Indian Army: బరువులు మోస్తూ. సైనిక అవసరాలకు కొత్త జంతువు

భారత సైన్యం సరిహద్దులో భద్రత, ఇతర అవసరాలకు కొత్తగా జంతువుల సేవలను ఉపయోగించుకుంటోంది. లద్ధాఖ్‌లో వివిధ సవాళ్లను ఎదుర్కొంటున్న భారత సైన్యం సరిహద్దులో పహారా కాసేందుకు, సామాగ్రి తరలింపునకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో లేహ్‌లోని డిఫెన్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ (డీఐహెచ్ఏఆర్) రెండు మాపురాల (బాక్ట్రియన్) ఒంటెలకు బందోబస్తుకు ఉపయోగపడేలా, బరువులు మోసేందుకు సహకరించేలా ఇస్తున్న శిక్షణ సత్ఫలితాలు ఇస్తున్నాయని అధికారులు తెలిపారు.
పర్వతాల్లోని మారుమూల ప్రాంతాలకు చేరుకునేందుకు ఇప్పటికీ జన్స్‌కర్ వంటి గుర్రాలపై ఆధారపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆర్మీ లాజిస్టిక్స్ అవసరాలకు ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు చేరుకునేందుకు ఈ ఒంటెలు ఉపయోగపడతాయని డీఐహెచ్ఏఆర్ తెలిపింది. లద్ధాక్ సెక్టార్ లో సామాగ్రి చేరవేతకు 1999 కార్గిల్ యుద్దం నుండి జన్‌స్కర్లను విస్తృతంగా ఉపయోగించారు. ఇదే అవసరాల కోసం చైనా సరిహద్దున తూర్పు లద్ధాఖ్ లో బాక్ట్రియన్ ఒంటెలతో నిర్వహించిన ప్రాధమిక పరీక్షలు విజయవంతం అయ్యాయి.
పెట్రోలింగ్, బరువులు మోయడం వంటి పనుల కోసం బాక్ట్రియన్ ఒంటెలపై ట్రయల్స్ చేపట్టగా, సత్ఫలితాలు వచ్చాయని డీఐహెచ్ఏఆర్ వెల్లడించింది. సాధారణ పనులతో పోలిస్తే సైనిక అవసరాలకు సంబంధించి శిక్షణ భిన్నంగా ఉంటుందని, యుద్ద సమయంలో కూడా బెదరకుండా , సిబ్బంది ఆదేశాలకు అనుగుణంగా అవి పని చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. జడల బర్రెలను ఉపయోగించడంపైనా ట్రయల్స్ జరుగుతున్నాయని తెలిపారు.
దృఢంగా ఉండే బాక్ట్రియన్ ఒంటెలు ఎత్తైన ప్రాంతాల్లో జీవించగలవు. అలానే దాదాపు రెండు వారాల పాటు ఆహారం తీసుకోకుండా కూడా ఉండగలవు. 150 కిలోలకుపైగా బరువును సులభంగా మోయగలవు. అలానే జడల బర్రెలు కూడా ఎత్తైన ప్రదేశాల్లో వంద కిలోలకు పైగా బరువులను మోసేందుకు అనువుగా ఉంటాయి. అతిశీతల ఉష్ణోగ్రతలను ఇవి తట్టుకోగలవు. అందుకే సైన్యం వీటి సేవల వినియోగానికి చర్యలు చేపట్టింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com