J& K : వలస కార్మికులపై ఉగ్రవాదుల దాడి

జమ్ముకశ్మీర్ లో వలస కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. అనంత్ నాగ్ జిల్లాలో ఇద్దరు వలస కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కార్మికులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడ్డ కార్మికుల పరిస్థితి బాగానే ఉందని అధికారులు తెలిపారు. కాల్పుల జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కాల్పులకు పాల్పడిన ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. ఈ నెల 13న షోపియాన్ జిల్లాలోని గాగ్రెన్ ప్రాంతంలో ముగ్గురు వలస కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు.
ఇక పూంచ్ జిల్లా సింధారాలో మంగళవారం భారత ఆర్మీ, జమ్ము పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారంతా విదేశీ టెర్రరిస్టులని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో నాలుగు ఏకే-47 రైఫిళ్లు, రెండు పిస్టల్స్, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
జమ్ము కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు చేసిన తర్వాత ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలను నెలకొల్పటం సమస్యగా మారింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల ఆపరేషన్లు చేపట్టి.. ఉగ్రవాదులను బయటికి లాగి సైన్యం మట్టుబెడుతోంది. తాజాగా ఆపరేషన్ త్రినేత్ర 2 అనే మిషన్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ ఆపరేషన్ త్రినేత్ర 2 సత్ఫలితాలను ఇస్తోంది. ఇప్పటివరకు జమ్ము కశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే దీని తరువాత ఈ విధంగా వలస కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులకు దిగారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com