్ నుంచి రెండు కంపెనీల భద్రతా బలగాలు కూడా హాల్ద్వానీకి చేరుకున్నాయి.
హైకోర్టు ఆదేశాలతో అక్రమ నిర్మాణాలను కూల్చేందుకుఒక బృందాన్ని హల్ద్వానీ ప్రాంతానికి పంపినట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. ఆ ప్రాంతంలోని సంఘ వ్యతిరేక శక్తులు పోలీసులతో ఘర్షణకు దిగాయని.. సీఎం వెల్లడించారు. శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు అదనపు పోలీసులు, కేంద్ర బలగాలను ఆ ప్రాంతంలో మోహరిస్తామని శాంతిభద్రతలు కాపాడతామని థామి ప్రజలకు హామీనిచ్చారు. సీనియర్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన పుష్కర్‌సింగ్ థామీ నిషేధాజ్ఞలు, కర్ఫ్యూ, కనిపిస్తే కాల్చివేత సహా ఆంక్షలను అమల్లోకి తెచ్చినట్లు ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com