Brain Infection: కొత్తగా వెలుగులోకి అరుదైన బ్రెయిన్ వ్యాధి..

కేరళను అరుదైన ‘‘బ్రెయిన్ ఇన్ఫెక్షన్’’ భయపెడుతోంది. ‘‘అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్’’గా పిలిచే వ్యాధితో మరో ఇద్దరు మరణించారు. కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మూడు నెలల శిశువుతో సహా ఇద్దరు వ్యక్తులు ఈ అరుదైన వ్యాధికి బలైనట్లు ఆరోగ్య అధికారులు సోమవారం తెలిపారు. దీంతో ఈ ప్రాణాంతక వ్యాధితో మరణించిన వారి సంఖ్య ఆగస్టు నాటికి 3కు చేరింది.
కోజికోడ్ జిల్లాలోని ఒమస్సేరికి చెందిన అబూబకర్ సిద్దిక్ కుమారుడు గత నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చికిత్స తీసుకుంటున్న సమయంలో పరిస్థితి దిగజారి ఆదివారం ఐసీయూలో మరణించారు. ఆగస్టు 14న, తమరస్సేరీకి చెందిన తొమ్మిదేళ్ల బాలిక ఇదే ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో మరణించింది. కోజికోడ్, మలప్పురం, వయనాడ్ జిల్లాల నుండి మరో ఎనిమిది మంది రోగులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ ప్రధానంగా కలుషనీటిలో ఈత కొట్టడం, స్నానం చేయడం ద్వారా వస్తుంది. ఈ ఏడాది కేరళ వ్యాప్తంగా మొత్తం 42 కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు ఈ జిల్లాలోని బావులు, నీటి నిల్వ ట్యాంకుల్లో క్లోరినేషన్ ప్రారంభించారు. వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
లక్షణాలు ?
ఈ వ్యాధి ఇన్ఫెక్షన్ లక్షణాలు సాధారణంగా ఒకటి నుంచి ఏడు రోజులలో కనిపిస్తాయి
తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వాంతులు లేదా వికారం
మెడ బిగుసుకుపోవడం, మానసిక గందరగోళం, కంటి దృష్టిలో మార్పులు
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం చాలా అవసరం. ఎందుకంటే ఈ వ్యాధి చాలా వేగంగా ముదిరిపోతుంది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com